పప్పు చాలా టఫ్.. పప్పును ఆదరించండి.. ఇది చదవండి

పప్పు…. పప్పులో ఎన్ని రకాలు అంటే ఏమి చెప్పగలం? టమాటా పప్పు, దోసకాయ పప్పు, ములక్కాయ పప్పు, మెంతికుర పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు, మామిడి [more]

Update: 2020-05-19 17:30 GMT

పప్పు…. పప్పులో ఎన్ని రకాలు అంటే ఏమి చెప్పగలం? టమాటా పప్పు, దోసకాయ పప్పు, ములక్కాయ పప్పు, మెంతికుర పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు, మామిడి కాయ పప్పు, పప్పు చారు, ముద్ద పప్పు, పప్పులో ఎన్ని వెరైటీలు…. అసలు పప్పు ఎంత గొప్పది…. పప్పుని పప్పుగుత్తితో రుబ్బేశారు కానీ…. పప్పుది ఎంత అందం., ఎంత రుచి…..ఎంత కమ్మటి వాసన…పప్పు మీద ఈ సమాజపు కుట్రలు ఇప్పటివి కాదు.

పప్పుకు అర్థం తొలిసారి….

పప్పు అంటే చిన్నపుడు కందిపప్పా? పెసరపప్పా? అనుకునే వాళ్ళం…. స్కూల్లోకి వచ్చాక పప్పుకి వేరే అర్ధాలు తెలిశాయి. బళ్ళో మా రామాలయం పూజారి గారి అబ్బాయి దీక్షితులు గాడిని బెంజిమాన్ పప్పు నాయలా! అని తిట్టినపుడు మొదటిసారి పప్పుకి ఇంకో అర్థం ఉందని తెలిసింది. దీక్షితులు గాడు ఆవేశంగా రొప్పుతూ వీడిని చితక్కొట్టేశాడు. ఆ తర్వాత రోజూ దీక్షితులు గాడు బ్యాంక్ సందులో ఎగ్ పఫ్ తింటూ వీడికి దొరికిపోయాడు. వాడు ఇంకో గుంపుతో పరిగెత్తుకెళ్లి పంతులు గారికి ఊదేశాడు. వీడు తర్వాత రోజు వాడిని మళ్ళీ చితక్కొట్టడం అది వేరే సంగతి.

ఆరోజులే హాయి…

ఆ పప్పు రోజులే హాయి…. తన్నుకున్నా తిట్టుకున్నా బాగుండేవి. ఇలా పప్పు కష్టాలు మాత్రం ఉండేవి కాదు. సరే ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళింది ఈ పప్పు గోల. ఇంతకీ బెంజిమాన్ గాడు పప్పు అని ఎందుకు అన్నాడో, వీడు వాడిని ఎందుకు తిట్టాడో తర్వాత ఎప్పుడో అర్థం అయ్యింది. పప్పు అంటే సాత్వికత…. పప్పు అంటే అమాయకత్వం…. పప్పు అంటే మెతక….. ఇంకా బోలెడు అపనిందలు…. కానీ ఎవడైనా పప్పు వండి… తాలింపు పెడితోనో, ఆకు కూరో., దోసకాయో చేదు చూసి కుక్కర్ లో వండుతూ, మధ్యలో గ్యాస్ అయిపోతేనో, గాస్కెట్ లీక్ అయ్యి నాలుగైదు విజిల్స్ లో ఉడికేది కాస్త గంట పడితే తెలుస్తుంది….. పప్పు ఎంత టఫ్ నో…. పప్పు ఉడికాక నీళ్లు వేరే గిన్నెలోకి వంచి, పప్పు రుబ్బడం ఎంత గొప్ప కళ… గిన్నె జారి వేడి నీళ్లు చిందితే ఎంత మంట…. అందుకే పప్పుని అవమానించకండి. పప్పుని గౌరవించండి…. పప్పుని ఆదరించండి…. తాలింపు వేసినా వేయకపోయినా పప్పు మిమ్మల్ని ఆదరిస్తుంది. అందుకే పప్పు అని ఎవరినీ తీసిపారేయకండి.

– సీనియర్ జర్నలిస్ట్ సౌజన్యంతో

 

 

Tags:    

Similar News