జగన్ పెళ్లిరోజునే టార్గెట్ చేసినట్లుందే?

ప్రజల వద్దకు పాలన అన్నది టీడీపీ కనిపెట్టిన కాన్సెప్ట్. అయితే అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసమంటూ ఆర్భాటం చేసే టీడీపీ నేతలు విపక్షంలోకి వచ్చాక మాత్రం గమ్మునుంటారు. [more]

Update: 2021-08-27 03:30 GMT

ప్రజల వద్దకు పాలన అన్నది టీడీపీ కనిపెట్టిన కాన్సెప్ట్. అయితే అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసమంటూ ఆర్భాటం చేసే టీడీపీ నేతలు విపక్షంలోకి వచ్చాక మాత్రం గమ్మునుంటారు. అధినేత చంద్రబాబుతో మొదలుపెడితే కార్యకర్త దాకా ఇదే రకమైన సీన్ కనిపిస్తుంది. ఇప్పటికి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది. కానీ బాబు సహా పార్టీ నాయకులు ఎవరూ పెద్దగా జనం ముఖం చూడలేదు. ఇది నిష్టుర సత్యం. దీనికి కరోనా అని పేరు చెప్పుకున్నా అది వచ్చింది గత ఏడాదిన్నరగానే. అందులో కూడా అది తగ్గుతూ వస్తోంది. మరి ఆ గ్యాప్ లో అయినా తమ్ముళ్ళు జనం ముఖం చూశారా అంటే లేదు అన్న జవాబు వస్తుంది.

సరైన పాయింటే ..?

మొత్తానికి టీడీపీ డేర్ చేసి ఇన్నాళ్ళకు ప్రజా సమస్య ఒకటి పట్టుకుంది. అయితే అది కూడా జగన్ మీదకు బాణాలు ఎక్కుపెట్టడానికే తప్ప మరోదానికి కాదు అన్నది చెప్పకనే చెబుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయంటూ టీడీపీ నేతలు ఆందోళనాపధంలోకి వచ్చారు. బాగానే ఉంది కానీ దీని విషయంలో అసలు ముద్దాయి కేంద్రం. కేంద్రంలోకి బీజేపీ సర్కార్ ఈ విధంగా అడ్డూ అదుపూ లేకుండా పెంచుకుని పోతోంది. ఇక కరోనా వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాలు కూడా వీటి పన్నులను ఆదాయంగా మార్చుకుంటున్నాయి. కానీ ఈ పెంచుడే లేకపోతే ఎవరికీ బాధ ఉండదుగా. కానీ కేంద్రంలోని బీజేపీని వదిలేసి కేవలం జగన్ మీద బాణాలు వేస్తే మాత్రం టీడీపీ తమ్ముళ్ళకు ఆయాసం తప్ప పూర్తి రాజకీయ లాభం కలగదు అన్న మాట అయితే ఉంది.

మోడీని అంటేనే …?

కేంద్రంలో మోడీ సర్కార్ ఒక్క పెట్రోల్ విషయంలోనే కాదు చాలా అన్యాయాలు చేస్తోంది అని జనాలు గుర్రుగా ఉన్నారు. బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు. కరోనా వేళ సరిగ్గా చర్యలు తీసుకోలేదు. ఇక దేశంలో అన్ని రకాల ధరలూ పెరిగిపోయాయి. దాని వల్ల మోడీని జగన్ని కలిపి గట్టిగా వాయిస్తే టీడీపీ ఆందోళనకు అర్ధం సార్ధకత ఉంటాయి. కానీ మోడీ పేరెత్తడానికి చంద్రబాబు సంకోచిస్తారని ఇప్పటికే ప్రచారంగా ఉంది. అందువల్ల ఆయన కానీ చినబాబు కానీ జగన్ మీదనే విరుచుకుపడిపోతారన్నదే తేలుతున్న సత్యం.

సరిగ్గా పెళ్ళి రోజునే …?

జగన్ పెళ్ళి రోజు ఈ నెల 28వ తేదీ. అది కూడా ల్యాండ్ మార్క్ లాంటి రజతోత్సవం. మరి జగన్ ఆనందంగా ఫ్యామిలీతో గడపడానికి చల్లని సిమ్లాలో ఉన్న వేళ అక్కడ కూడా వేడి పుట్టించడానికి టీడీపీ అదే రోజు ఆందోళన అనడం అంటే ఫక్తు రాజకీయమే అనుకోవాలేమో. అయితే ఇక్కడ టీడీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆనందాలే లభిస్తాయి. అదేలా అంటే టీడీపీ నేతలు చేసే విమర్శలు వినడానికి జగన్ ఏపీలో ఉండరు, అది కొంత నిరాశ. అయితే జగన్ పెళ్ళి వేడుకల వేళ కూడా చికాకు పెట్టామన్న సంతృప్తి మాత్రం టీడీపీకి దక్కడం ఖాయం. ఏది ఏమైనా టీడీపీ ఇన్నాళ్ళకైనా ప్రజలలోకి రావడం అంటే మెచ్చి తీరాల్సిందే.

Tags:    

Similar News