అల వైకుంఠపురములో మూవీ రివ్యూ

బ్యాన‌ర్స్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్‌ న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, [more]

Update: 2020-01-12 07:41 GMT

బ్యాన‌ర్స్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్‌
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రాజేంద్ర ప్ర‌సాద్, వెన్నెల‌కిషోర్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్‌ త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
నిర్మాత‌లు: అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్రమ్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ అనగానే క్రేజీ కాంబోస్ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు గుర్తుకురావడం అందులో త్రివిక్రమ్ పంచ్ కామెడీ డైలాగ్స్, అల్లు అర్జున్ కామెడీ యాంగిల్ అన్ని గుర్తుకురావడం సహజం. ఇక ముచ్చటగా ఈ కాంబోలో తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడడం… అంచనాలకు తగ్గట్టుగా అల్లు అర్జున్ స్టయిల్, మ్యానరిజం, సాంగ్స్ సూపర్ హిట్ కావడం, ట్రైలర్, టీజర్ లో త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్ అన్ని సినిమాపై ఇంకా హైప్ పెంచేసాయి. డీజే తో సూపర్ కాంబినేషన్ గా మార్కులు కొట్టేసిన అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించడంతో పాటుగా టబు తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడం, సచిన్ ఖేడ్కర్, మురళి శర్మ, రావు రమేష్, సుశాంత్, నవదీప్, నివేత పేతురేజ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు ఉండంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య డిజాస్టర్ తర్వాత బాగా అలోచించి చేసిన కథ అల వైకుంఠపురములో కావడంతో.. సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఓ డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తో హిట్ కొట్టాడా? త్రివిక్రమ్ మార్క్ కామెడీ ని ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేసారు? టీజర్, ట్రైలర్ లో ఉన్న పట్టు కథలో కూడా కంటిన్యూ అయ్యిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
వాల్మీకి (మురళీశర్మ) భార్య రోహిణి, రామచంద్ర (జయరాం) భార్య టబు ఒకేసారి ఇద్దరు మెగా పిల్లలకి జన్మనిస్తారు. అయితే తన కొడుకు డబ్బున్న ఇంట్లో పెరగాలన్న స్వార్ధంతో వాల్మీకి.. రామచంద్ర బిడ్డని తన బిడ్డగా.. తన బిడ్డని రామచంద్ర బిడ్డగా… బిడ్డలను మార్చేస్తాడు. వాల్మీకి తనదగ్గర పెరిగే రామచంద్ర బిడ్డ బంటు(అల్లు అర్జున్)ని తనలాగే మిడిల్ క్లాస్ బుద్దులతోనే పెంచుతాడు. 20 ఏళ్ల తరువాత బంటు ( అల్లు అర్జున్) ఉద్యోగ ప్రయత్నాలు ఉంటూ తండ్రి వాల్మీకితో తిట్లు తింటూ ఉంటాడు. అదే సమయంలో అమూల్య (పూజా హెగ్డే) నడుపుతున్న ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో అమూల్యకి అసిస్టెంట్ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అలా మొదలైన అమూల్య, బంటుల పరిచయం ప్రేమగా మారుతుంది. బిజినెస్‌లో భాగంగా బంటు తన అసలు తండ్రి రామచంద్ర ను కలవడానికి అతని ఆఫీస్‌కు వెళ్తాడు. ఆ సమయంలో రామచంద్ర ని ఓ పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాడు. అసలు రామచంద్రే తన అసలు తండ్రి అని బంటుకి తెలుస్తుందా? రామచంద్ర కుటుంబానికి ఎవరి వలన ప్రమాదం వస్తుంది? ఆ ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని బంటు ఎలా కాపాడుకున్నాడు? అమూల్య – బంటులా ప్రేమ.. పెళ్లిగా మారుతుందా? అసలు ఈ కథకు దుర్మార్గుడైన అప్పల నాయుడు (సముద్రఖని) కి సంబంధం ఏంటి..? బంటు అప్పలనాయుడికి స్పాట్ ఎలా పెట్టాడు? అన్నదే మిగతా కథ.

