దెబ్బకు దెబ్బ ఇదేనా…?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ రాజకీయాలను కొత్త మలుపులు [more]
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ రాజకీయాలను కొత్త మలుపులు [more]
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ రాజకీయాలను కొత్త మలుపులు తిప్పుతున్నారు. ఇన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎడాపెడా పార్టీలో చేర్చుకుని జగన్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టిన చంద్రబాబుకు ఎన్నికల వేళ జగన్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇన్నాళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిధులను చంద్రబాబు చేర్చుకుంటే… ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీలోకి చేర్చుకుని జగన్ టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్నారు. వాస్తవానికి, వైసీపీలో చేరిన వారంతా ఒక్కరోజు మాట్లాడితే చేరిన వారు కాదు. వీరితో ముందు నుంచే వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ వీరందరినీ వరుస పెట్టి వైసీపీలో చేర్చుకుంటున్నారు.
ఇన్నాళ్లు చంద్రబాబు… ఇప్పుడు జగన్
2014 ఎన్నికలు ముగియగానే ప్రతిపక్ష వైసీపీని బలహీనపరిచేందుకు టీడీపీ అనేక చర్యలను చేపట్టింది. ఎన్నికలు ముగియగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మొదలుకొని వరుసగా చేరికలను ప్రోత్సహించింది. 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలకు పచ్చ కండువాలు కప్పేసింది. వైసీపీని పూర్తిగా బలహీనపర్చడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదిపింది. అయితే, టీడీపీ లక్ష్యం నెరవేరలేదు. మొదట పార్టీ ఫిరాయింపులతో వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. ఒకానొక సమయంలో వైసీపీ ఇక బలోపేతం కావడం కష్టమే అని అభిప్రాయాలు వచ్చాయి. అయితే, జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పార్టీ శ్రేణుల్లో ధైర్యం తీసుకురావడంతో పాటు ఫిరాయింపులకు కూడా అడ్డుకట్ట వేయగలిగారు. ఇక, తాజాగా ఎన్నికల వేళ ఎవరూ ఊహించని విధంగా టీడీపీకి వైసీపీ వరుస షాక్ లు ఇస్తోంది.
ఎన్నికల వేళ వైసీపీ వ్యూహం
ప్రతీ రోజు ఒక తెలుగుదేశం పార్టీ నేత వైసీపీలో చేరేలా వ్యూహం రచించింది. ఇందులో భాగంగా రాజంపేట ఎమ్మెల్యే మోడా మల్లికార్జున్ రెడ్డితో ఈ చేరికలు మొదలైనా ఆమంచి కృష్ణమోహన్ చేరిక తర్వాత ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇద్దరు ఎంపీలు కూడా అధికార పార్టీని వదిలి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న జైరమేశ్ కూడా వైసీపీలో చేరారు. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు మోదగుల వేణుగోపాల్ రెడ్డి, తోట త్రిమూర్తులు పేర్లు ఈ చేరికల లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే, పైకి ఈ ప్రచారాన్ని తప్పుపడుతున్నా… వీరి గట్టిగా మాత్రం ఖండించడం లేదు. దీంతో వీరి చేరిక కూడా దాదాపు ఖాయమే అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ప్రతిపక్ష వైసీపీలో వలసలు పెరగడం ఆ పార్టీకి మేలు చేసేలా కనిపిస్తోంది. వచ్చే నేతల బలాబలాలు పక్కన పెడితే.. ఈ చేరికలు వైసీపీ అధికారంలోకి రాబోతోంది అనే ఒక భావన ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.