కమల్ ఒప్పుకోవడం లేదట.. పవన్ కల్యాణ్ ను చూసే?

తమిళనాడు ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. అయితే ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. ప్రధానంగా మక్కల్ నీది [more]

Update: 2021-01-26 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. అయితే ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. ప్రధానంగా మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కమల్ హాసన్ ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేస్తారా? లేక రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతారా? అన్నది ఇంకా తేలలేదు అయితే ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

రెండు నియోజకవర్గాల్లో…..

తమిళనాడు అంతటా కమల్ హాసన్ అభిమానులున్నారు. ఒక నియోజకవర్గానికే పరిమితమయితే మిగిలిన ప్రాంతాల్లో అభిమానులతో పాటు ప్రజలు కూడా నిరుత్సాహపడతారు. అందుకనే రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని కమల్ హాసన్ పై వత్తిడి పెరుగుతుంది. ఒకటి మధురై ప్రాంతంలోనూ, మరొకటి చెన్నై నగర పరిధిలోని మరొక నియోజకవర్గంలో పోటీ చేయాలని కమల్ హాసన్ సయితం భావిస్తున్నారని తెలిసింది.

సర్వే చేసిన అనంతరమే….

చెన్నై నగర పరిధిలోని మైలాపూర్ స్థానం నుంచి కమల్ హాసన్ బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు. అయితే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఏపీలోని పవన్ కల్యాణ్ మాదిరి పరాభవం ఎదురు కాకూడదని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే తాను ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేయడం బెటరని, రెండు, మూడు నియోజకవర్గాలు ఎంపిక చేసి సర్వేల అనంతరం పోటీ చేసే నియోజకవర్గాన్ని ఖరారు చేయాలన్నది కమల్ హాసన్ ఆలోచనగా ఉంది.

గుర్తు కూడా రావడంతో….

దీనికి తోడు తాజాగా కమల్ హాసన్ కు తాను అనుకున్న గుర్తు కూడా రావడంతో ఉత్సాహం మరింత పెరిగింది. ఎన్నికల కమిషన్ మక్కల్ నీది మయ్యమ్ కు టార్చిలైట్ గుర్తు ఇచ్చింది. కమల్ హాసన్ కోరుకున్నది కూడా ఇదే. గత లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుపై పోట చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ 3.77 శాతం ఓట్లను మాత్రమే సాధించారు. అందుకే ఈసారి ప్రచారంలో అందరికంటే ఆయన ముందున్నారు. మొత్తం మీద కమల్ హాసన్ మరో పవన్ కల్యాణ్ కాకూడదని ఆచితూచి పోటీ చేసే నియోజకవర్గంపై నిర్ణయం తీసుకోనున్నారట.

Tags:    

Similar News