నటీనటులు:
అల్లు అర్జున్ లోని కామెడీ యాంగిల్ ని త్రివిక్రమ్ ఎప్పుడో బయటికి తీసాడు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కామెడీతో అదరగొట్టేసాడు. ఇక అల వైకుంఠపురములో కూడా మిడిల్ క్లాస్ బంటు పాత్రలో కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, సెంటిమెంట్‌ ఇలా అన్నింటిలో తనదైన స్టైల్‌లో చెలరేగిపోయాడు. వైకుంఠపురములో అడుగుపెట్టాక కూడా తనదైన స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ ఇరగదీసాడు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అంతా వన్‌మేన్‌ షోలా సాగింది. కామెడీ టైమింగ్‌, స్టైలింగ్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సూపర్బ్‌ అనిపించాడు. ఈ సినిమాలో బన్నీ తర్వాత అంతగా చెప్పుకోవలసిన పాత్ర విలక్షణ నటుడు మురళీశర్మది. మురళి శర్మ మరోసారి తన మార్క్‌ చూపించాడు. కొడుకును నిరుత్సాహపరిచే తండ్రి పాత్రలో ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక పూజ హెగ్డే గ్లామరస్ గ కనబడి మెప్పించింది. అల్లు అర్జున్ – పూజ కాంబో సీన్స్, ఇద్దరి డాన్స్ హైలెట్. అయితే పూజ పాత్ర తీరుతెన్నులు అంతగా లేవు. ఇక మరో హీరోయిన్ నివేత పేతురేజ్ పాత్రకు నటించే స్కోప్ లేదు. టబు, జయరామ్‌లు తమ పాత్రలో హుందాగా ఒదిగిపోయారు. ఎమోషనల్‌ సీన్స్‌ను వారి అనుభవంతో అద్భుతంగా పండించారు. విలన్ గా ప్రత్యేకమైన మ్యానరిజంతో సముద్రఖని నటన చాల బావుంది. సుశాంత్ కానీ, నవదీప్ కానీ, వెన్నెల కానీ, సునీల్ కానీ… తమ స్థాయి పత్రాలు చెయ్యలేదనిపిస్తుంది. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
అల్లు అర్జున్ ఇప్పటివరకు పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రాలకు పెద్ద పీట వెయ్యలేదు. కానీ ఈ సినిమాతో అల్లు అర్జున్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసాడనిపిస్తుంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు ఓ స్పెషల్ వర్గం ఆడియన్స్ ఉంటారు. త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా తీస్తున్నారో అనవసరం. అయన టేకింగ్, అయన పంచ్ కామెడీ, అయన డైలాగ్స్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. మరి అలాంటి అల్లు అర్జున్ తో సినిమా అంటే.. ఆ అంచనాలు హై లో ఉంటాయి. ఎందుకంటే వారి కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్స్ కనక. మరి ఆ అంచనాలతోనే వీరి కాంబోలో అల వైకుంఠపురములో స్థానం మారినా.. స్థాయి మారదని కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మరి ఎప్పటిలాగే త్రివిక్రమ్‌ తనదైన డైలాగ్ పంచులతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. త్రివిక్రమ్ మ్యాజిక్‌కు అల్లు అర్జున్ స్టైల్‌, కామెడీ టైమింగ్, పర్ఫామెన్స్‌ తోడై అల వైకుంఠపురములో ఫస్ట్‌ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది. బలమైన కథ కాకపోయినా త్రివిక్రమ్‌ తన టేకింగ్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌లు ఆడియన్స్‌ను పలకరిస్తాయి. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఎంతో గ్రిప్పింగ్‌గా నడిపించిన త్రివిక్రమ్‌, ద్వితీయార్థం విషయంలో అంత పట్టు చూపించలేకపోయాడు. ముఖ్యంగా వావ్ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, కథపరంగానూ పెద్దగా ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకపోవటంతో కథనం ఫ్లాట్‌గా సాగుతున్న భావన కలుగుతుంది. అయితే బోర్డ్ మీటింగ్‌ సీన్‌ ఆడియన్స్‌ను కూర్చిల్లో కూర్చోనివ్వదు. ఆ సీన్‌లో అందరు హీరోలను బన్నీ ఇమిటేట్‌ చేయటం ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయిస్తుంది. క్లైమాక్స్‌లో పాట నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్‌ వావ్‌ అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలోనూ త్రివిక్రమ్‌ మార్క్‌ కామెడీ ఆడియన్స్‌కు కితకితలు పెడుతుంది. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథలో వేగం పెరుగుతుంది. ఎమోషనల్‌ క్లైమాక్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌తో కంటతడిపెట్టిస్తుంది. అయితే త్రివిక్రమ్ ఈసారి కూడా ఈ సినిమా తాలూకా ప్రధాన ప్రతిబింబాన్ని ఎప్పటిదో సినిమా నుంచి తీసుకున్నదే. దానిని నేటి తరానికి తగ్గట్టుగా తీర్చి దిద్దారు.ఇదే కాస్త నిరాశ కలిగించే అంశం.

సాంకేతికంగా..
థమన్ మ్యూజిక్ సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ అయ్యింది. అల వైకుంఠపురములో సాంగ్స్ మ్యూజికల్ గా ఎంతగా ఆకట్టుకున్నాయో.. విజువల్ గాను అదుర్స్ అనిపించాయి. ఇక నేపధ్య సంగీతంలోనూ థమన్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక పి.ఎస్‌.వినోద్‌ ఫోటోగ్రఫి సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా కలర్‌ఫుల్‌గా చూపించేందుకు సినిమాటోగ్రాఫర్‌ పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. ముఖ్యంగా సాంగ్స్‌లో విజువల్స్‌ చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉన్నాయి. ఇక సినిమాకి ఉన్న మైనస్ పాయింట్ లో నవీన్‌ నూలి ఎడిటింగ్ మెయిన్ గా కనబడుతుంది. నవీన్ ఎడిటింగ్ బాగా నిరాశపరుస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలకు ఇంకాస్త కోత పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నిర్మాతలు అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీగా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు అద్భుతమని చెప్పాలి.

రేటింగ్: 3.0/5

Tags:    

Similar News