పెద్దాయన రగిలిపోతున్నాడు

పెద్దాయనకు అస్సలు మింగుడు పడటం లేదు. నమ్మకంగా ఉండి తనయుడు కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేశారన్న కక్ష్యతో జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ రగిలిపోతున్నారు. తన [more]

Update: 2019-07-27 17:30 GMT

పెద్దాయనకు అస్సలు మింగుడు పడటం లేదు. నమ్మకంగా ఉండి తనయుడు కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేశారన్న కక్ష్యతో జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ రగిలిపోతున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కారణం కావడంతో వారిని రాజకీయంగా ఎలాగైనా దూరం చేయాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ తో విభేదించకున్నా…..

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో విభేదించే అవకాశాలు లేకున్నప్పటికీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దేవెగౌడ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నియోజకవర్గంలోని నలుగురు ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి ప్రధాన కుట్ర చేసినట్లు దేవెగౌడ గుర్తించారు. ఈ నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా ఒకరు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే. వీరిపై అనర్హత వేటు పడే అవకాశముండటంతో ఇక్కడ విజయావకాశాలపై దేవెగౌడ దృష్టి పెట్టారు.

నలుగురిపైనే గురి….

దేవెగౌడ పార్టీకి బెంగళూరు నగరంపై పెద్దగా పట్టులేదు. ఆయన తొలుత బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో ఆయన తుముకూరు వెళ్లారు. పట్టు లేని చోట ఎందుకన్నది అప్పట్లో ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నగరంపై పట్టు సాధించాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ నేతలతో విభేదించి అయినా సరే ఉప ఎన్నికలు జరిగితే గట్టి అభ్యర్థులను పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.

హైకమాండ్ దృష్టికి….

అందుకోసం త్వరలో దేవెగౌడ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశముందని తెలుస్తోంది. కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కాంగ్రెస్ కూడా కారణమని ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య వ్యవహారశైలిపై దేవెగౌడ గుర్రుగానే ఉన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్య అనుచరులే కావడం, వారిని తిరిగి రప్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలయమ్యారని దేవెగౌడ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా ఉప ఎన్నికల విషయంపైనా దేవెగౌడ చర్చించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News