అంతా ఆయన చేతిలోనే….!!!

అన్బుమణి రాందాస్…ఈయన తమిళనాడులో బలమైన నేత. పొట్టాలి మక్కల్ కాంచి (పీఎంకే) పార్టీని స్థాపించారు. వన్నియార్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంటుంది. గత అసెంబ్లీ [more]

Update: 2019-02-22 18:29 GMT

అన్బుమణి రాందాస్…ఈయన తమిళనాడులో బలమైన నేత. పొట్టాలి మక్కల్ కాంచి (పీఎంకే) పార్టీని స్థాపించారు. వన్నియార్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్జుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోకపోయినా ఆయనకు పదిలమైన ఓటు బ్యాంకు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు పీఎంకే కు ఉంది.జయలలిత గత ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించినా పీఎంకే అధినేత అన్జుమణి రాందాస్ మాత్రం అనేక స్థానాల్లో డీఎంకే ను వెనక్కు నెట్టేసి ద్వితీయ స్థానంలో పార్టీని నిలబెట్టారు. దీంతో అన్జుమణి రాందాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది.

పీఎంకేతో జతకట్టడానికి….

అందుకే అధికార అన్నాడీఎంకే పీఎంకే కోసం వెంపర్లాడింది. తమ ఓటు బ్యాంకుకు తోడు పీఎంకే ఓట్లు జత చేరితే విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా పార్లమెంటు స్థానాలు పీఎంకేకు ఎక్కువ ఇవ్వడానికి కూడా ఇదే కారణమంటున్నారు. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకేలు సీట్ల సర్దుబాటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంటే.. పీఎంకేకు ఏడు పార్లమెంటు స్థానాలను కేటాయించడం విశేషం. దీనితో పాటు ఒక రాజ్య సభ స్థానాన్ని కూడా ఇస్తామని ప్రకటించడం విశేషం.

మాస్ లీడర్ గా….

ఆషామాషీ పార్టీలకు ఇది సాధ్యం కాదు. రాందాస్ కు మాస్ లీడర్ గా పేరుంది. మంచి వక్త. తమిళనాడులో వివిధ సమస్యలపై ఆయన స్పందించిన తీరు కూడా ప్రజలను ఆకట్టుకుంది. మెకెదాటు ఆనకట్ట వ్యవహారం కావచ్చు….రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదల విషయంలో కావచ్చు ….గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి విషయాల్లో ఆయన పట్టుబట్టిన తీరు ప్రశంసలందుకుంది. అంతేకాదు వన్నియార్ సామాజిక వర్గం ఆయనకు అండగా ఉండటం, ఆయన పార్టీ ప్రభావం అనేక నియోజకవర్గాల్లో ఉండటంతో అన్నాడీఎంకే పీఎంకేను చంకనెక్కించుకుంది.

ఓట్ల శాతాన్ని చూసి…..

గత అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే కు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి 25 శాతం వరకూ ఓట్లు సాధించడం విశేషం. గత ఎన్నికల్లో పోలయిన ఓట్లు శాతాన్ని చూస్తే పీఎంకేను తీసిపారేయడానికి వీలులేదు. గత ఎన్నికల్లో పాపిరెడ్డిపట్టి, నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదిహేను వేల ఓట్ల వరకూ పీఎంకే తెచ్చుకుంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దానికి పీఎంకే మద్దతు అధికార అన్నాడీఎంకేకు అవసరం. ఉప ఎన్నికల్లో గెలవకుంటే రాష్ట్రంలో అధికారం చేజారిపోతోంది. అందుకే ముందు చూపుతో రాందాస్ తో జత కట్టింది. మరి రాందాస్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేను గట్టున పడేస్తారా? తన ఓటు బ్యాంకును అధికార పార్టీకి బదలాయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News