పార్టీ మారినా.. డొక్కాకు తిప్పలు త‌ప్పడం లేదుగా

రాజ‌ధాని ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో ఆ మాజీ మంత్రికి తెలిసివ‌స్తోంద‌ట. పార్టీ మారినా కూడా ఆయ‌న‌పై అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తున్న వ‌త్తిళ్లతో ఆయ‌న స‌త‌మ‌తం [more]

Update: 2020-09-10 00:30 GMT

రాజ‌ధాని ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో ఆ మాజీ మంత్రికి తెలిసివ‌స్తోంద‌ట. పార్టీ మారినా కూడా ఆయ‌న‌పై అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తున్న వ‌త్తిళ్లతో ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నార‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో.. కాదు.. గుంటూరు జిల్లా కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎస్సీ వ‌ర్గానికి చెందిన డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఆయ‌న రాష్ట్ర విబ‌జ‌న‌తో టీడీపీ పంచ‌కు చేరిపోయారు. ఈక్రమంలోనే ఆయ‌న ఎమ్మెల్సీ అయ్యారు. గత ఏడాది ఎన్నిక‌ల్లో ప్రత్తిపాడు టికెట్ ద‌క్కించుకుని పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇంత‌లోనే రాజ‌ధాని మార్పు తెర‌మీదికి రావ‌డం, తాను టీడీపీలో ఉండ‌డంతో పార్టీ లైన్‌కు అనుగుణంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ మ‌ద్దతు ప‌లికారు.

వైసీపీలో చేరి ఎమ్మెల్సీని పొంది…..

చంద్రబాబుతో క‌లిసి డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ రెండు మూడు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే, శాస‌న మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణయం తీసుకోవ‌డం, త‌న ఓట‌మికి గల్లా జ‌య‌దేవ్ కార‌ణ‌మ‌ని బాబుకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న కార‌ణాలు సాకుగా చూపి ఆయ‌న కొద్ది రోజులుగా గ‌రం గ‌రం లాడారు. టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మార‌డంతో పార్టీ మారిపోయి డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ వైఎస్సార్ సీపీలోకిచేరిపోయారు. నెల రోజుల కింద‌ట మ‌ళ్లీ అదే మండ‌లికి ఎంపిక‌య్యారు. వైఎస్సార్‌సీపీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా కూడా డొక్కాకే ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ వ‌ర్గాల‌నే ఆశ్చర్యచ‌కితుల‌ను చేశారు.

డొక్కా వ్యాఖ్యలపై…..

అయితే ఇప్పుడు డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌కు అస‌లు క‌ష్టాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. రాజ‌ధానికి వ్యతిరేకంగా మాట్లాడాల‌ని అధికార పార్టీ నుంచి వ‌త్తిళ్లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో త‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతోపాటు.. ఎంతో మంది సీనియ‌ర్లనుకూడా ప‌క్కన పెట్టి త‌న‌కు ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌ను సంతృప్తి ప‌ర‌చాల‌ని డొక్కాకు కూడా ఉంది. ఈ క్రమంలో ఆయ‌న ద‌ళితుల‌కు, అమ‌రావ‌తి ఉద్యమానికి సంబంధం లేదని, ప్రభుత్వం రైతుల‌ను అన్నివిధాలా ఆదుకుంటుంద‌ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల‌పై అటు టీడీపీ, ఇటు ద‌ళిత సంఘాలు కూడా డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌పై విరుచుకుప‌డ్డాయి. అస‌లు డొక్కా ఏం మాట్లాడాల‌నుకుని ఏం మాట్లాడుతున్నార‌ని ప్రజ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆయ‌న రాజ‌ధాని ఉన్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.

ఆయనపై గరం గరం…..

ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది రైతులు ఉద్యమం చేస్తుంటే డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ సింపుల్‌గా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంద‌ని ఒక మాట మాట్లాడి దులిపేసుకోవ‌డంతో డొక్కాపై అక్కడ ప్రజ‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ త‌న రాజ‌కీయం కోసం పార్టీలు మారి ప‌ద‌వులు పొంది రాజ‌ధాని ప్రాంత ప్రజ‌ల గోడు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ బ‌లంగా వ‌చ్చేసింది. దీంతో ఇప్పుడు డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ కు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్పడింద‌ట‌. పోనీ.. మౌనంగా ఉందామంటే.. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, మాట్టాడితే.. ప్రతిప‌క్షం నుంచి విమ‌ర్శలు ఇలా ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

Tags:    

Similar News