నగదు, నగలతో పాటు టమాటాలు దోచుకెళ్లారు
మంగళవారం ఉదయానికి ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉండాల్సిన రూ.1.28..
దొంగతనం అంటే.. నగదు, నగలు, విలువైన వస్తువులు, విలువైన వాహనాల వరకూ పరిమితం. కానీ.. నిత్యావసర వస్తువులు కూడా చోరీకి గురవుతాయని, అందులోనూ టమాటాలు కూడా చోరీ చేస్తారని ఎవరూ కల్లో కూడా ఊహించరు. బీరువాలో ఉన్న నగదు, నగలతో పాటు ఫ్రిడ్జ్ లో ఉన్న కిలో టమాటాలను కూడా దోచుకెళ్లాడో దొంగ. ఈ ఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో సోమవారం (జులై 10) రాత్రి దొంగలు పడ్డారు. ఆ ఇల్లు మున్సిపల్ ఉద్యోగి రఫీకి చెందినది. కుటుంబమంతా సిద్ధిపేటలో బంధువుల ఇంటికెళ్లారు.
మంగళవారం ఉదయానికి ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉండాల్సిన రూ.1.28 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలు కనిపించలేదు. ఫ్రిడ్జ్ డోర్ కూడా తెరచి ఉండటంతో.. అనుమానమొచ్చి చూస్తే అందులో ఉన్న కిలో టమాటాలు కూడా ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అంత డబ్బు, నగలు తీసుకెళ్లినా.. టమాటాలు వదిలేయడానికి మనసొప్పలేదు ఆ దొంగకి. బాధితుడు రఫీ తన ఇంట్లో జరిగిన దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై పీటర్, క్లూస్ టీం ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు.