భారతీయ జనతాపార్టీ చేతిలో ఒక అపూర్వ అవకాశం వికసిస్తోంది. మోడీ, అమిత్ షా మొరటు రాజకీయాలతో దేశ రాజకీయచిత్రపటాన్ని చిన్నాభిన్నం చేసి ఏకచ్ఛత్రాధిపత్యంలోకి తెచ్చేశారు. దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే వారికి కొరుకుడుపడని గుగ్గిళ్లుగా ఉన్నాయి. పూర్తి మెజార్టీ లేకపోయినా తాజాగా కర్ణాటక ఫలితం కొంత ఉత్సాహాన్నే నింపింది. ఈ రిజల్టును వ్యూహాత్మకంగా వినియోగించుకుంటే ఇంతకాలం అంటిన రాజకీయ మచ్చను తొలగించుకుని దీర్ఘకాలంలో మరింత రాటుదేలే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అయితే అధికారానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి ఇష్టపడని మోడీ, అమిత్ షాలు అంతటి ఔదార్యాన్ని కనబరుస్తారా? కరుణ కురిపిస్తారా? తగ్గి, నెగ్గుతారా? టెంపరరీ ఓటమి దీర్ఘకాల విజయానికి ఎలా దారితీస్తుందన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
తగ్గి..నెగ్గడమంటే..? ..
కర్ణాటకలో మెజార్టీకి బీజేపీ బెత్తెడు దూరంలో ఆగిపోయింది. పాపులర్ ఓటు విషయంలో కాంగ్రెసు పార్టీ కంటే వెనకబడే ఉంది. అయితే ఎన్నికల వ్యవస్థలోని ఫస్టు పాస్ట్ ద పోస్టు సిస్టంలో ఉండే లోపాల కారణంగా మొత్తంగా ఓట్లు ఎక్కువ వచ్చినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రాతిపదిక లేదు. నలుగురు పోటీ పడితే 25 శాతం పైగా ఓట్లు వచ్చిన వ్యక్తి కూడా విజేత అయ్యేందుకు అవకాశం ఉంది. నిజానికి భారతీయ జనతాపార్టీకి ప్రస్తుతం కన్నడ ఓటరు తీర్పు పాక్షిక విజయమే. దీనిని ఆసరా చేసుకుని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమంటే ప్రజల్లో పలచనకావడమే. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి మెజార్టీ నిరూపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రత్యర్థుల చీలికలు, అవసరమైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇంకా కాకుంటే ఇతర ఎమ్మెల్యేలు ఓటింగుకు గైరు హాజరుకావడం వంటి సకల మాయోపాయాలు సిద్దంగానే ఉన్నాయి. అయితే ఇది ప్రజాతీర్పును గౌరవించడం మాత్రం కాబోదు. దక్షిణభారతంలో పాదుకోవాలని, నిలిచి గెలవాలని కోరుకుంటున్న బీజేపీకి టెంపరరీ గెలుపుగానే మిగిలిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. అదే జేడీఎస్, కాంగ్రెసుల సంకీర్ణానికి అవకాశమిచ్చి చూస్తే బీజేపీకి జాతీయంగా చాలా అడ్వాంటేజీ ఉంటుందనేది పరిశీలకుల అంచనా. దీనికి రకరకాల సమీకరణలను ప్రాతిపదికగా చెబుతున్నారు.
ఆధిపత్య పోరు..అస్థిరత...
