‘‘గరుడ’’కు రెక్కలు తెగాయా?

అటు తెలంగాణ‌, ఇటు ఏపీలే కాకుండా ఏకంగా జాతీయ రాజ‌కీయాల గురించి కొంచెం ఆవేశం, మ‌రికొంత ఆగ్ర‌హం, ఇంకొంత కుల‌పిచ్చిని జోడించి.. మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన గ‌రుడ [more]

Update: 2019-11-01 06:30 GMT

అటు తెలంగాణ‌, ఇటు ఏపీలే కాకుండా ఏకంగా జాతీయ రాజ‌కీయాల గురించి కొంచెం ఆవేశం, మ‌రికొంత ఆగ్ర‌హం, ఇంకొంత కుల‌పిచ్చిని జోడించి.. మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన గ‌రుడ పురాణం శివాజీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఆయ‌న నోరు విప్పితే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ఎవ‌రో ఎక్క‌డో చ‌క్రం తిప్పుతున్నార‌ని, ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై కేసులు న‌మోదవుతున్నాయ‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్ని రోజులు ప్ర‌త్యేక హోదా అంటూ హ‌ల్ చ‌ల్ చేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకొంటే.. చంద్ర‌బాబు ఇంటి ద‌గ్గ‌రే తాను శ‌వ‌మై కూర్చుంటానంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి….

శివాజీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చూపారు. ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయింది. ఇక‌, ఎన్నిక‌ల్లో ఈవీఎంలతోనే విజ‌యం సాధించార‌ని, నిజాయితీగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేద‌ని కూడా మీడియా ద్వారా విరుచుకుప‌డ్డారు. అటు మోడీపైనా, ఇటు జ‌గ‌న్ పైనా కూడా ఆయ‌న విరుచుకుప‌డిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, హ‌ఠాత్తుగా ఆయ‌న అదృశ్య‌మ‌య్యారు. నిత్యం ఏదో ఒక విష‌యంతో మీడియాతో ఉండే శివాజీ అనూహ్యంగా క‌నిపించ‌క‌పోవ‌డంతో అస‌లు ఏమైంద‌నే వ్యాఖ్య‌లు వినిప‌స్తున్నాయి. ఇటీవ‌ల టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ కేసు వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడు దీనిలో శివాజీ కూడా ఉన్నాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

అరెస్ట్ కు ప్రయత్నించి…..

ఈయ‌న కూడా ఈ మోసంలో పాలు పంచుకున్నార‌ని, ఇద్ద‌రూ క‌లిసే టీవీ 9కు టోపీ పెట్టార‌ని వివ‌రించ‌డమే కాకుండా కేసులు కూడా న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే శివాజీని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, శివాజీ మాత్రం మారు వేషాల్లో అమెరికాకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. త‌న కుమారుడిని అక్క‌డ స్కూల్లో చేర్చాల్సి ఉంద‌ని, వెళ్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. అయితే, పోలీసులు మాత్రం ఎక్క‌డికక్క‌డ ఆయ‌న‌ను అడ్డ‌గించారు.

బిచాణా ఎత్తేశారా?

అయితే, అప్ప‌టి నుంచి శివాజీ ఎక్క‌డా ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. పోనీ సినిమాల్లో ఏమైనా బిజీగా ఉన్నాడా? అంటే అది కూడా లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సినిమా హీరోగా అవ‌కాశాలు కూడా క‌రువ‌య్యాయి. దీంతో ఫ్యూచ‌ర్ చెప్పే ఈ గ‌రుడ పురాణం గురూజీ.. అదే శివాజీ ఏమ‌య్యారా? అని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. రవిప్రకాష్ పై కేసులు నమోదు కావడంతో శివాజీ బిచాణా ఎత్తేశారంటున్నారు. మ‌రి ఎప్పుడు క‌నిపిస్తారో.. ఈ ద‌ఫా ఏ పురాణం వినిపిస్తారో చూడాలి..!!

Tags:    

Similar News