మరాఠా ప్రభావమేనా?

కర్ణాటక రాజకీయాలు ఉప ఎన్నికలు దగ్గరపడే కొద్దీ క్షణక్షణానికి మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు కర్ణాటకపై కన్పిస్తున్నాయి. కర్ణాటకలో వచ్చేనెల 5వ తేదీన పదిహేను నియోజకవర్గాల్లో ఉప [more]

Update: 2019-11-28 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఉప ఎన్నికలు దగ్గరపడే కొద్దీ క్షణక్షణానికి మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు కర్ణాటకపై కన్పిస్తున్నాయి. కర్ణాటకలో వచ్చేనెల 5వ తేదీన పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకం. ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాలను గెలుచుకున్న దానిని బట్టే అధికారం ఎవరి చేతుల్లోకి మారుతుందన్నది తేలనుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కీలకంగా మారనుంది.

నిన్న మొన్నటి వరకూ…..

జనతాదళ్ ఎస్ కు సారథ్యం వహిస్తున్న తండ్రీకొడుకులు దేవెగౌడ, కుమారస్వామిలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు జరిగాయి. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో శివసేన, బీజేపీకూటమికి మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన స్థానాలు వచ్చాయి. దీంతో దేవెగౌడ, కుమారస్వామి వ్యాఖ్యలు బీజేపీకి దగ్గరగా కన్పించాయి. బీజేపీకి అవసరమైన సీట్లు ఈ ఉప ఎన్నికల్లో దక్కకుంటే తాము అండగా నిలుస్తామని కుమారస్వామి ప్రకటించారు. దేవెగౌడలోనూ అదే ధోరణి విన్పించింది.

మహారాష్ట్ర ప్రభావంతో…..

అయితే తాజాగా మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయ. బీజేపీకి శివసేన, ఎన్సీపీ చెక్ పెట్టగలిగింది. అమిత్ షా ఎత్తులను, వ్యూహాలను చిత్తు చేయగలిగింది. దీంతో బీజేపీకి కొంత డ్యామేజీ జరిగింది. ఈ ప్రభావం కర్ణాటకలోనూ పడినట్లు కన్పించింది. దేవెగౌడ హటాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. బీజేపీకి మెజారిటీకి తగ్గ స్థానాలు దక్కడం కష్టమేనని వ్యాఖ్యానించారు.

సిద్దూకు చెక్……

అలాగే మాజీ ముఖ్యమంత్రి, తన ప్రత్యర్థి సిద్ధరామయ్యకు కూడా చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ వైపు నిలిచారు దేవెగౌడ. తన తనయుడు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణం కావడంతో ఆయనను బరి నుంచి తప్పించాలని దేవెగౌడ ఈ కామెంట్స్ చేసినట్లు కన్పిస్తుంది. అలాగే బీజేపీకి దగ్గరై మరోసారి విఫలం కాకూడదని, శరద్ పవార్ బాటలోనే పయనించాలని దేవెగౌడ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. డీకే శివకుమార్ ఇటీవల జేడీఎస్ నేతలకు దగ్గరవ్వడం కూడా అందుకు ఒక కారణమని చెప్పవచ్చు.

Tags:    

Similar News