“గాలి” లేక పోవడంతో…?

నగరి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకూ గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం హవా నడిచిన నగరి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా కనుమరుగై [more]

Update: 2019-08-11 13:30 GMT

నగరి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకూ గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం హవా నడిచిన నగరి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా కనుమరుగై పరిస్థితి కన్పిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త నేతను వెతుక్కోవాల్సిన పరిస్థిితి. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణం తర్వాత నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది.

తిరుగులేని నేతగా….

నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు జీవించి ఉన్న రోజుల్లో ఆయనకు తిరుగు ఉండేది కాదు. అందరిలో కలసి పోయే వ్యక్తిగా తలలో నాలుకగా ఉండేవారు. 2014 ఎన్నికల్లోనూ గాలి ముద్దు కృష్ణమనాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబునాయుడు గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

గాలి హఠాన్మరణంతో….

గాలి ముద్దుకృష్ణమనాయుడి హఠాన్మరణంతో నగరిలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం ఉంది. ఆయనకు వారసులుగా గాలి భానుప్రకాష్ రెడ్డి, గాలి జగదీష్ రెడ్డిలు ఉన్నారు. అయితే వారసత్వం తీసుకోవడంలో ఇద్దరూ పోటీ పడటం, కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో రెండుగా చీలిపోయింది. అయినా కార్యకర్తల్లో, ప్రజల్లో కొంత గ్రిప్ ఉన్న గాలి భానుప్రకాష్ రెడ్డిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నికల్లో గాలి ఓటమిపాలయ్యారు.

కొత్త నాయకుడి కోసం…..

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి గాలి భానుప్రకాష్ నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆయన పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దీంతో నగరిలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే నాయకత్వాన్ని మార్చాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని చెబుతున్నారు. గాలి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టి కొత్త నేతకు పార్టీ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారట. మొత్తం మీద నగరిలో కొత్త నాయకుడి కోసం చంద్రబాబు వెతుకులాట ప్రారంభించారు.

Tags:    

Similar News