ఆలపాటికి ఈసారి కూడా అంత ఈజీ కాదా?

గుంటూరు జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట అనే మాట వినిపిస్తుంది. ఈ జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌ట్టు సాధించింది. రెండు ద‌శాబ్దాలుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తూనే [more]

Update: 2021-05-23 06:30 GMT

గుంటూరు జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట అనే మాట వినిపిస్తుంది. ఈ జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌ట్టు సాధించింది. రెండు ద‌శాబ్దాలుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తూనే ఉంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో తెనాలి ఒక‌టి. ఇక్కడ పార్టీ ఆవిర్భవించిన త‌ర్వాత‌.. మొత్తం ఐదు సార్లు టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌.. ఉర‌ఫ్ రాజా 15 ఏళ్లుగా తెనాలిని త‌న అడ్డాగా మార్చుకున్నారు. గ‌తంలో వేమూరు నుంచి గెలిచిన ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌ ఆ సీటు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో తెనాలికి మారారు. 2009లో ఇక్కడ ఓడిన ఆయ‌న .. 2014లో విజ‌యం సాధించారు. పార్టీని కూడా బ‌లోపేతం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ.. వైసీపీ తుఫాన్ నేప‌థ్యంలో ఇక్కడ టీడీపీ ప‌రాజ‌యం పాలైంది.

స్థానికంగా హవా…..

గెలుపు, ఓట‌ములు స‌హ‌జం అని అనుకున్నా.. వాస్తవానికి ఇక్కడ పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌ మాత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారనే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా.. ఏస‌భా వేదిక ఎక్కినా.. లోక‌ల్ స‌మ‌స్యల‌ను ప్రశ్నించ‌డం లేదు. లోకల్‌గా ఉన్న ప్రజ‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం రాష్ట్ర స్థాయి రాజ‌కీయాలు.. జాతీయ నేత‌ల‌‌ను విమ‌ర్శించ‌డం వంటివ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఆయ‌న అప్పుడ‌ప్పుడు హ‌డావిడి చేస్తున్నా తెనాలి కేడ‌ర్‌కు దూరం కావ‌డంతో స్థానికంగా ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌ హ‌వా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

అన్ని వర్గాలను దూరం చేసుకుని…..

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌సంస్థల ఎన్నిక‌ల్లో తెనాలిలో అధికార పార్టీ నేత‌ల దూకుడుతో టీడీపీ నాయ‌కులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ముఖ్యంగా వైశ్య, బ్రాహ్మణ సామాజిక వ‌ర్గాల్లో ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌పై వ్యక్తిగ‌త వైరుధ్యం పెర‌గ‌డం ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నేత‌లు దాడులు చేయ‌డం.. పోలీసుల‌తో కేసులు పెట్టించ‌డం వంటివి చేశారు.. దీంతో వారంతా తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో కూడా మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌ వారిని పెద్దగా ప‌ట్టించుకోలేదు. కేవ‌లం నాలుగు ధైర్య వ‌చ‌నాలు చెప్పి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం ష‌రా మామూలే అన్నట్టుగా మారిపోయింది.

ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ….

ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌ గుంటూరులోనే మ‌కాం వేసి తెనాలికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుండ‌డంతో పార్టీ కేడ‌ర్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. ఈ ప‌రిణామాలు అన్ని ఆల‌పాటిపై తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో వ్యతిరేక‌త పెరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి పార్టీపై సానుభూతి ఉన్నప్పటికీ.. వ్యక్తిగా ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌పై మాత్రం వ్యతిరేక‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఇప్పటికైనా ఆయ‌న క్షేత్రస్థాయిలో పార్టీని ప‌ట్టించుకుని, నాయ‌కుల స‌మ‌స్యలు, ప్రజ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌క‌పోతే తెనాలిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఎదురీత త‌ప్పద‌నే అంటున్నారు.

Tags:    

Similar News