విశాఖ బీచ్… కేరాఫ్ పాలిటిక్స్… ?
రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఇక మీదట విశాఖలోని గంభీర సాగరం మౌనంగా చూస్తుందా అంటే సమాధానం అవును అనే వస్తోంది. విశాఖ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది [more]
;
రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఇక మీదట విశాఖలోని గంభీర సాగరం మౌనంగా చూస్తుందా అంటే సమాధానం అవును అనే వస్తోంది. విశాఖ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది [more]
రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఇక మీదట విశాఖలోని గంభీర సాగరం మౌనంగా చూస్తుందా అంటే సమాధానం అవును అనే వస్తోంది. విశాఖ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది అంటారు. కూల్ కూల్ అని చెబుతారు. కానీ ఇపుడు మాత్రం ఆ పరిస్థితి లేదనే అంటున్నారు. అక్కడ అంతా హాట్ పాలిటిక్స్ జోరుగా సాగిపోతున్నాయి. దీనికి మూలం వైసీపీ సర్కార్ విశాఖకు పాలనా రాజధానిని ప్రతిపాదించడం. దాంతో ఇటు విశాఖ నుంచి అటు భీమిలీ దాకా ఉన్న పాతిక కిలోమీటర్ల ప్రాంతమంతా రాజకీయ తుఫాన్ కి కేంద్ర బిందువు అవుతోంది.
అన్నీ కావాలా…?
విశాఖలో రాజధాని వస్తే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ. సచివాలయం ఏ వైపున, మంత్రుల క్వార్టర్లు ఎక్కడ ఇవన్నీ పెద్ద చర్చగానే ఉన్నాయి. వాటికి జవాబుగా విశాఖ బీచ్ ని వైసీపీ పెద్దలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ టూరిజం రిసార్ట్స్ నుంచి ప్రైవేట్ రంగంలో నిర్మాణం జరుపుకున్న కట్టడాల వరకూ అన్నీ కూడా టేకోవర్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని తెలుస్తోంది. అంటే ఈ మొత్తం ఏరియా అంతా ప్రభుత్వ పాలనా కేంద్రంగానే ఉంటుంది అన్న మాట. ప్రైవేటుకి చోటు అసలు ఉండదని కూడా చెబుతున్నారు.
ఆ స్టూడియో సైతం…?
విశాఖలో ఏకైక స్టూడియో ఉంది. రెండు దశాబ్దాల క్రితం టీడీపీ ఎంపీగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ రామానాయుడు విశాఖలో 35 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రపు ధరకు తీసుకుని స్టూడియో కట్టారు. ఈ స్టూడియోను 2008లో ప్రారంభించినా ఇప్పటిదాకా హడావుడి అయితే లేదు. ఒక దశలో దాన్ని కూడా టూరిజం స్పాట్ గా మార్చేశారు. ఇక్కడ సినిమాలు తీయడానికి కూడా ఎవరూ రావడం లేదు. అయితే కొండమీద పదెకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ స్టూడియో మీద వైసీపీ సర్కార్ పెద్దల కన్ను ఉందని అంటున్నారు. దీన్ని టేకవర్ చేస్తే ప్రభుత్వానికి మౌలికపరమైన అవసరాలు చాలా వరకూ తీరిపోతాయని అంటున్నారు.
జగడమేనా…?
అయితే ఈ స్టూడియోకు స్థలాన్ని చంద్రబాబు సీఎం గా ఉండగా ఇచ్చారు. పైగా దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాల్లో లేకపోయినా టీడీపీకి సానుభూతిపరులు అని చెబుతారు. ఇక వారి కుటుంబానికే చెందిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇలా విపక్షాల మద్దతు అయితే నాయుడు గారి కుటుంబానికి గట్టిగానే ఉంది. ఈ స్టూడియో ఇచ్చేస్తే ఇంతకు రెట్టింపు భూమి వేరే చోట ఇస్తామని ప్రభుత్వ పెద్దలు కోరారని ప్రచారం అయితే సాగుతోంది. అయితే తమ తండ్రి తీపి గురుతుగా దాన్ని తాము అలాగే ఉంచుకుంటామని ఎవరికీ ఇవ్వబోమని వారు తెగేసి చెప్పినట్లుగా కూడా అంటున్నారు.
బలవంతంగా అయినా ?
అయితే ఇది నామమాత్రపు ధరతో ప్రభుత్వం ఇచ్చింది. అందులో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వానికి ఎపుడు అవసరం అయితే అపుడు టేకోవర్ చేసుకుంటామని కూడా ఉంటుంది. ఇపుడు ఆ క్లాజ్ ని ఉపయోగించి బలవంతంగా అయినా తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని టాక్. అయితే అదంత సులువు కాదని అంటున్నారు. అవతల టీడీపీ సహా అన్ని పార్టీలు సర్కార్ ని నిలదీస్తాయి. పైగా ఒక బలమైన సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న సంకేతం కూడా వెళ్తుంది. మొత్తానికి విశాఖలో ప్రభుత్వ భవనాలకు వేరే మార్గాలు చూడాలి కానీ విశాఖను సినీ రాజధాని అని ఒక వైపు చెబుతూ మరో వైపు స్టూడియో తీసుకోవడం తప్పనే మేధావులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.