ఆయ‌న‌ను మార్చాల్సిందే.. పెరుగుతున్న స్వరాలు

ఏపీ టీడీపీలో కీల‌క విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. 2012లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌తో పార్టీని జాతీయ పార్టీగా ప్రక‌టించారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆయ‌న [more]

Update: 2020-04-11 00:30 GMT

ఏపీ టీడీపీలో కీల‌క విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. 2012లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌తో పార్టీని జాతీయ పార్టీగా ప్రక‌టించారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆయ‌న నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ఉంద‌ని కూడా ప్రక‌టించారు. తెలంగాణ‌, ఏపీ, ఒడిసా, త‌మిళ నాడుల్లో పార్టీ ఉంద‌ని, అందుకే దీనిని జాతీయ పార్టీగా ప్రక‌టించాన‌ని చెప్పారు. ఈ క్రమంలోనే తాను జాతీయ అధ్యక్షుడిన‌ని ప్రక‌టిచుకున్నారు. ఇక‌ ఆయ‌న కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఉన్నారు. ఇక‌, ఏపీ, తెలంగాణ‌ల‌కు ప్రత్యేకంగా అధ్యక్షుల‌ను ఎంపిక చేశారు. తెలంగాణ ఎల్‌.ర‌మ‌ణ‌, ఏపీకి క‌ళా వెంక‌ట్రావులు ఉన్నారు. అయితే, తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. అక్కడ అధ్య‌క్షుడి విష‌యంలో మాత్రం ఎవ‌రూ అభ్యంత‌రం వ్యక్తం చేయ‌డం లేదు.

సమన్వయం చేసుకోవడంలో…

ఇంకా చెప్పాలంటే తెలంగాణ‌లో పార్టీ మూసుకోవ‌డం ఒక్కటే మిగిలి ఉంద‌న్నదానిపై ఆ పార్టీ నేత‌ల‌కే దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేత‌లు అంద‌రూ ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయారు. తెలంగాణ‌లో టీడీపీ గురించి, ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.ర‌మ‌ణ గురించి చ‌ర్చ అన‌వ‌స‌రం. కానీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు విష‌యంలో మాత్రం భిన్నమైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చంద్రబాబు అనుకున్నారు. కానీ, అంచ‌నాలు త‌ల‌కిందులయ్యాయి. అయితే, ఈ విష‌యంలో రాష్ట్ర పార్టీని ముందుండి న‌డిపించిన క‌ళా వెంకట్రావు పార్టీని స‌మ‌న్వయం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది.

పార్టీ ఓటమికి బాధ్యతను….

ఆయ‌న పార్టీలోతుపాతుల‌ను గ‌మ‌నించ‌లేక పోయార‌ని, ఈ క్రమంలోనే పార్టీలో వ్యతిరేకులు, అసంతృప్తులు పెరిగినా ప‌ట్టుకోలేక పోయార‌నే వాద‌న కూడా ఉంది. ఇక, ఎన్నిక‌ల త‌ర్వాత కూడా పార్టీ నుంచి నాయ‌కులు జారిపోతున్నా.. ఆయ‌న సినిమా చూశార‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి. అధినేత అనేక ప‌నుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర పార్టీని కాపాడాల్సిన బాధ్యత క‌ళా వెంకట్రావు పైనే ఉంద‌ని అనేవారు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోను, పార్టీ నుంచి నాయ‌కుల‌ను కాపాడాల్సిన బాధ్యత విష‌యంలోనూ క‌ళా వెంకట్రావు బాధ్యతగా లేర‌నే విమ‌ర్శలు కూడా వ‌చ్చాయి. ఈ క్రమంలో ఆయ‌న‌ను ప‌క్కన పెట్టాల‌ని బుచ్చయ్య చౌద‌రి వంటి సీనియ‌ర్లు బ‌హిరంగం గానే వ్యాఖ్యానించారు. పార్టీ ఓట‌మికి ఎవ‌రూ బాధ్యత తీసుకోక పోతే.. ఎలా అనే ప్రశ్నను ఆయ‌న క‌ళాను ఉద్దేశించే సంధించారు.

రెండు పదవులకూ…

అటు మంత్రిగాను.. ఇటు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి కూడా క‌ళా వెంకట్రావు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఎంపీపీ ప‌ద‌వి వైసీపీకి ఏక‌గ్రీవం అవుతున్నా క‌ళా ఏం చేయ‌లేని ప‌రిస్థితి. అయితే క‌ళా వెంకట్రావు విష‌యంలో అనేక‌ అంశాల‌ను చంద్రబాబు స‌హించినా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో చాలా చోట్ల టీడీపీ ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉన్నప్పటికీ నాయ‌కుల‌ను స‌మ‌న్వయం చేయ‌డంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా క‌ళా వెంకట్రావు చొర‌వ చూప‌లేక పోయార‌నే విమ‌ర్శల‌ను మాత్రం చంద్రబాబు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నార‌ని అంటున్నారు. కేవ‌లం ఆయ‌న మీడియా స‌మావేశాల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని, క్షేత్రస్థాయిలో పార్టీ ప‌రిస్థితిని ప‌ట్టించుకోలేద‌ని, ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను మార్చాల‌నే డిమాండ్ వ్యక్త మ‌వుతోంది.

బీసీలకు ఇవ్వడం మాత్రం…..

ఈ క్రమంలో ఈ ప‌ద‌విని బీసీ వ‌ర్గానికి చెందిన య‌న‌మ‌ల‌ రామకృష్ణుడుకు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ప‌ట్ల యువ‌త‌లో క్రేజ్ ర‌ప్పించాలంటే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడ‌కు కూడా ఈ ప‌ద‌వి ఇవ్వాల‌ని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో .. చూడాలి.

Tags:    

Similar News