కాపు కు అందరూ శత్రువులేనా?

కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. తొలి నుంచి ఆయన జగన్ ను నమ్ముకుని ఉన్నారు. కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. [more]

Update: 2021-02-11 09:30 GMT

కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. తొలి నుంచి ఆయన జగన్ ను నమ్ముకుని ఉన్నారు. కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాంటి కాపు రామచంద్రారెడ్డి తరచూ వివాదాల్లోకి ఎక్కుతున్నారు. అయితే ఆయన ఎలాంటి వివాదాలకు వెళ్లకున్నప్పటికీ సొంత పార్టీలోని ప్రత్యర్థులే ఆయనకు ప్రభుత్వంలో పదవి దక్కకూడదని సృష్టిస్తున్నారన్న టాక్ కూడా బాగానే విన్పిస్తుంది.

మంత్రి వర్గ విస్తరణలో….

మరికొద్దినెలల్లోనే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఒకే ఒక మంత్రి ఉన్నారు. శంకర నారాయణను ఈసారి తప్పించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో ఈసారి ఇద్దరికి అవకాశముంటుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. ఇందులో ఈసారి రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అందులో అనంత వెంకట్రామిరెడ్డి తో పాటు కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.

ఇసుక దుమారం…..

అయితే గతకొంతకాలంగా కాపు రామచంద్రారెడ్డి వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ నేతగా కాల్వ శ్రీనివాసులు ఉండటంతో రోజుకో వివాదం ఆయన వెంట తిరుగుతోంది. రాయదుర్గం నుంచి ఇసుకను అక్రమంగా కాపు రామచంద్రారెడ్డి తరలిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది కాపు రామచంద్రారెడ్డికి ఇబ్బందికరంగా మారింది. సొంత పార్టీ నేతలు సయితం ఈ ఆరోపణలను నిజం చేస్తూ సీఎంవోకు తెలియజేశారని సమాచారం.

గాలి అండ ఉండటంతో….

దీంతో కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే కాపుకు గాలి జనార్థన్ రెడ్డి ఆశీస్సులన్నాయంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా గాలి జనార్థన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారంటారు. ఆ ధైర్యంతోనే కాపు రామచంద్రారెడ్డి తనకు మంత్రి పదవి ఖాయమన్న ఆశలు పెట్టుకున్నారు. మరి కాపు ఆశలు నెరవేరతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News