అటూ…. ఇటూ గంటాయే టార్గెట్ ?

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహాలు ఇపుడు ఏమూలకూ సరిపోవడంలేదా. ఆయన్ని మించి ప్రత్యర్ధులు ఎత్తులు వేస్తున్నారా. గంటా శ్రీనివాసరావు వాటికి [more]

Update: 2020-09-28 06:30 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహాలు ఇపుడు ఏమూలకూ సరిపోవడంలేదా. ఆయన్ని మించి ప్రత్యర్ధులు ఎత్తులు వేస్తున్నారా. గంటా శ్రీనివాసరావు వాటికి చిత్తు అవుతున్నారా. అంటే సమాధానం అవును అనే వస్తుంది. ఓ వైపు జగన్ గంటాను తన పార్టీలోకి తీసుకోకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది. దాంతో గంటా శ్రీనివాసరావు చుట్టూ ఉన్న నేతలకే ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలా గంటా బ్యాచ్ ని చెల్లాచెదురు చేస్తూ వస్తున్నారు. ఇపుడు సీనియర్ నాయకులు అంతా టీడీపీని వీడి వైసీపీ చేరారు. వారంతా గంటా శ్రీనివాసరావుకు ఒకప్పుడు కీలక‌మైన మద్దతుదారులు.

ముందే వచ్చారుగా….?

గంటా శ్రీనివాసరావు నుంచి ముఖ్యనాయకులను మైనస్ చేయడం గత ఏడాది ఎన్నికల ముందే మొదలైంది. గంటా కుడి భుజమైన‌ అవంతి శ్రీనివాసరావుని వైసీపీ వైపుగా తిప్పడంలోని రాజకీయం అదే మరి. దాంతోనే గంటా శ్రీనివాసరావు సగానికి సగం అయ్యారు. ఆ తరువాత మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ వైసీపీ గూటికి చేరారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీలోకి జంప్ చేశారు. ఈ మధ్యనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా సైకిల్ దిగి జై జగన్ అనేశారు. వీరంతా ఒకనాడు గంటా శ్రీనివాసరావు మాటే వేదంగా నడిచిన‌వారు అన్నది గుర్తు పెట్టుకోవాలి.

బ్రేక్ వేసిన బాబు….

ఇపుడు చూస్తే చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావునే టార్గెట్ చేశారు అనిపిస్తోంది. గంటాతో పాటు విశాఖ పశ్చిమ‌ ఎమ్మెల్యే గణబాబు టీడీపీని వీడుతారని వార్తలు బాబు చెవిన పడడంతో అప్రమత్తం అయిన బాబు గణబాబుని రెండు జిల్లాల కో ఆర్డినేటర్ చేసి మరీ సైకిల్ దిగకుండా జాగ్రత్త పడ్డారు. ఇక మరో బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ ని విశాఖ ప్రెసిడెంట్ చేసి మరీ గంటా శ్రీనివాసరావు గూటి నుంచి వేరు చేశారు. ఈయన కూడా గంటాతో పాటే సైకిల్ దిగుతారు అని విపరీతమైన ప్రచారం అయితే ఈ మధ్యన సాగింది. ఇక గంటా శ్రీనివాసరావు సామాజికవర్గానికే చెందిన చిన రాజప్పను విశాఖ ఇంచార్జిగా చేసి ఆయన కధను చూడమన్నట్లుగా బాబు అనధికార ఆదేశాలు జారీ చేశారనుకోవాలి. ఈయన కూడా ఓసీ కాపు కావడంతో అటు పార్టీని కాపు కాచుకుంటూ గంటా మీద ఒక కన్నేసి ఉంచుతారన్న మాట.

ఒంటరయ్యారా…?

గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంలో ఇపుడు సంక్లిష్టమైన రోజులు వచ్చాయా అన్నది ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది. అటు చూస్తే జగన్ గంటాను నమ్మడంలేదు. ఆయన తప్ప ఎవరైనా వైసీపీలోకి రావచ్చు అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావును పట్టించుకోకుండా ఆయన నుంచి వర్గాన్ని వేరు చేసే ప్లాన్ వేశారు. ఈ పరిణామాలు చూస్తే గంటా ఇపుడు ఒంటరి అయ్యారనుకోవాలి. పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా ఆయన పొలిటికల్ సీన్ ఉందని కూడా చెబుతున్నారు. ఆయన ఎలాగోలా దారికి వచ్చి టీడీపీకి సరెండర్ అయినా మునుపటి వైభోగం ఉంటుందా అన్నది ఒక డౌట్. ఇక వైసీపీ తలుపులు తీసినా గుంపులో గోవిందంలా చూస్తుందా అన్నది మరో సందేహం. మొత్తానికి గంటా శ్రీనివాసరావు రాజకీయానికి ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News