జార్జిరెడ్డి మూవీ రివ్యూ
నటీనటులు: సందీప్ మాధవ్, ముస్కాన్, సత్య దేవ్, మనోజ్ నందన్, అభయ్ మ్యూజిక్: హర్షవర్ధన్, సురేష్ బొబిలి సినిమాటోగ్రఫీ: సుధాకర్ యక్కంటి ఎడిటింగ్: ప్రతాప్ కుమార్ నిర్మాతలు: [more]
నటీనటులు: సందీప్ మాధవ్, ముస్కాన్, సత్య దేవ్, మనోజ్ నందన్, అభయ్ మ్యూజిక్: హర్షవర్ధన్, సురేష్ బొబిలి సినిమాటోగ్రఫీ: సుధాకర్ యక్కంటి ఎడిటింగ్: ప్రతాప్ కుమార్ నిర్మాతలు: [more]
నటీనటులు: సందీప్ మాధవ్, ముస్కాన్, సత్య దేవ్, మనోజ్ నందన్, అభయ్
మ్యూజిక్: హర్షవర్ధన్, సురేష్ బొబిలి
సినిమాటోగ్రఫీ: సుధాకర్ యక్కంటి
ఎడిటింగ్: ప్రతాప్ కుమార్
నిర్మాతలు: తిప్పి రెడ్డి, సంజీవ్ రెడ్డి
దర్శకత్వం: జీవన్ రెడ్డి శైలి
జార్జి రెడ్డి అనే పేరు 50 ఏళ్ళ క్రితం ఓ సంచలనం, విద్యార్థి సంఘాలకు, రాజకీయాల్లో జార్జి రెడ్డి పేరే పెద్ద సంచలనం. విద్యార్థుల తరఫున పోరాడి 25 ఏళ్ల వయసులోనే శత్రువుల చేతుల్లో ప్రాణాలు వదిలిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. కానీ ఇప్పుడున్న యువతకు కొద్దిమందికి మాత్రమే జార్జిరెడ్డి పేరు తెలుసు, ఆయన జీవితం గురించి తెలుసు. కానీ చాలామందికి జార్జిరెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటిది గత నెలరోజులుగా ఏ టీవీ ఛానల్ పెట్టినా జార్జిరెడ్డి.. జార్జిరెడ్డి అనే పేరు మాత్రమే వినిపించింది. మీడియాలో జార్జిరెడ్డి పేరు పదే పదే రావడం, జార్జిరెడ్డి ప్రమోషన్స్ కి పోలీస్ ల అనుమతి లేకపోవడం, మెగా ఫ్యామిలీ నుండి జార్జిరెడ్డి కి పాజిటివ్ ప్రమోషన్ దక్కడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ జార్జిరెడ్డి సినిమాపై పడింది. అసలు ఈ జార్జిరెడ్డి ఎవరు అనే ఆత్రుత అందరిలో మొదలైంది. అసలు ఈ జార్జిరెడ్డి ఎవరు? జార్జిరెడ్డి ఎంతో మంది అణగతొక్కబడ్డ విద్యార్ధుల్లో చైతన్యం నింపి హీరో ఎలా అయ్యాడు? హీరో కాదు జార్జిరెడ్డి విలన్ అంటున్నారు కొందరు? అసలు ఆ కథ కమామిషు ఏమిటో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ:
జార్జిరెడ్డి(సందీప్ మాధవ్) ది చిన్నప్పటినుండి కొత్త విషయాలను ఎదో విధంగా కనుక్కోవాలనే ఆత్రుత ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటినుండి చదువంటే ఇంట్రెస్ట్, యుద్ధ విన్యాసాల్లోనూ జార్జిరెడ్డి ప్రతిభ చూపిస్తాడు. భగత్ సింగ్, చెగువేరా స్పూర్తితో కళ్లముందు అన్యాయం జరిగితే చూసి తట్టుకోలేడు. అన్యాయం జరిగితే చిన్న పెద్ద తేడా చూడకుండా తిరగబడతాడు. పై చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరతాడు. ఉస్మానియా యూనివర్శిటిలో పేద, ధనిక వివక్ష ని చూసి తట్టుకోలేని జార్జిరెడ్డి స్నేహితులు దస్తగిరి(పవన్), రాజన్న(అభయ్)లతో కలిసి తిరగబడతాడు. అతి తక్కువ కాలంలోనే విద్యార్ధినేతగా ఎదుగుతాడు. అయితే అప్పటికే యూనివర్సిటీలో ఏబీసీడీ అనే స్టూడెంట్ యూనియన్‌తో పాటు మరో యూనియన్ మధ్య వర్గపోరు నడుస్తుంటుంది. ఏబీసీడీ ఉద్యమ నేతగా సత్య (సత్యదేవ్) వరుసగా మూడుసార్లు ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతాడు. తర్వాత ఏడాది పీఎస్ అనే విద్యార్ధి యూనియన్‌ను స్థాపించిన జార్జిరెడ్డి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. తర్వాత విప్లవభావాలని జార్జిరెడ్డి అన్ని యూనివర్సిటీలకు తెలిసేలా చేస్తాడు. రైతుల కోసం సమరశంఖం మోగిస్తాడు. ఇలా జార్జిరెడ్డి పేరు మార్మోగిపోవడం, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితుల మధ్యన జార్జిరెడ్డిని కొంతమంది పథకం ప్రకారం హత్య చేస్తారు. అసలు జార్జిరెడ్డిని ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చింది? ఎవరు హత్య చేశారు? జార్జిరెడ్డిని వెన్నుపోటు పొడిచిందెవరు అనేది తెర మీద చూడాల్సిన కథ.
