కటీఫ్ చెప్పేస్తారా….?

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన నిన్న మొన్నటి వరకూ సంకీర్ణంలో మెలిగిన కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారు. [more]

Update: 2019-08-03 16:30 GMT

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన నిన్న మొన్నటి వరకూ సంకీర్ణంలో మెలిగిన కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారు. జనతాదళ్ ఎస్ లో ఉన్న అధికశాతం మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సయోధ్యతో ఉండాలని సూచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అవసరమైతే బయట నుంచి మద్దతు ఇవ్వాలన్నది ఎక్కువ మంది ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది. ఈ నెల 7వ తేదీన దేవెగౌడ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అసంతృప్తితో పెద్దాయన….

ఈ సమావేశంలో దేవెగౌడ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పే అవకాశాలున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. గత కొంత కాలంగా దేవెగౌడ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మీద కంటే ఆయన ఆగ్రహం రాష్ట్ర పార్టీ నేతలపైనే ఎక్కువగా ఉంది. తనయుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు పెట్టిన చికాకులు ఆయన ఈ సందర్భంగా సన్నిహితుల వద్ద గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ ను దోషిగా….

కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లోని అసంతృప్తి. సంకీర్ణ సర్కార్ కుప్ప కూలిపోవడానికి కారణం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల పాత్ర ఉందన్నది దేవెగౌడ అనుమానం. గట్టిగా 14 నెలల పాటు కుమారస్వామిని పాలన చేయకుండా అన్ని నిర్ణయాలపై విపక్షం కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా అడ్డుపడిందని దేవెగౌడ భావిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు ఎన్నిమార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేదని దేవెగౌడ ఆవేదన చెందుతున్నారు. అలాగే మాండ్యలో మనవడు నిఖిల్ గౌడ, తుముకూరులో తన ఓటమికి కాంగ్రెస్ ను కారణంగా చూపుతున్నారు.

కీలక నిర్ణయం…..

తమ పార్టీ నేతలు కూడా వెళ్లిపోవడానికి కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలు కారణమని దేవెగౌడ భావిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి నగరానికి చెందిన కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని దేవెగౌడ అనుమానం. దీంతో ఈ నెల 7వ తేదీన కార్యాచరణపై కార్యకర్తల సమావేశానికి దేవెగౌ పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో దేవెగౌడ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పే అవకాశముందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కార్యకర్తల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం ఉంటుందన్న దేవెగౌడ ప్రకటన వెనుక మర్మమిదేనంటున్నారు.

Tags:    

Similar News