దళపతిది ఏం రాజకీయం?

దేవెగౌడ…. ప్రాంతీయ పార్టీని దక్షిణాదిన స్థాపించి అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి చేజిక్కించుకున్న వ్యూహం ఉన్న నేత. కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్ పార్టీని స్థాపించి ఇప్పటికి మూడుసార్లు [more]

Update: 2019-11-08 18:29 GMT

దేవెగౌడ…. ప్రాంతీయ పార్టీని దక్షిణాదిన స్థాపించి అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి చేజిక్కించుకున్న వ్యూహం ఉన్న నేత. కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్ పార్టీని స్థాపించి ఇప్పటికి మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. దేవెగౌడ వివాదాలకు వెళ్లే నేత కాదు. తనకు పట్టున్న ప్రాంతాల్లో, తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోటనే ఆయన పార్టీ గెలుస్తూ వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే దేవెగౌడ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి ఆయనకు కన్నడ రాష్ట్రంలో ఉన్న పట్టు కూడా ఒక కారణం కావచ్చు.

కుమారస్వామి రాకతో…..

కానీ దేవెగౌడ తర్వాత ఆయన తనయుడు కుమారస్వామి అంది వచ్చాక పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయిందనే చెప్పాలి. కుమారస్వామి సహనం తక్కువంటారు. అలాగే వ్యూహాలు కూడా తెలియని నేత అంటారు. తాజాగా కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలడానికి కూడా ఆయన వ్యవహారశైలి కారణమనే వారు సొంత పార్టీలోనే ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో జేడీఎస్ ను వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు స్వయంగా దేవెగౌడ రంగంలోకి దిగారు.

బీజేపీ వైపు …..

అయితే దేవెగౌడ ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారంటున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీని, మోడీని దోషిగా చిత్రీకరిస్తూ వచ్చిన దేవెగౌడ లోక్ సభ ఎన్నికల తర్వాత కొంత తగ్గుతున్నట్లు కన్పించారు. కనుచూపు మేరలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేకపోవడంతో ఇక కాంగ్రెస్ తో కలసి వెళ్లడం వేస్ట్ అని భావించిన దేవెగౌడ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.

క్యాడర్ లో గందరగోళం…..

సిద్ధరామయ్యతో తమకు ఉన్న విభేదాలు కూడా దేవెగౌడ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కావచ్చు. అయితే ఇప్పుడు బీజేపీకి బయట నుంచి మద్దతిచ్చేందుకు దేవెగౌడ సిద్ధమయ్యారంటున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయినా దేవెగౌడ మద్దతుతో యడ్యూరప్ప పూర్తి కాలం సీఎంగా కొనసాగే బంపర్ ఛాన్స్ ను పెద్దాయన ఇస్తున్నారు. ఇందుకు ప్రతిగా తమ పార్టీ నుంచి ఎవరినీ చేర్చుకోకూడదన్న షరతును దేవెగౌడ విధించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా దేవెగౌడ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ క్యాడర్ కు అంతుపట్టడం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ తో ఇప్పడు బీజేపీతో జత కడితే ఉన్న ఓటు బ్యాంకు ఊడిపోతుందన్న ఆందోళన పార్టీనేతల్లో కన్పిస్తుంది. మొత్తం మీద లేటు వయసులో దేవెగౌడ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకే చేటు తెచ్చేవిగా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News