కొని తెచ్చుకున్నట్లున్నారుగా

మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయంగా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, టీడీపీని ఆయ‌న విడిచి [more]

Update: 2020-02-18 14:30 GMT

మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయంగా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, టీడీపీని ఆయ‌న విడిచి పెట్టి వేరే పార్టీలోకి జంప్ చేస్తార‌ని కూడా క‌థ‌నాలు వినిపించాయి. అయితే, బీజేపీ కాక‌పోతే వైసీపీ అన్న‌ట్టుగా గంటా శ్రీనివాస‌రావు చుట్టూ అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌డిచిన ఆరేడు మాసాలుగా ఈ రూమ‌ర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, అనూహ్యంగా బీజేపీ నుంచి 100 మంది చోటా మోటా కార్యక‌ర్తల‌ను ఆయ‌న టీడీపీలోకి చేర్పించి ఒక్కసారిగా మ‌ళ్లీ వార్తల్లోకి ఎక్కారు. దీంతో అస‌లు గంటా శ్రీనివాస‌రావు వ్యూహం ఏంటి? ఈ ప‌రిణామాలు ఆయ‌న‌కు మంచి చేస్తాయా? అనే చ‌ర్చ సాగుతోంది.

టీడీపీకి ఆనందమేగా?

విష‌యంలోకి వెళ్తే తాజాగా గంటా శ్రీనివాస‌రావు.. విశాఖ‌కు చెందిన 100 మంది బీజేపీ కార్యక‌ర్తల‌ను తీసుకువ‌చ్చి టీడీపీలో చేర్పించారు. ఈ ప‌రిణామం ఇటు టీడీపీలో ఆనందం నింప‌గా అటు బీజేపీలో మాత్రం తీవ్ర ఆవేద‌నను నింపింది. రాష్ట్రంలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీకి ఇది ఒక‌ర‌కంగా శ‌రాఘాతం వంటి ప‌రిణామ‌మే. దీంతో ఇప్పటికే ఈ విష‌యాన్ని బీజేపీ పెద్దలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. వాస్తవానికి గంటా శ్రీనివాస‌రావు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నార‌ని బీజేపీ పెద్దలు భావించ‌డం లేదు. వంద మంది బీజేపీ కార్యక‌ర్తలను పార్టీ చేర్చుకునే క్రమంలో విష‌యాన్ని చంద్రబాబుకు చేర‌వేసే ఉంటార‌ని అంటున్నారు.

బీజేపీ టార్గెట్ చేసిందా?

బాబు క‌నుస‌న్నల్లోనే ఇదంతా జ‌రిగింద‌ని, సో.. బాబు బీజేపీని ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నార‌ని ఇప్పటికే కేంద్రానికి స‌మాచారం అందించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గంటా శ్రీనివాస‌రావును టార్గెట్ చేసేలా బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు స‌మాచారం. గ‌తంలో గంటా శ్రీనివాస‌రావు పై న‌మోదై న కేసులు స‌హా ఆయ‌న‌ను టార్గెట్ చేసేందుకు ఉన్న అవ‌కాశంపై ఇప్పటికే దృష్టి పెట్టార‌ని అంటున్నా రు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి అనుకూల‌మైన ప్రభుత్వమే ఉన్నందున గంటా శ్రీనివాస‌రావును రాబోయే రోజుల్లో ఇరుకున పెట్టాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మ‌రి ఇదే జ‌రిగితే ఇప్పటికే ఉన్న కేసులు కొత్తగా న‌మోద‌య్యే వాటితో గంటా శ్రీనివాస‌రావు ప‌రిస్థితి ఏంట‌నేది ప్రశ్న.

Tags:    

Similar News