విశాఖ కు ఆ కల ఎప్పటికి తీరేను… ?

విశాఖ అంటే దాని పేరుకు ముందు ఎన్నో విశేషణాలు కనిపిస్తాయి. తాజాగా జగన్ సర్కార్ పరిపాలనా రాజధాని అని కూడా తగిలించింది. దీనికి ముందు కల్చరల్ క్యాపిటల్ [more]

;

Update: 2021-09-23 11:00 GMT

విశాఖ అంటే దాని పేరుకు ముందు ఎన్నో విశేషణాలు కనిపిస్తాయి. తాజాగా జగన్ సర్కార్ పరిపాలనా రాజధాని అని కూడా తగిలించింది. దీనికి ముందు కల్చరల్ క్యాపిటల్ అన్నారు. ఆర్ధిక రాజధాని అని కూడా చెప్పారు. సినీ, పర్యాటక రాజధానిగా కూడా విశాఖను తెగ పొగిడారు. రెండు దశాబ్దాలుగా విశాఖను ఐటీ రాజధాని అంటున్నారు. మరి ఐటీ కళ విశాఖకు ఎంత ఉంది. ఎప్పటికైనా ఆ కల తీరేనా అంటే సమాధానం మాత్రం చెప్పడం కష్టమే. ప్రభుత్వాధినేతలు చాలా సులువుగా ఇలా మాట్లాడేస్తూంటారు. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఐటీ వర్శిటీ ….

విశాఖలో ఐటీ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఐటీ పాలసీలో ఇది కీలకంగానే చూడాలి. దాదాపుగా వందేళ్ల చ‌రిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్శిటీ విశాఖకు ఆభరణంగా ఉంది. దానికి ధీటుగా ఐటీ వర్శిటీని తీర్చిద్దుతామని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది వినూత్న ఆలోచన. ఐటీ వర్శిటీ వస్తే కనుక ఐటీ పరిశ్రమకు కావల్సిన అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయి. ఇక్కడ ట్రైనింగ్ అయిన విద్యార్ధులకు ఆకాశమే హద్దుగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతే కాదు భవిష్యత్తు అవసరాలను గమనించి దానికి తగినట్లుగా ఐటీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు వీలు ఉంటుంది.

ఐటీ కారిడార్ గా…

జగన్ ప్రభుత్వం పాలసీ మాత్రం బాగుందనే ఐటీ నిపుణులు అంటున్నారు. విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీని చక్కగానే గమనించారని కూడా అంటున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి ఐటీ కంపెనీలతో పాటు, ఐటీ ఆధారిత పరిశ్రమల ద్వారా టర్నోవర్ రెండు వేల కోట్లు దాకా ప్రభుత్వానికి వస్తోంది. ఇక వేలాది మంది ఉద్యోగులు కూడా ఉత్తరాంధ్రా జిల్లాలో ఐటీ కంపెనీల వల్ల ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. దీనికి పునాది వేసింది మాత్రం వైఎస్సార్ అని చెప్పాలి. ఆయన టైమ్ లోనే విశాఖకు విప్రో, టెక్ మహేంద్రా వంటివి వచ్చాయి. ఇక వైసీపీ సర్కార్ ఐటీ పాలసీతో పాటు ప్రోత్సాహకాల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఐటీ పరిశ్రమలు విశాఖ వైపు చూస్తున్నాయని అంటున్నారు.

చేతలు ఉంటేనే …?

గత టీడీపీ సర్కార్ విశాఖను ఐటీలో మేటిగా చేస్తామని భారీ ప్రకటనలే చేసింది. ఐటీ సిగ్నేచర్ టవర్ అన్నారు. ఐటీ సిటీ అని కూడా చెప్పుకున్నారు. కానీ అయిదేళ్ల పాలనలో ఏమీ చేయలేకపోయారు. అయితే విశాఖ మీద జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నందువల్ల ఐటీ రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటారు అన్న ఆశ అయితే ఉంది. మరి దానికి తగినట్లుగా యాక్షన్ ప్లాన్ ఉంటే విశాఖ ఐటీ రాజధాని కావడం ఖాయమే అంటున్నారు. మిగిలిన రాజధానుల సంగతి ఎలా ఉన్నా విశాఖ తలెత్తుకుని తిరిగే సీన్ ఉంటుంది అంటున్నారు. మరి జగన్ ప్రభుత్వం కనుక దూకుడు పెంచితే విశాఖ విఖ్యాతి పెరగడమే కాదు ప్రభుత్వానికి కూడా మరింత ఆదాయం లభిస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News