బైడెన్ నిర్ణయంతో భారత్ భయం భయంగానే?

ఆఫ్గానిస్థాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం చూశాక ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న’ పాత తెలుగు సామెత గుర్తుకు రాక [more]

Update: 2021-05-17 16:30 GMT

ఆఫ్గానిస్థాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం చూశాక ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న’ పాత తెలుగు సామెత గుర్తుకు రాక మానదు. బైడెన్ నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారత్ మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. అమెరికా, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దళాల ఉపసంహరణ వల్ల అఫ్గాన్ కు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆయా దేశాలకు వచ్చే ఇబ్బందేమీ లేదు. ప్రత్యేకంగా కలిగే నష్టమూ ఏమీ లేదు. దళాలు వైదొలగడం వల్ల మధ్య ఆసియా దేశమైన ఆఫ్గాన్ కు, దాని పొరుగున గల భారత్ కు కలిగే నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇరవై ఏళ్ల క్రితం….

దళాల వైదొలగాలన్న జో బైడెన్ నిర్ణయం నేపథ్యంలో అఫ్గాన్-అమెరికాలకు సంబంధించి ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూడటం అవసరం. 2001 సెప్టెంబరు 11న అమెరికా ట్రేడింగ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడిచేశారు. దీనిని అవమానకరంగా, తీవ్రంగా తీసుకున్న నాటి అధ్యక్షుడు జార్జిబుష్ అల్ ఖైదా అంతానికి ప్రతిన బూనారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడం, అఫ్గాన్ ను ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిదద్డం అప్పట్లో అమెరికా లక్ష్యం. ఇందులో భాగంగా అఫ్గాన్ కు బలగాలను పంపారు. ఈ లక్ష్యం పాక్షికంగానే నెరవేరింది. ఇప్పటికీ అఫ్గాన్ ఉగ్రవాద కేంద్రంగానే ఉంది. రేపు సెప్టెంబరు 11నాటికి అమెరికా దళాలు అఫ్గాన్ లో అడుగుపెట్టి 20ఏళ్లవుతుంది.

సత్సంబంధాలే ఉన్నా…?

అఫ్గాన్ లో జోక్యం చేసుకున్నాక అమెరికా తలబొప్పి కట్టింది. ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చయింది. వేల మంది అమెరికా సైనికులు బలయ్యారు. అయినప్పటికీ అక్కడ శాంతి ఎండమావిగానే మిగిలింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఆలోచన మొదలైంది. వీలైనంత త్వరగా అక్కడి నుంచి నిష్ర్కమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతఏడాది ఫిబ్రవరిలో దోహాలోఅమెరికా-తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలు దిశగా జో బైడెన్ అడుగలు వేస్తున్నారు. అఫ్గాన్ లో రెండువేల మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. భారత్ కు అఫ్గాన్ పొరుగు దేశం. ఆ దేశంతో వంద కిలోమీటర్లకు పైగా సరిహద్దును భారత్ పంచుకుంటోంది. దీనిని డ్యూరండ్ రేఖ అని వ్యవహరిస్తారు. రెండు దేశాల మధ్య మొదటినుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. అనేక విషయాల్లో అఫ్గాన్ కు భారత్ అండగా ఉంది. వేల కోట్ల రూపాయల వ్యయంతో
ఏకంగా పార్లమెంటు భవనాన్నినిర్మించి ఇచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన శీనయ్య కంపెనీ దీనిని నిర్మించింది. ఈ పార్లమెంటు భవనాన్ని 2015 డిసెంబరులో ప్రధాని మోదీ ప్రారంభించారు. సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించింది. తద్వారా భారత్ అక్కడి ప్రజల మన్ననలు పొందింది. పదేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసిన హమీద్ కర్జాయ్, ప్రస్తుత అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ వివిధ సందర్బాల్లో భారత్ పాత్రను కొనియాడారు.

ఉగ్రవాదం మరింతగా…?

పొరుగుదేశమైన పాకిస్థాన్ కు ఇది మింగుడు పడలేదు. దీంతో అక్కడ ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అదేపనిగా ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదులకు భారత్ వ్యతిరే కతను నూరిపోస్తోంది. ప్రజా ప్రభుత్వాలు బలహీనపడటంతో వారుఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. దీంతో వారు భారత్ లో హింసకు పాల్పడుతున్నారు. 1999లో భారతీయ విమానాన్ని కాంద్ హార్ లో హైజాక్ చేశారు. దీంతో నాటి వాజపేయి సర్కారులోని విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ జైల్లో ఉన్న ఉగ్రవాదులను వెంటబెట్టుకుని తీసుకెళ్లి అప్పగించి విమానంలోని బందీలను విడిపించుకువచ్చారు. 2001లో ఏకంగా భారత్ పార్లమెంటు భవనంపైనే దాడికి తెగబడ్డారు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగితే ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గథామంగా మారే ప్రమాదం ఉంది. ఉగ్రవాదులు భారత్ పై పేట్రేగిపోయే అవకాశం ఉంది. జో బైడెన్ నిర్ణయం మారే అవకాశం లేనందున భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News