బాబుతో దూరమా.. వైరమా…?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ మధ్యన తన మనసు బాగానే విప్పుతున్నారు. మీడియా ముందు తన లోపలి హృదయాన్ని బాగానే ఆవిష్కరిస్తున్నారు. తన రాజకీయం ఏంటన్నది [more]

Update: 2021-03-20 08:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ మధ్యన తన మనసు బాగానే విప్పుతున్నారు. మీడియా ముందు తన లోపలి హృదయాన్ని బాగానే ఆవిష్కరిస్తున్నారు. తన రాజకీయం ఏంటన్నది చెబుతూ అర్ధం చేసుకోమంటున్నారు. అదే సమయంలో మీడియా రాతలకూ, తన అంతరంగానికి మధ్యన ఉన్న తేడాను కూడా విడమరచి చెబుతున్నారు. మొత్తానికి తాను సీనియర్ రాజకీయ నేతనే కాదు, మేధావిని అని కూడా అంటున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీలతో ఎడం పాటిస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఒక విపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ మీడియాలో ఇంతలా వెలిగిపోవడమే అసలైన చాణక్యం.

లోకేష్ కారణమా….?

గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబుతో విభేదాలు రావడానికి లోకేష్ కారణం అంటారు. 2019 ఎన్నికల వేళ లోకేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, ఆయన ఓవర్ నైట్ విశాఖ జిల్లా భీమిలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే గంటా శ్రీనివాసరావు జాతకం మొత్తం తారు మారు అవడానికి కారణం అయిందని అంటారు. నాడు భీమిలీ నుంచి లోకేష్ పోటీ చేస్తాడు కాబట్టి గంటాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయమని బాబు ఆదేశించారట. తాను ఎంపీగా పోటీ చేయకుండా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడంతోనే బాబుకు తనకూ గ్యాప్ ఏర్పడింది అన్నది గంటా శ్రీనివాసరావు భావన.

అందుకేనా బాబు గుస్సా….?

అప్పట్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అంతా ఊహించారు. టీడీపీ పవర్ లోకి వస్తే లోకేష్ విశాఖ జిల్లా కోటా నుంచి మంత్రి అవడానికే గంటా శ్రీనివాసరావును లోక్ సభకు పంపేందుకు బాబు మస్టర్ ప్లాన్ వేశాడని చెబుతారు. దాన్ని గ్రహించడం వల్లనే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుంచి పోటీకి దిగారని అంటారు. ఇక గంటా ఎమ్మెల్యేగా బరిలోకి దిగేసరికి చంద్రబాబు వ్యూహం మార్చి లోకేష్ ని మంగళగిరికి షిఫ్ట్ చేశారు. కానీ భీమిలీ సీటు మాత్రం గంటా శ్రీనివాసరావుకు ఇవ్వలేదు. మంగళగిరిలో లోకేష్ ఓడారు. అదే భీమిలీ అయితే గెలిచేవారు అన్న డౌట్ బాబులో ఎక్కడో ఉందిట. అలా గంటా శ్రీనివాసరావుతో నాటి గ్యాప్ కాస్తా దూరంగా మారిందని అంటున్నారు.

సర్దుబాటు ఉందా …?

ఇక గంటా శ్రీనివాసరావు వెర్షన్ చూస్తే లోకేష్ కెలుకుడుతోనే భీమిలీ నుంచి షిఫ్ట్ కావాల్సివచ్చిందని అన్నట్లుగా చెబుతారు. అయినా బాబుతో తనకు పెద్దగా విభేదాలు లేవని తాజాగా మీడియాతో మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు అంటున్నారు. తనకు బాబుకు మధ్య వైరం లేదు కాస్తా ఎడమే ఉందని కూడా అంటున్నారు. అంతే కాదు ఎన్నికలు అయిన తరువాత తాను చంద్రబాబుని పెద్దగా కలవలేదని కూడా లోగుట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావుకు బాబుకు మధ్య ఉన్నది దూరమే అయితే ఏదో రోజున సర్దుకుంటుంది. వైరంగా మారితే మాత్రం అది పెరిగేదే కానీ తరిగేది కాదని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఈ కధలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో.

Tags:    

Similar News