అలా అయితేనే ఓట్లు పడతాయా..?

రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రతీ రోజూ 50 వేల మంది కార్యకర్తలతో [more]

Update: 2019-03-22 02:30 GMT

రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రతీ రోజూ 50 వేల మంది కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం చేయాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతీరోజు ఐదారు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు ప్రచార తీరు చూస్తుంటే మాత్రం ఆయన తాను చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి జగన్ ను విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత తేవడానికి వీలైనంత కష్టపడుతున్నారు. ప్రతీ రోజు, ప్రతీ మీటింగ్ లో జగన్ పట్ల అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రసంగాలు, ప్రచార తీరు చూస్తుంటే తన మంచి గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి చెడ్డవాడని చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

జగన్ అంటేనే భయపడేలా

జగన్మోహన్ రెడ్డి నేరస్థుడని, అవినీతిపరుడని, బాబాయ్ ను చంపారని, కోడికత్తి(జగన్ పై జరిగిన హత్యాయత్నం) డ్రామా ఆడుతున్నారని, మోదీతో రాజీపడ్డాడని, కేసీఆర్ తో కలిసి కుట్ర చేస్తున్నాడని, డేటా చోరీ చేశారని, ఓట్లు తొలగించారని, ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వస్తే రౌడీరాజ్యం వస్తుందని, రాష్ట్రం నాశనమవుతుందని, పెట్టుబడులు రావని, అభివృద్ధి ఆగిపోతుందని, జగన్ కు అనుభవం లేదని, కేసీఆర్ పెత్తనం ఉంటుందని, రకరకాల ప్రచారం చేస్తూ ప్రజలను జగన్ అంటేనే ప్రజలు భయపడాలి అనేలా ప్రచారం చేస్తున్నారు. అయితే, రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రత్యర్థిపై విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం తప్పేమీ కాదు. చేయాలి కూడా. అయితే, ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తాను ఇవి చేశానని, మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని చేస్తానని చెప్పుకోవాలి. దీని ద్వారానే ఓటర్లను ఎక్కువగా ఆకర్షించుకోవాలి. ఇక, ప్రత్యర్థి మంచివారు కాదని, వారు గెలిస్తే సమస్యలు వస్తాయని ప్రజలకు చెప్పడం సహజం. చంద్రబాబు మాత్రం తన పాలన గురించి చెప్పడం కంటే ప్రత్యర్థిని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

వారిని బూచిగా చూపించడం ద్వారా

తెలంగాణలో చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ ఎన్నికల్లో లాభపడ్డ ఫార్ములానే చంద్రబాబు ఫాలో అవుతున్నారు. జగన్ గెలిస్తే కేసీఆర్ పెత్తనం ఉంటుందని, ఆయనను బూచిగా చూపుతున్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టిన విషయాలను ఇప్పుడు తవ్వితీసి మరీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. రోషం, కసి ఉండాలని, రక్తం పొంగాలని ప్రజల్లో సెంటిమెంట్ ను తట్టి లేపుతున్నారు. ఇదేరకంగా మోదీని కూడా మరో బూచిగా చూపి, ఆయనకు జగన్ ను లింక్ చేసి మోదీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జగన్ కు కూడా అంటించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బలమైన మీడియా, వ్యవస్థ ఉండటంతో ఈ ప్రచారం చేయడంలో టీడీపీ ఇప్పటికే సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. ఇక, చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన ప్రచారంలో మాత్రం ఏడాదిగా చేస్తున్న పనుల గురించే చెబుతున్నారు.

ఏడాది నుంచి చేసినవే చెబుతూ…

ఏడాది క్రితమే బీజేపీకి టీడీపీ దూరమైంది. అప్పటి నుంచే పార్లమెంటులో, బయట ప్రత్యేక హోదా కావాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అంతకుముందు నాలుగేళ్లు బీజేపీతోనే ఉన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. కానీ, గత ఏడాదిగా చేస్తున్న పోరాటం గురించే చంద్రబాబు చెబుతున్నారు. పథకాల విషయంలోనూ ఇదే రూట్ లో వెళుతున్నారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాల గురించే ఆయన ఎక్కువగా చెబుతున్నారు. ఇవన్నీ రెండుమూడు నెలల క్రితం ప్రవేశపెట్టిన పథకాలే. నాలుగేన్నరేళ్లుగా చేసినవి చెప్పడం కంటే ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన పథకాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఓటర్లను ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మరి, ఈ వ్యూహాలు విజయవంతమై తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News