ఈటల టార్గెట్… వెనక కథంతా నడిపింది ఆయనేనా?

తెలంగాణ రాజ‌కీయం ఒక్కసారిగా మార‌బోతోందా ? అన్న సంకేతాలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ అధిష్టానంపై కొద్ది రోజులుగా అస‌మ్మతి బావుటా ఎగ‌ర‌వేస్తూ వ‌స్తోన్న వైద్య ఆరోగ్య [more]

Update: 2021-05-01 05:00 GMT

తెలంగాణ రాజ‌కీయం ఒక్కసారిగా మార‌బోతోందా ? అన్న సంకేతాలు అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ అధిష్టానంపై కొద్ది రోజులుగా అస‌మ్మతి బావుటా ఎగ‌ర‌వేస్తూ వ‌స్తోన్న వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంద‌ర్‌ను కేసీఆర్ కేబినెట్ నుంచి త‌ప్పిస్తార‌నే వార్తలు వ‌స్తున్నా ఎవ్వరూ న‌మ్మ‌డం లేదు. పార్టీ జెండాకూ అంద‌రం ఓన‌ర్లమే అనడంతో మొద‌లైన ఆయ‌న అస‌మ్మతి రాగం ప‌లు వేదిక‌ల‌పై బ‌హిరంగంగానే వినిపిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో ఈటల రాజేంద‌ర్‌ అధిష్టానంపై అస‌మ్మతి స్వరం పెంచాక పార్టీలో చాలా మంది నిర‌స‌న‌, ధిక్కార స్వరాలు వినిపించారు. అప్పుడు కేటీఆర్ సైతం ఈటల రాజేంద‌ర్‌ కు ఓపెన్‌గానే కౌంట‌ర్లు ఇచ్చారు. ఏదేమైనా కొద్ది రోజులుగా కేసీఆర్‌కు, ఈటల‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంద‌న్నది నిజం.

అన్ని ఛానళ్లలో ఒకేసారి…?

తాజాగా ఈటల రాజేంద‌ర్‌ భూక‌బ్జాలు అంటూ మీడియాలో ఒక్కసారిగా వార్తలు బ‌ర‌స్ట్ అయ్యాయి. కొన్ని ప్రముఖ ఛానెల్స్ ఈటల రాజేంద‌ర్‌ భూక‌బ్జాలు అన్న టైటిల్స్ తో పాటు బీసీ మంత్రి భూక‌బ్జా భాగోతం.. బీసీ మంత్రి బీసీలు, ఎస్సీలు భూములు క‌బ్జాలు అంటూ ర‌క‌ర‌కాల టైటిల్స్‌తో వార్తలు వండేశాయి. విచిత్రంగా పార్టీ అధికార ఛానెల్‌గా పేరున్న టీ న్యూస్‌లో సైతం ఈటల రాజేంద‌ర్‌ భూకబ్జాల గురించి నేరుగానే వార్తలు ప్రసారం చేయ‌డంతో పాటు బాధితుల వెర్షన్ ప్రసారం చేయ‌డం కూడా జ‌రిగాయి. ఈ ప‌రిణామాల వెన‌క పార్టీ అధిష్టాన‌మే ఉంద‌న్న చ‌ర్చలు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ కథనాల వెనక?

పార్టీలో ఓ కీల‌క యువ‌నేత ఈటల రాజేంద‌ర్‌ పై వచ్చిన క‌థ‌నాల వెన‌క ఉన్నార‌ని సొంత పార్టీ వ‌ర్గాల్లోనే విస్తృత‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క‌థ‌నాల త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా కేబినెట్ లోనూ ప‌లు మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయంటున్నారు. త్వర‌లో కేసీఆర్ త‌న కేబినెట్‌ను భారీ స్థాయిలో ప్రక్షాళ‌న చేయ‌నున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్ల పాల‌న పూర్తి చేసుకుంది. కొత్త కేబినెట్‌తోనే కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జ‌రిగే మార్పులు చేర్పుల్లో ముగ్గురు మంత్రులు ఖ‌చ్చితంగా అవుట్ అవుతార‌ని పార్టీ నేత‌లే చెపుతున్నారు.

పూర్తి స్థాయి ప్రక్షాళన….

వీరిలో ముందు నుంచి గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు మ‌ల్లారెడ్డి పేర్లు వినిపిస్తుండ‌గా.. తాజా ప‌రిణామాల త‌ర్వాత ఈటల రాజేంద‌ర్‌ రాజేంద‌ర్‌ను కూడా ప‌క్కన పెట్టేస్తార‌ని అంటున్నారు. ఇక వేముల ప్రశాంత్‌రెడ్డి ప‌ద‌వి కూడా ఉంటుందా ? లేదా ? అన్ది చెప్పలేని ప‌రిస్థితి. కొత్తగా కేబినెట్లోకి వినిపిస్తోన్న పేర్లలో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్యతో పాటు ఎమ్మెల్సీ అయిన కేసీఆర్ కుమార్తె క‌విత పేరు కూడా వినిపిస్తోంది. సండ్రకు టీటీడీఎల్పీని విలీనం చేస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీ ఉంద‌ని అంటున్నారు. మ‌రి కేసీఆర్ ఈ విష‌యంలో ఏం చేస్తార‌న్నది ప్రస్తుతానికి స‌స్పెన్సే ? ఏదేమైనా ఈటల రాజేంద‌ర్‌ టార్గెట్‌గా స్టార్ట్ అయిన రాజ‌కీయం కొద్ది రోజుల్లో మ‌రింత ర‌స‌కందాయంలో అయితే ప‌డ‌డం ఖాయం.

Tags:    

Similar News