“పవర్” కోసమే పుతిన్…?

వ్లాదిమిర్ పుతిన్…. ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయగల దేశాధినేతల్లో ఒకరు. గత రెండు దశాబ్దాలుగా రష్యాకు పర్యాయపదంగా మారిన నాయకుడు. 2000 నుంచి కొంతకాలం ప్రధానిగా, మరికొంతకాలం [more]

Update: 2020-02-03 17:30 GMT

వ్లాదిమిర్ పుతిన్…. ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయగల దేశాధినేతల్లో ఒకరు. గత రెండు దశాబ్దాలుగా రష్యాకు పర్యాయపదంగా మారిన నాయకుడు. 2000 నుంచి కొంతకాలం ప్రధానిగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా దేశ రాజకీయాలను శాసించిన తిరుగులేని నాయకుడు మరో నాలుగేళ్ల పాటు అంటే 2024 వరకూ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశముంది ఈ మాజీ కేజీబీ ఏజెంట్ కు. రష్యా గూఢాచారి సంస్థ (కేజీబీ) లో పనిచేసి దేశాధినేత స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు. 1991లో నాటి సోవియట్ యూనియన్ పతనం అనంతరం దానికి ప్రతి రూపంగా నిలిచిన రష్యాను బలమైన దేశంగా తీర్చిదిద్దిన ధీశాలి. 76 సంవత్సరాల పుతిన్ మరో నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేనాటికి 80 ఏళ్లు వస్తాయి. అప్పటికి వృద్ధాప్యం వస్తుంది. దేశాధినేతగా ఎన్నికయ్యే, కొనసాగే అవకాశం దాదాపు ఉండదు.

సంస్కరణలు అందుకేనా?

ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా ప్రతిపాదించిన సంస్కరణలపై ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా విస్తృత చర్చ జరుగుతోంది. సంస్కరణ పేరిట మరికొంత కాలం పాటు కొనసాగే ఉద్దేశ్యంతోనే ఈ ఎత్తుగడ వేశారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జాతి హితాన్ని దృష్టిలో పెట్టుకుని తన పదవీకాలం అనంతరం కూడా భవిష్యత్తులో రష్యాను బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు సంస్కరణలన ప్రతిపాదించారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ రెండింటిలో ఏది వస్ాతవం అన్నది తెలియాలంటే 2024 వరకూ ఆగక తప్పదు.

అధ్యక్షుడి అధికారాలు…..

పుతిన్ ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం అధ్యక్షుడి అధికారాలు పరిమితం అవుతాయి. దేశ పార్లమెంటు అయిన “డ్యూమా” కీలకంగా మారుతుంది. పుతిన్ నోటి నుంచి ప్రకటన వెలువడగానే ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం పన్ను సేవల అధికారిగా ఉన్న పుతిన్ విశ్వాసపాత్రుడు మిచాయిల్ మిశుస్తిన్ ప్రధాని అవుతారన్న ప్రచారం జరుగుతుంది. పుతిన్ ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం “డ్యూమా” ప్రధానిని ఎన్నుకుంటుంది. ప్రధానికి ఆయన మంత్రి వర్గ సభ్యులకు మరిన్ని అధికారాలు కల్పిస్తారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. ప్రధాని నామమాత్రం. ప్రధానిని అధ్యక్షుడే నియమిస్తారు. అధ్యక్షుడికి ఇష్టం లేకపోతే ప్రధాని ఇంటిదారి పట్టక తప్పదు.

అధికారం కోసమేనా?

పుతిన్ 2000 నుంచి 2008 వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాజ్యాంగం అంగీకరించు. దీంతో 2009 లో మెద్వదేవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధాని గా వ్యవహరించారు పుతిన్. తెర వెనక పుతిన్ సూచనల మేరకే మెద్వదేవ్ పాలన కొనసాగించారు. అంతేకాక అధ్యక్షుడి పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. నాలుగేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన పుతిన్ 2012లో మళ్లీ అధ్యక్షుడు అయ్యారు. 2018లోనూ మళ్లీ అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు. ఆరేళ్ల పదవీకాలం 2024లో ముగుస్తుంది. 2024 తర్వాత మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలన్న ఉద్దేశ్యంతో పుతిన్ ఉన్నారని, అందుకే ప్రధాని పదవికి మరిన్ని అధికారాలు కల్పిస్తూ సంస్కరణలను ప్రతిపాదించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో 2024 లో తన అనుచరుడు మెద్వదేవ్ ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడమే లక్ష్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చడం కష్టమే. ఏ నాయకుడు పదవిని వదులుకునేందుకు సహజంగా ఇష్టపడరు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇందుకు పుతిన్ ఏమాత్రం మినహాయింపు కాదు. రష్యా భవిష్యత్తు, దేశాన్ని బలోపేతం చేయడం అన్న మాటలు వట్టివేనన్న విమర్శలకు కొదవేలేదు. ఏదో పేరుతో 2024 తర్వాత కూడా అధికారంలో కొనసాగడమే పుతిన్ అసలు లక్ష్యం. తద్వారా జోసెఫ్ స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన నాయకుడిగా పుతిన్ చరిత్రకు ఎక్కడం ఖాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News