ఈయనకూ భారమే… పార్టీకీ బరువే

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉద‌య‌గిరి. ఇది ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. అలాంటి చోట‌.. పునాదులు వేసుకోవాల‌ని, పార్టీని నిల‌బెట్టుకోవాల‌ని టీడీపీ ఎన్నిప్రయ‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేదు. [more]

Update: 2020-08-15 05:00 GMT

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉద‌య‌గిరి. ఇది ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. అలాంటి చోట‌.. పునాదులు వేసుకోవాల‌ని, పార్టీని నిల‌బెట్టుకోవాల‌ని టీడీపీ ఎన్నిప్రయ‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేదు. అలాంటి చోట‌.. ఎట్టకేల‌కు ఓ మంచి నాయ‌కుడు ల‌భించాడులే అని టీడీపీ అధినేత భావించారు. ఆయ‌న‌కే వ‌రుస‌గా టికెట్లు ఇస్తున్నారు. ఆయ‌న ఏం చెప్పినా చేస్తున్నారు. గ‌త ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచిన బొల్లినేని వెంక‌ట రామారావుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ప‌ద‌వులు లేక‌పోయినా.. ప్రాధాన్యం ఇచ్చారు. ఆయ‌న‌కు కావాల్సిన‌వి చేసి పెట్టారు.

అందుకే వాడుకున్నారు…..

అయితే, పార్టీని వాడుకున్న బొల్లినేని రామారావు ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ స్థాప‌న నుంచి చూస్తే.. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో 1999లో ఒక‌సారి కంభం విజ‌య‌రామిరెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 2014లో బొల్లినేని రామారావు అత్తెస‌రు మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో బొల్లినేని పార్టీని డెవ‌ల‌ప్ చేస్తార‌ని చంద్రబాబు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, నేను-నాది అనే సంస్కృతి ఎక్కువ‌గా ఉన్న బొల్లినేని.. త‌న శ్రీనివాస క‌న్‌స్ట్రక్షన్‌తో పాటు ఇత‌ర‌త్రా వ్యాపారం కోస‌మే రాజ‌కీయాలు వాడుకున్నార‌ని ప్రచారంలో ఉంది.

అన్ని సార్లు అవకాశమిచ్చినా…..

2012లో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నేప‌థ్యంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బొల్లినేని రామారావుకి చంద్రబాబు అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్పటికీ.. త‌ర్వాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లోనూ మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లోనే ముక్కీమూలిగా గెలుపు గుర్రం ఎక్కారు. త‌ర్వాత తాను ఎలాగూ ఎమ్మెల్యే అయిపోయాన‌ని భావించిన బొల్లినేని రామారావు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని, ప్రజ‌ల‌ను, అభివృద్ధిని పూ‌ర్తిగా మ‌ర్చిపోయారు. చివ‌ర‌కు సొంత పార్టీ కేడ‌ర్ సైతం ఆయ‌న్ను ఎందుకు గెలిపించామురా ? బాబూ అని త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఓటమి తర్వాత రెండు సార్లు….

ఇటు పార్టీ అధికారంలో ఉండ‌డంతో త‌న ప‌ద‌విని, పార్టీ ప‌వ‌ర్ అడ్డం పెట్టుకుని ఆయ‌న ఇత‌ర రాష్ట్రాల్లో నిర్మాణ రంగ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నారు. ఈ క్రమంలోనే మ‌హ‌రాష్ట్రలో ఆయ‌న కంపెనీ చేప‌ట్టిన ప‌నులు కొన్ని నాసిర‌కంగా ఉన్నాయ‌ని విమ‌ర్శలు రావ‌డంతో పాటు ఆయ‌న కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టికెట్ ఇచ్చినా.. ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మొహం చూసింది కేవ‌లం రెండంటే రెండు సార్లు మాత్రమే. దీంతో ఇక్కడ పార్టీని ప‌ట్టించుకునే నాథుడు క‌రువ‌య్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ…

ద్వితీయ శ్రేణి కేడ‌ర్ త‌మ ప‌నుల కోసం ఇప్పటికే కొంద‌రు అధికార పార్టీతో కలిసి పోయారు. మ‌రి కొంద‌రు పార్టీ మారిపోయారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో చివ‌ర‌కు టీడీపీ త‌ర‌పున ఎనిమిది మండ‌లాల్లో అభ్యర్థుల‌ను నిల‌బెట్టేందుకు ఎవ‌రూ దొర‌కని ప‌రిస్థితి ఉంది. కొన్ని చోట్ల పోటీ చేసే అభ్యర్థుల‌కు ఎంతో కొంత డ‌బ్బులు ఇచ్చి నామినేష‌న్లు వేయించిన పరిస్థితికి టీడీపీ దిగ‌జారింది. జిల్లా నాయ‌క‌త్వం ఉద‌య‌గిరిని అస్సలు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసింది. మ‌రి ఇప్పటికైనా చంద్రబాబు బొల్లినేని రామారావును మార్చడంతో పాటు కొత్త వ్యక్తికి బాధ్యత‌లు అప్ప‌గించాల‌ని టీడీపీ నాయ‌కులు కోరుతున్నారు.. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News