కాంగ్రెస్ లొల్లి తేలేలా లేదే ?

ఆలు లేదు చూలు లేదు … అన్నచందంగా అధికారం లేదు, అవకాశం లేదు అయినా కానీ ఆ పదవి కావలి వారికి. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ [more]

Update: 2019-06-26 18:29 GMT

ఆలు లేదు చూలు లేదు … అన్నచందంగా అధికారం లేదు, అవకాశం లేదు అయినా కానీ ఆ పదవి కావలి వారికి. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ దుస్థితి. పార్టీకి ప్రజల్లో ఇమేజ్ తేవడానికి బదులు ఎవరికి వారు తమకు పిసిసి కిరీటం దక్కితే చాలు అని పోరాటం మొదలు పెట్టడం కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కి ప్రతిరూపం అయ్యింది. ఎన్నికలకు ముందు ఫలితాలు రాకుండానే ఎవరికి వారే ముఖ్యమంత్రి రేసులో మేమంటే మేమన్నారు టి కాంగ్రెస్ దిగ్గజాలు. ఫలితాలు వచ్చాయి వీరంతా కుదుట పడతారు అనుకుంటే మరింత దిగజారుడు రాజకీయాలు పదవులకోసం పడుతూ ప్రజల్లో పలుచన అవుతున్నారు కాంగీయులు. దాంతో గులాబీ పార్టీకి యమా సంతోషంగా వుంది.

బిసి కి ఇవ్వండి …

ప్రస్తుతం టి కాంగ్రెస్ లో పిసిసి పదవి ని మార్చడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుత ఉత్తమకుమార్ రెడ్డి నుంచి కిరీటాన్ని మార్చి కొత్తవారికి పగ్గాలు అప్పగించి పార్టీని దూసుకుపోయేలా చేయాలన్నది అధిష్టానం ఆలోచన. అయితే సీల్డ్ కవర్ పాలిటిక్స్ నిర్వహించే కాంగ్రెస్ లో అధిష్టానం ఆశీస్సుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి భాగ్యనగరానికి వచ్చి పదవి నాకే అంటే నాకు అని నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇది పార్టీ విధేయులను కలవరపెడుతుంది. మరోపక్క టి పిసిసి చీఫ్ బిసిలకు ఇవ్వాలన్న డిమాండ్ పెడుతున్నారు విహెచ్. మూడు కీలకమైన పదవులను రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చి మొన్నటి ఎన్నికల్లో వైఫల్యం చెందినా అధిష్టానం వారివైపు మొగ్గుచూపడాన్ని విహెచ్ తప్పు పడుతున్నారు.

భవిష్యత్తు ఎక్కడా …?

ఒక పక్క అధికారంలోని గులాబీ దళం కాంగ్రెస్ నేతలను ఏ మాత్రం బతకనీయడం లేదు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టి కాంగ్రెస్ ను ఖాళీ చేయిస్తుంది. మరోపక్క బిజెపి తానేమి తక్కువ తినలేదని కారు ఎక్కడానికి ఇష్టం లేని వారిని తమచెంతకు తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలో వున్న కొద్ది మంది నేతలు ఐక్యంగా వుండాలిసింది పోయి పార్టీకి ఏమైతే మాకెలా మాకు మాత్రం పదవే పరమావధి అనేలా వ్యవహారం సాగించడం తో అధిష్టానం నుంచి కార్యకర్తల వరకు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ సమస్య నుంచి టి కాంగ్రెస్ ఎప్పటికి బయటపడుతుందో మరింతగా బలహీనపడుతుందో చూడాలి.

Tags:    

Similar News