‘‘సీమ’’లో… భం భం భోలే…!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి చివర్లో ఎన్నికల నోటిఫకేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఈసారి తిరగి అధికారం [more]

Update: 2019-01-26 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి చివర్లో ఎన్నికల నోటిఫకేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఈసారి తిరగి అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. అయితే, గత ఎన్నికల్లో చేజారిన అవకాశాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యంగా పట్టున్న ప్రాంతాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునే దిశగా వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అందుకే వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను టార్గెట్ చేశారు. ఈ ఆరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తే అధికారంలోకి రావడం సులువవుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే, ముందుగా రాయలసీమ నుంచి ‘సమర శంఖారావం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్కడ బూత్ లెవల్ కమిటీలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

పట్టు నిలుపుకునే ప్రయత్నంలో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాయలసీమలో బలంగా ఉంది. ఇక, సీమకు దగ్గరగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా బలంగానే ఉంది. ఈ విషయం 2014 ఎన్నికల్లోనూ నిరూపితమైంది. ఈ ఆరు జిల్లాల్లో ఒక్క అనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాల్లో టీడీపీ కంటే వైసీపీ ఆధిక్యత ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులో కూడా 14 స్థానాల్లో 8 స్థానాలు సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ ఎన్నికల్లోనూ ఈ ఆరు జిల్లాలపైనే జగన్ ఫోకస్ చేశారు. ఇక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని ఆయన భావిస్తున్నారు. మొత్తం 74 నియోజకవర్గాలు ఉన్న ఈ ఆరు జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లు దక్కించుకోగా వైసీపీ 43 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా 60కి పైగా స్థానాలను ఇక్కడ దక్కించుకోవాలని వైసీపీ యోచిస్తోంది. వైసీపీ అనుకుంటున్నట్లు ఈ ఆరు జిల్లాల్లోనే 60 సీట్లు గనుక గెలిస్తే మిగతా ఏడు జిల్లాల్లోని 101 స్థానాల్లో 28 స్థానాలు వస్తే అధికారం చేపట్టవచ్చు.

కడపలో క్లీన్ స్వీప్ చేసేనా..?

అందుకే, తమకు పట్టున్న ప్రాంతంపైనే మరింత దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించారు. అందుకే ఇక్కడ అభ్యర్థుల ఎంపికపైన కూడా ఇప్పటికే ఆయన కసరత్తు పూర్తి చేశారు. ఏయే నియోజకవవర్గాల్లో ఎవరు నిలబడతారో ఆయన అభ్యర్థులకు కొంత స్పష్టత ఇచ్చారు. ఇక, గత ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటిన అనంతపురం జిల్లాపైన ఈసారి జగన్ ఫోకస్ చేశారు. అక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు కూడా వైసీపీకి కలిసివచ్చే అవకాశాలున్నాయి. అయితే, టీడీపీలో ఇక్కడ బలమైన నేతలు ఉండటంతో జగన్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. తన స్వంత జిల్లా కడపలో 10కి 10 స్థానాలు దక్కించుకునే దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన రాజంపేట స్థానంలోనూ మేడా మల్లికార్జునరెడ్డి చేరికతో వైసీపీ బలోపేతమైంది. అయితే, జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసి పనిచేస్తే అక్కడ వైసీపీకి విజయం సులువు కాదు. మిగతా అన్ని స్థానాల్లో ఇప్పటికీ వైసీపీ బలంగా కనిపిస్తోందని అంటున్నారు.

నెల్లూరు ఓకే… మిగతావి..?

ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో గత ఎన్నికల్లో 14 స్థానాలకు 8 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనుకుంటోంది. ఆ జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ టార్గెట్ ను తీసుకుని పని చేస్తున్నారు. ఇంతకుముందు గెలిచిన స్థానాలను కాపాడుకోవడంతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి స్థానాలను కూడా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్నూలులో గత ఎన్నికల్లో వైసీపీ హవా వీచినా పార్టీ ఫిరాయింపులు బాగా నష్టం చేశారు. అయినా పార్టీ బలంగానే ఉంది. మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలనుకుంటున్న ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాలను సైతం ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా కనిపిస్తోంది. సీనియర్ నేతల చేరికలతో గత ఎన్నికల కంటే కూడా ఆ పార్టీ బలోపేతమైందంటున్నారు. ఇక, ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ సమాన స్థాయిలో బలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫిరాయింపులు వైసీపీని దెబ్బతీశాయి. అయితే, బలమైన నాయకత్వం ఉండటం, ఓటు బ్యాంకు పదిలంగా ఉండటంతో వైసీపీ ప్రకాశం జిల్లాపై ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. మొత్తానికి రాయలసీమలో వైసీపీ టార్గెట్ – 60 ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News