కామినేనికి ఇక వేరే దారి లేదా?

మాజీ మంత్రి, బీజేపీ కీల‌క నాయ‌కుడు… కామినేని శ్రీనివాస్‌.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? అన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం కాన‌రావ‌డం లేదు. [more]

Update: 2021-04-06 09:30 GMT

మాజీ మంత్రి, బీజేపీ కీల‌క నాయ‌కుడు… కామినేని శ్రీనివాస్‌.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? అన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం కాన‌రావ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల్లో కృష్ణాజిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన కామినేని శ్రీనివాస్‌ చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. పేరుకు మాత్రమే ఆయ‌న బీజేపీ మంత్రి అయినా ఆయ‌న మ‌న‌సంతా టీడీపీలోనే ఉండేద‌న్నది వాస్తవం. ఎందుకంటే టీడీపీ వ్యవ‌స్థాప‌క స‌భ్యుల్లో ఆయ‌న కూడా ఒక‌రు. అటు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడుకు కూడా ఆయ‌న ప్రియ‌మైన శిష్యుడు. బాబు – వెంక‌య్యకు ప్రియ‌మైన నేత కావ‌డంతో కామినేని శ్రీనివాస్‌ 2014లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నా… త‌ర్వాత కాలంలో బీజేపీ-టీడీపీల పొత్తుకు బీట‌లు ప‌డ‌డంతో ప‌ద‌విని త్యాగం చేశారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్రక‌టించి.. సంచ‌ల‌నం రేపారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఆయ‌న ఊసు ఎక్కడా వినిపించ‌డం లేదు.

పార్టీలోనూ…

వాస్తవానికి ప్రస్తుతం బీజేపీని గాడిన పెట్టేందుకు పార్టీ నాయ‌కులు శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నం చేస్తున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఉన్న ప్రతి మార్గంలోనూ పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఏపీలో ఎవ‌రు పార్టీలోకి వ‌చ్చేసినా జాతీయ నాయ‌క‌త్వం కండువాలు క‌ప్పేస్తోంది. ఏపీలో ఎంత మంది నేత‌లు పార్టీలో జాయిన్ అయినా ఆ రోజు త‌ప్ప త‌ర్వాత క‌న‌ప‌డ‌డం లేదు. సుజనా చౌద‌రి, సీఎం. ర‌మేష్‌, టీజీ. వెంక‌టేష్ లాంటి వాళ్లకే దిక్కూ దివాణం లేదు. కామినేని శ్రీనివాస్‌ని జ‌నాలు మ‌ర్చిపోయారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాత్రం కామినేని లాంటి వాళ్ల స‌ల‌హాలు, సూచ‌న‌లు పార్టీకి అవ‌స‌రం అని చెప్పారు.

వారికే దగ్గరగా ఉంటూ….

అప్పట్లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అత్యంత ద‌గ్గర‌గా ఉంటూ కామినేని శ్రీనివాస్‌ వారికి సానుకూలంగా ఉన్నార‌నే వాద‌న వినిపించేది. ఆయ‌న మంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీలో ఉన్న త‌న వ‌ర్గం వారికే ఎక్కువ ప‌నులు చేసిపెడుతూ సొంత పార్టీలో ఇత‌ర కుల‌స్తుల‌ను కూడా ప‌ట్టించుకోలేద‌న్న అప‌వాదు పార్టీ నేత‌ల్లోనే ఉంది. అందుకే ఆయ‌న‌పై లెక్కలేన‌న్ని కంప్లెంట్లు పైకి వెళ్లడంతో ఆయ‌న్ను అధిష్టానం పూర్తిగా మ‌ర్చిపోయింది. ఇక ఏపీలో కామినేని శ్రీనివాస్‌ మాత్రం ఎక్కడా ఎవ‌రికీ దొర‌క‌డం లేదు. త‌ర‌చుగా ఢిల్లీకి వెళ్లే కామినేని శ్రీనివాస్‌ ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ ఎప్పుడైనా దొరికితే ఏపీ రాజకీయాల‌పై ఎప్పటిక‌ప్పుడు ఢిల్లీలోని బీజేపీ వ‌ర్గాల‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌నే టాక్ ఉంది.

పార్టీ నేతలపై ఫిర్యాదులు….

రాష్ట్ర బీజేపీ నేత‌ల మ‌ధ్య ఐక్యత లేద‌ని.. కేవ‌లం ఎవ‌రికివారు ప‌నిచేసుకుంటున్నారు త‌ప్ప.. ఎవ‌రూ కూడా.. క‌లివిడిగా ముందుకు సాగ‌డం లేద‌ని ‌కామినేని శ్రీనివాస్‌ త‌న మిత్రుల వ‌ద్ద పేర్కొన్నట్టు స‌మాచారం. అయితే.. టీడీపీ నుంచి వ‌చ్చి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి వంటి వారితో మాత్రం కామినేని శ్రీనివాస్‌ స‌న్నిహితంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న‌ ఇలానే ఉండిపోతారో.. లేక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యాక్టివ్ అవుతారో చూడాలి. ఏదేమైనా బాబు పాల‌న‌లో బీజేపీ మంత్రిగా ఉండి కూడా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు కేంద్రంలో త‌మ పార్టీ తిరుగులేని అధికారంలో ఉన్నా ఆయ‌నకు స‌రైన వేదిక లేకుండా పోయింది.

Tags:    

Similar News