Badvel : బద్వేల్ మొత్తాన్ని మార్చేస్తుందా?

బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. తమ పార్టీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెబుతూ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని [more]

Update: 2021-10-04 05:00 GMT

బద్వేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. తమ పార్టీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని చెబుతూ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని చెప్పడంతో జనసేన, బీజేపీ పొత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బద్వేల్ తోనే వారి మధ్య వైరం ప్రారంభమయిందనే అనుకోవాలి. బీజేపీ పోటీ చేస్తామని ముందుకు రావడం ఎవరూ ఊహించని పరిణామం. బలంలేని చోట కూడా పోటీకి దిగుతుంది అంటే పవన్ కల్యాణ్ కు తామేమో చెప్పేటందుకేనని అంటున్నారు.

తామే ప్రతిపాదించినా….

బద్వేల్ లో పోటీ చేయాలని తొలుత జనసేనను బీజేపీయే కోరింది. తిరుపతి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేేసినందున మిత్రపక్షంగా ఉన్న జనసేనను పోటీ చేయాలని కోరింది. జనసేన కూడా ఒకరకంగా సిద్ధమయింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చించారు కూడా. కాని చర్చలు జరిపి గంటలు గడవకముందే ఎవరితో సంప్రదించకుండా పవన్ కల్యాణ్ తాము బద్వేల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిచారు.

అక్కడి నేతలతో చర్చించి…

బీజేపీ నేతలకు పవన్ కల్యాణ్ వ్యవహారం రుచించలేదు. ఇదేదో తేడా కొట్టేలా ఉందని భావించింది. వెంటనే కడప జిల్లా బీజేపీ నేతలైన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి వారితో సోము వీర్రాజు చర్చించారు. పోటీ చేయాల్సిందేనని వారు కూడా చెప్పడంతో బరిలోకి దిగుతున్నారు. ఇక బద్వేల్ లో పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే ఉండనుంది. దీంతో ఇక్కడ ఎన్నిక ఏకపక్షమే అయినా బద్వేలు రాజకీయ ముఖ చిత్రం మార్చేస్తుందంటున్నారు.

మద్దతు కూడా ఇవ్వకపోవచ్చు…..

బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా దానికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చే వీలులేదు. తాను విలువల కారణంగానే పోటీ నుంచి తప్పుకున్నాను కనుక ప్రచారానికి ఆయన రారు. దీంతో ఒంటరిగానే బీజేపీ ఇక బరిలోకి దిగాల్సి ఉంటుంది. జనసేన మద్దతు ప్రకటన కూడా పవన్ కల్యాణ్ చేయకపోవచ్చు. బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే ఎన్నికల్లో పార్టీల పరిస్థితి ఎలా ఉందో చెప్పనుంది. ఇప్పటికే టీడీపీ కూడా బరి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఏకపక్షమే. అయితే జనసేన, బీజేపీ పొత్తు మధ్య మాత్రం బీటలు వారినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News