ఏ నిమిషాన.. ఏ ముహూర్తాన ప్రమాణం చేశామో కదా?

అదేంటే పెద్ద కుర్చీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తారు. అపుడు క్షణాలు యుగాలుగా మారి కడు భారంగా ఉంటాయి. అదే కుర్చీ ఎక్కగానే ఒక్కసారిగా కాలం [more]

Update: 2020-04-21 13:30 GMT

అదేంటే పెద్ద కుర్చీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తారు. అపుడు క్షణాలు యుగాలుగా మారి కడు భారంగా ఉంటాయి. అదే కుర్చీ ఎక్కగానే ఒక్కసారిగా కాలం కరిగిపోతుంది. అపుడే వైభోగం అయిపోతోందా అన్న బెంగ పట్టుకుంటుంది. ఇపుడు ఏపీలోని పాతిక మంది మంత్రుల పరిస్థితి అలాగే ఉంది. వీరిలో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎటూ అమాత్య కుర్చీలకు నీళ్ళు వదిలేశారు. మిగిలిన వారు ఇపుడు బితుకుబితుకుమంటున్నారు. ఎందుకంటే జగన్ పెట్టిన రెండున్నరేళ్ళ కండిషన్. అధికారాన్ని ఏమీ అనుభవించకుండానే తొలి ఏడాది ముగుస్తోంది అన్న బాధ మంత్రుల్లో ఉంది.

గిర్రున తిరిగిందా…?

ఇంకా జగన్ పాదయాత్రలోనే ఉన్నాడు, అధికారం కోసం పోరాటం చేస్తున్నట్లుగానే ఉంది. చూస్తుండంగానే ఏడాది దగ్గర పడిపోయింది. అధికారంలోకి వస్తూనే ఖాళీ ఖజానా వెక్కిరించడంతో మంత్రులు పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా కుదురుకుంటూ ఉన్నారన‌గా కరోనా కోరలు చాచింది. ఇది కొన్ని నెలల ప్రహసనంగా ఉంది. కరోనా వెళ్ళిపోయినా గతంలోలా మంత్రులు ఆర్భాటాలు, హడావుడి చేయడానికి కూడా ఉండదు. కనీసం ఏడాది పాటు అయినా కరోనా ప్రభావం ఉంటుందని అంతా అంటున్నారు. తీరా ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడిన సమయానికి రెండున్నరేళ్ళు గడువు ముగిసి మంత్రులు మొత్తంగా కుర్చీ దిగాల్సి ఉంటుంది.

కరోనా కత్తి….

ఇక ఇప్పటివరకూ మంత్రుల పనితీరుకు జిల్లా అభివృధ్ధి అన్నారు. మధ్యలో స్థానిక ఎన్నికల ఫలితాలు అని కూడా అన్నారు. హైకమాండ్ ఆదేశాలతో ఎలాగోలా ఎన్నికల్లో పార్టీని నెగ్గించి వైసీపీ మంత్రులు తడాఖా చూపించాలనుకున్నారు. ఇపుడు కరోనా మధ్యలోకి వచ్చేసి కొత్త టార్గెట్ పెట్టేసింది. దాంతో ఏ జిల్లాలో కరోనా తగ్గుదల ఉందో, ఈ పెను విపత్తు సమయంలో ఎవరు బాగా సేవలు అందించారో కూడా హై కమాండ్ చూస్తుందని అంటున్నారు. అంటే కరోనా రాకతో పారామీటర్లు, రేటింగు కూడా ఒక్కసారిగా మారిపోయిందన్న మాట. కరోనా మహమ్మారి ప్రాణాలు తీయడమే కాదు, పదవులు కూడా ఎక్కడ లాగేసుకుంటుందో అన్న భయం మంత్రుల్లో ఉంది. మొత్తానికి తాము ఏ నిమిషాన ప్రమాణం చేశామో కానీ తొలి దఫా మంత్రి పదవి హానీ మూన్ అసలు కానేకాదు, హడలెత్తించేస్తోందని మంత్రులు ఆఫ్ ది రికార్డు మధనపడుతున్నారంటే అందులో అర్ధముందిగా.

Tags:    

Similar News