ఆనం అలకకు కారణమిదేనా…?

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో కీల‌క నేత‌లు చాలా మంది తెర‌చాటునే ఉండిపోయారు. త‌మ వ్యాఖ్యల‌తో రాజ‌కీయాల్లో సంచ‌ల‌న సృష్టించి, పెద్ద పేరు తెచ్చుకున్న వారు కూడా [more]

Update: 2019-08-28 14:30 GMT

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో కీల‌క నేత‌లు చాలా మంది తెర‌చాటునే ఉండిపోయారు. త‌మ వ్యాఖ్యల‌తో రాజ‌కీయాల్లో సంచ‌ల‌న సృష్టించి, పెద్ద పేరు తెచ్చుకున్న వారు కూడా ఇప్పుడు తెర వీడి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పైగా.. ప్రభుత్వం స‌హా జ‌గ‌న్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నా కూడా మౌనంగా ఉండ‌డంతో అస‌లు వీరికి ఏమైంది? అనే సందేహం రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, గ‌ట్టి వాక్పటిమ ఉన్న మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దీంతో నెల్లూరులో వైసీపీకి గ‌ట్టిగా మాట్లాడే నాయ‌కుడు లేక పోవ‌డంపై స‌ర్వత్రా విస్మయం వ్యక్తమ‌వుతోంది.

చాలా మంది నేతలున్నా……

నిజానికి నెల్లూరులో వైసీపీకి చాలా మంది నాయ‌కులే ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాద‌వ్ ఏకంగా జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఫైర్ బ్రాండ్ కూడా. అయితే, ఆయ‌న వ్యాఖ్యలు వివాదాల‌ను త‌గ్గించ‌డం, ప్రభుత్వాన్ని కాపాడ‌డం మాట అటుంచితే.. కొత్త వివాదాల‌కు కార‌ణం అవుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక‌, కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కూడా ఫైర్ బ్రాండే అయినా కూడా ఆయ‌న కూడా నోరు విప్పితే వివాదాలే. ఆయ‌న ఏం మాట్లాడినా.. తిరిగి పార్టీ నాయ‌కులు అటు ఆయ‌న‌ను, ఇటు పార్టీని, మ‌రోప‌క్క అధినేత‌ను కూడా కాపాడుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీకి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి అవసరం ఉంది.

కీలక సమయాల్లోనూ…..

ఈ నేప‌థ్యంలో ఉన్న మ‌రో ఇద్దరు నాయ‌కుల్లో కాకాని గోవ‌ర్దన్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిలు ఒకింత నిర్దిష్టంగా, ఆచితూచి అడుగులు వేస్తార‌నే పేరుంది. వీరిలో ప్రధానంగా ఇప్పుడు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మౌనంగా ఉండ‌డంపై పార్టీ నేత‌లు చ‌ర్చిస్తున్నారు. నిజానికి ఆయ‌న విమ‌ర్శలు చేస్తే.. ప్రతి విమ‌ర్శ చేసేందుకు ప్రత్యర్థులు వెతుక్కునే ప‌రిస్థితి కూడా ఉంది. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. అటు రాజ‌ధాని విష‌యం కానీ, పోల‌వ‌రం విష‌యంకానీ, అన్న క్యాంటీన్ల విష‌యం కానీ, రివ‌ర్స్ టెండ‌ర్స్ విష‌యం కానీ, పార్టీ విధానాల‌పై కానీ, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. దీనికి కార‌ణ‌మేంటి? ఇలాంటి నాయ‌కులు ఈ సమ‌యంలో మౌనంగా ఉంటే ఎలా? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

నియోజకవర్గానికే…..

అయితే, త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేదని, మేన‌ల్లుడుకి స్థానికంగా నామినేటెడ్ ప‌ద‌వి కూడా ద‌క్కలేద‌ని, కిందిస్థాయి కార్యక‌ర్తల్లో ఇంకా పుంజుకోలేద‌ని, త‌న‌ను లెక్కలోకి కూడా తీసుకోవ‌డం లేద‌నే ఆవేద‌నఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిలో ఉంద‌ని అందుకే ఆయ‌న మౌనం వ‌హిస్తున్నార‌ని కొంద‌రు అంటున్నారు. సీనియ‌ర్ నేత‌గా ఉన్నా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి చిన్నపాటి నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వడం లేదు స‌రిక‌దా.. ఒక‌ప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన ఆయ‌న ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవ్వడం కూడా ఆయ‌న‌కు ఇష్టంలేద‌న్నట్టుగా జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యంలో ప్రత్యేక శ్ర‌ద్ధ తీసుకుని ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News