ఒక ఫ్రేమ్ లోకి వీరిద్దరూ రారట… ?

రెండు కొప్పులు ఎక్కడ ఉన్నా వివాదాలు కామన్ అని అంటారు. అయితే రాజకీయాల్లో అలా కాదు, చాలా వరకూ సర్దుకుపోతారు. పరిస్థితులకు తగినట్లుగా ఉంటారు. వేరే పార్టీలు [more]

Update: 2021-08-13 00:30 GMT

రెండు కొప్పులు ఎక్కడ ఉన్నా వివాదాలు కామన్ అని అంటారు. అయితే రాజకీయాల్లో అలా కాదు, చాలా వరకూ సర్దుకుపోతారు. పరిస్థితులకు తగినట్లుగా ఉంటారు. వేరే పార్టీలు అయితే మాత్రమే కత్తులు దూస్తారు. కానీ చిత్రమేంటి అంటే ఒకే పార్టీలో ఉంటూ ఎడముఖం పెడముఖంగా ఉండడం మాత్రం విశాఖ ఏజెన్సీలోని ఆ గిరిజన మహిళా ప్రతినిధులకే చెల్లింది. ఇందులో ఒకరు అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అయితే, మరొకరు పాడేరు వైసీపీ ఎమ్మెల్యే కొట్టిగుళ్ళ భాగ్యలక్ష్మి. ఇద్దరూ చదువుకున్న వారే. ఇద్దరి తండ్రులూ ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. రాజకీయ నేపధ్యం బాగా ఉంది. కానీ ఈ ఇద్దరూ మాత్రం ఒకరి పొడను చూసి మరొకరు అసలు ఓర్వలేకపోతున్నారుట.

సమర్ధులే మరి…..

ఈ ఇద్దరినీ జగన్ మెచ్చి వైసీపీ టికెట్లు ఇచ్చారు. వారు కూడా తమ శక్తిని చూపించి మంచి మెజారిటీలు సాధించారు. అరకు ఎంపీగా మాధవి గత ఎంపీలతో పోలిస్తే బాగా చురుకు అనే చెప్పాలి. ఆమె ఢిల్లీ వెళ్ళినా లేక ఏపీలో ఉన్నా కూడా గిరిజన సమస్యల మీదనే పోరాడుతారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు కలసినా విన్నపాలు చేస్తూ ఉంటారు. ఇక విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో ఆమె గిరిజన సమస్యల సాకారానికి కృషి చేస్తున్నారు. ఆమె చాలా నిరాడంబరంగా ఉంటారు. గిరిజనులతో కలసి పనిచేస్తారు. తన సొంత పొలంలో ఆమె ఇప్పటికీ ఒక వ్యవసాయ కూలీ మాదిరిగా కష్టపడతారు.

అంకిత భావంతోనే …?

ఇక మరో వైపు చూస్తే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఎక్కువగా ప్రచారానికి పోకుండా తన నియోజకవర్గంలోనే పర్యటిస్తూ ప్రజలకు మేలు చేయాలని చూస్తూంటారు. ఈ రెండేళ్ళలో గిరిజన ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు రావడంతో అభివృద్ధి పనులను ఆమె జోరుగా జరిపిస్తున్నారు. అయితే ఎంపీతో మాత్రం అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. కారణాలు తెలియవు కానీ ఇద్దరూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉండడంతో క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. దీంతో వైసీపీకి గట్టి పట్టున్న ఏజెన్సీలో ఈ విభేధాలు అంటి అని క్యాడర్ తల పట్టుకుంటోంది.

అలా కలిపినా…?

మరో వైపు ఉత్తరాంధ్రాలో పార్టీ కార్యకలాపాలను చూస్తున్న విజయసాయిరెడ్డి సైతం ఈ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. వైసీపీకి జనాదరణ ఉంది. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉందని ఆయన నచ్చచెబుతున్నా కూడా తమ రూటే సెపరేట్ అన్నట్లుగా వారు ఉంటున్నారు. ఇప్పటిదాకా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లోకి రాలేకపోయారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీలో ఈ రోజుకు కూడా ప్రతిపక్షం వీక్ గా ఉంది. దాంతో పోటీ అన్నది లేదు. గట్టిగా పనిచేస్తే మరో మారు టికెట్ ఇచ్చేందుకు అధినాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. దాంతో చేతులు కలిపి ఇద్దరూ ముందుకు అడుగులు వేయాలని అంతా కోరుతున్నారు. మరి పాడేరు సీటు మీద మాధవి కన్ను ఉందని భాగ్యలక్ష్మి అనుమానిస్తున్నారా అన్న చర్చ కూడా లేకపోలేదు. దాంతోనే ఇలా ఈ ఇద్దరూ ఒకే ఒరలో రెండు కత్తుల మాదిరిగా ఇమడలేకపోతున్నారా అన్న మాట అయితే ఉంది. మొత్తానికి జగన్ పిలిచి మాట్లాడితే ఈ వ్యవహారం సర్దుమణుగుతుంది అంటున్నారు.

Tags:    

Similar News