తమ రాజకీయ అవసరాల కోసం జేడీఎస్, కాంగ్రెసు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పూర్తికాలం ఈ సర్కారు మనుగడ సాగించలేదనేది స్థిరమైన అభిప్రాయం. కాంగ్రెసులోని చాలామంది ఎమ్మెల్యేలు అధిష్ఠానం నిర్ణయం పట్ల గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మౌనం వహించినప్పటికీ పదవుల పంపిణీ, పంపకాలు పూర్తయిన తర్వాత అసంతృప్తి సెగలు మొదలవుతాయి. తమలో సగం కూడా బలం లేని జేడీఎస్ కు పదవుల వాటాలో అధికభాగం దక్కితే చూస్తూ ఊరుకునేంత సహనం కాంగ్రెసు నాయకుల్లో ఉండదు. ఎటొచ్చీ కులవాటాలు, డిమాండ్లు ఉండనే ఉంటాయి. హస్తం పార్టీ అధిష్ఠానం తమనేతలకు ఎంతో కొంత సర్ది చెప్పచూసినా మరో బాగస్వామి జేడీఎస్ కలిసికట్టుగా ఉంటుందనేది అనుమానమే. జేడీఎస్ లోనే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే ప్రమాదం ఉంది. అందరికీ పదవులు సాధ్యం కాదు.దేవెగౌడ కుటుంబపరమైన విభేదాలు ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయి. అందుకే కాంగ్రెసు, జేడీఎస్ కాంబినేషన్ మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయే అవకాశాలే ఎక్కువ. ఇదే జరిగితే అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ తాము తప్పుకుని వీళ్లకు అవకాశమిస్తే పాలించడం రాక రోడ్డెక్కారని బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సానుకూలత ఏర్పడుతుంది. ఈ కూటమి వైఫల్యం తర్వాత ప్రభుత్వ ఏర్పాటును తన చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బీజేపీకి మద్దతు పెరుగుతుంది. జాతీయంగా విమర్శించాలని కాచుక్కూర్చున్న విపక్షాల నోళ్లు మూతపడక మానవు. కర్ణాటకలో ప్రస్తుతమున్న వాతావరణంలో స్థిరమైన ప్రభుత్వం నెలకొల్పాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. జేడీఎస్ , కాంగ్రెసుల కాంబినేషన్ అవసరార్థ పొత్తు మాత్రమే అనేది రాజకీయాలు తెలిసిన వారెవరైనా అంగీకరించే నిజం.
2019 కోణంలో...
బీజేపీకి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కంటే 2019 సార్వత్రిక ఎన్నికలే కీలకం. ఆ కోణంలో ఆలోచించినప్పుడు జేడీఎస్, కాంగ్రెసు కాంబినేషన్ ను కొంతకాలం పాటు కొనసాగించడం కమలం పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. మానిఫెస్టో మొదలు ఆలోచనల వరకూ ఈ రెండు పార్టీల వైఖరి భిన్నం. విభేదాలు మొదలై విడిపోవడానికి ఏడాది సమయం కూడా పట్టదు. అప్పుడు ఈ పార్టీలు బద్ధశత్రువులుగా మారి 2019లో తలపడే అవకాశం ఉంటుంది. ఒకరకంగా బీజేపీ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. కాంగ్రెసు, జేడీఎస్ లు రెంటినీ దోషులుగా ప్రజల ముందు నిలిపే అద్భుతమైన అవకాశం చిక్కుతుంది. తద్వారా క్లీన్ స్వీప్ కు అవసరమైన ప్రజామద్దతు కమలానికిదొరుకుతుంది. అదే కాంగ్రెసు, జేడీఎస్ ల సంఖ్యను తోసిపుచ్చి బేరసారాలతో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నెలకొల్పితే నైతికంగా మొదట్నుంచే ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమకు అవకాశం దక్కలేదనే అక్కసుతో విపక్షంలో ఉన్న జేడీఎస్, కాంగ్రెసుల మైత్రి మరింత పటిష్టమవుతుంది. ప్రజాపోరాటాలు రెండు పార్టీలు కలిసి చేస్తే 2019 నాటికి బీజేపీకి కష్టాలు తప్పవు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్, కాంగ్రెసు కలిసి పోటీచేస్తే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ పట్టుమని పది సీట్లు కూడా తెచ్చుకోలేదనేది రాజకీయ పరిశీలకుల జోస్యం. విపక్షాల ఐక్యతను దూరం చేయాలంటే వారిని కలవనివ్వడమే మేలు. ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ ఒకటై భవిష్యత్తులో దెబ్బకొట్టకుండా చూసుకోవాలంటే ఇదే వ్యూహాన్ని అనుసరించాలి. పదవీ కాంక్షతో కొట్టుమిట్టాడుతున్న యడియూరప్ప, బీజేపీ స్థానిక నేతలను సంత్రుప్తిపరచడం అత్యవసరం అనుకుంటే సర్కారుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయొచ్చు. కానీ ఈపరిణామం జాతీయంగానూ, రాష్ట్రంలోనూ విపక్షాల మధ్య ఐక్యతకు దారి తీస్తుంది. కమలానికి భవిష్యత్తులో కలవరం కలిగించే అంశంగా మారుతుంది.
- ఎడిటోరియల్ డెస్క్