నటీనటులు:
సందీప్ మాధవ్ బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్, వ్యవహారశైలి, తిరుగుబాటు నాటి జార్జిరెడ్డిని గుర్తు చేస్తాయి. 25 ఏళ్ల వయసులో పోరాటయోధుడిగా.. బాక్సింగ్ ఛాంపియన్‌గా.. మేధావి అయిన విద్యార్ధిగా జార్జిరెడ్డి పాత్రను పర్ఫెక్షన్ మిస్ కాకుండా పరకాయ ప్రవేశం చేశాడు హీరో సందీప్ మాధవ్. ముస్కాన్.. మాయ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. జార్జి తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక ఎమోషన్స్ బాగా పండించింది. తల్లీకొడుకుల ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్, పటాస్ యాదమరాజులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
జార్జిరెడ్డి సినిమా మొత్తం ఉస్మానియా యూనివర్శిటీ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కింది. అందుకే దర్శకుడు అడగగానే నిర్మాతలు పర్ఫెక్షన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకించి సెట్ వేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు జీవన్ రెడ్డి ఎంత హోం వర్క్ చేశాడో తెరపై ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. సుమారు 5 నెలల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి అక్కడి నేటివిటీని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఉస్మానియా యూనివర్సిటీ అయితే… ఇప్పటికీ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్. అలాంటిది 1970 కాలంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉండేవో. ఈకాలం వారికీ కళ్ళకు కట్టినట్టుగా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. రెబల్ కథకు కమర్షియల్ అంశాలను జోడించి ఆసక్తికరంగా కథను మలిచాడు. ఒరిజినల్ కథకు కమర్షియల్ హంగులు జోడించి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉంచిన దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలోనే ఎక్కువ ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే చాలా రేసీగా అనిపించింది. కానీ సెకండాఫ్‌కి నెమ్మదించింది. కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుందా? అనిపిస్తుంది. జార్జిరెడ్డి జీవితంలో సినిమాలకు సరిపోయే మలుపులేం ఉండవు. క్యాంపస్‌లో ఎక్కడ అన్యాయం జరిగినా హీరో మాదిరి వెళ్లి తుక్కు రేగ్గొట్టే సీన్లు పదే పదే ఉండటం.. ఉద్యమ తాలూకు బలమైన సీన్లు లేకపోవడం సినిమాకు ప్రధానమైన లోటు. కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. దీనికి తోడు ప్లే ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతుంది. అయితే ఈ సినిమా లో క్లైమాక్స్‌లో చనిపోయే సీన్ సినిమాకే హైలైట్.. చావు కళ్లు ముందు కనిపిస్తున్నా.. ఒంటిపై 60పైగా కత్తి పోట్లు ఉన్నా చేతిలోని ఆయుధాన్ని వదలకుండా చివరి వరకూ పోరాడే సీన్‌లో హీరో సందీప్ కంటతడి పెట్టించాడు. కాకపోతే దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయాడు.
సాంకేతికంగా…
పాటలు సంగతెలా ఉన్నప్పటికీ… సురేష్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకే హైలెట్ అనేలా ఉంది. హీరోయిజం ఎలివేట్ చేయడంలో అతని బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్లకు మరింత బలాన్ని ఇచ్చింది. సుధాకర్ యెక్కంటి కెమెరా గొప్పతనం ప్రతి ఫ్రేమ్ లోను కనబడుతుంది. ముఖ్యంగా ఫైర్ ఫుడ్ బాల్, బ్లేడ్ ఫైట్‌లతో సుధాకర్ కెమెరా పనితనం అద్భుతం. ఉస్మానియా సెట్‌ను రియలిస్టిక్‌గా చూపించారు.ఇక నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.75/5