Kcr : కేసీఆర్…. ప్రతి తప్పు కౌంట్ అవుతున్నట్లుందిగా

కేసీఆర్ కు రెండేళ్ల సాధారణ ఎన్నికలకు ముందు హుజూరాబాద్ ఉప ఎన్నిక గుణపాఠంగా చెప్పాలి. ఎప్పుడూ ప్రజలను ఓట్లతో కొనలేమని, మనసుతో గెలుచుకోవాలని హుజూరాబాద్ ఉప ఎన్నిక [more]

Update: 2021-11-02 14:30 GMT

కేసీఆర్ కు రెండేళ్ల సాధారణ ఎన్నికలకు ముందు హుజూరాబాద్ ఉప ఎన్నిక గుణపాఠంగా చెప్పాలి. ఎప్పుడూ ప్రజలను ఓట్లతో కొనలేమని, మనసుతో గెలుచుకోవాలని హుజూరాబాద్ ఉప ఎన్నిక రుజువు చేసింది. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలూ విపరీతంగా డబ్బులు పంచాయి. టీఆర్ఎస్ ఒకింత నోట్లను ఎక్కువ ఇచ్చినా గెలవలేకపోయింది. కనీసం ఈటలను కట్టడి చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ వైఖరి అని చెప్పక తప్పదు.

జానారెడ్డిని ఓడించామన్న ధీమాతో…

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించామన్న ధీమా కేసీఆర్ లో ఈ ఎన్నిక సందర్బంగా కూడా కన్పించింది. తాను ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి టీఆర్ఎస్ ను ఖచ్చితంగా గెలిపిస్తాయని కేసీఆర్ విశ్వసించారు. కానీ ప్రజలు అలా చూడలేదు. ఒక ఉద్యమకారుడికి జరిగిన అన్యాయంగా చూశారు. అన్యాయంగా ఈటలను బయటకు పంపారని జనం భావించారు. అందుకే కోట్లు కుమ్మరించినా ఫలితం దక్కలేదు.

అసంతృప్తి తలెత్తిందని….

నిజానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పడిప్పుడే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. కరోనా సందర్భంగా ప్రభుత్వం పెద్దగా ప్రజలకు ఉపయోగపడకపోవడం, మొన్నటి వరకూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం, ఈటల వైద్య శాఖ మంత్రిగా చూపిన చొరవ కూడా ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాయనే చెప్పాలి. కేసీఆర్ చేసే ప్రతి తప్పు కౌంట్ అవుతుందనే చెప్పాలి. ప్రజలు లెక్కపెట్టుకుంటూ సమయం వచ్చినప్పుడు చూపిస్తారన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమయింది.

తప్పులను సరిచేసుకోకుంటే?

ఈ ఎన్నికకు అంత ప్రాధాన్యత లేదని కేసీఆర్ కొట్టి పారేయొచ్చు. కానీ బీజేపీ క్యాడర్ లో ధైర్యం, టీఆర్ఎస్ లో దైన్యం రాక తప్పదు. రానున్న ఎన్నికలకు ఈ ఫలితం నమూనాగా భావించి తప్పులను సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఈ ఫలితాన్ని హెచ్చరికగా తీసుకుని నేలమీదకు వస్తే కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లనైనా కొంత సానుకూలత లభించవచ్చు. దళితబంధు, యాదాద్రి తనను రక్షిస్తాయని భావిస్తే ప్రగతి భవన్ ను ఖాళీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడు చెప్పండి.. హుజూరాబాద్ లో డబ్బుల కోసం ఆందోళనకు దిగారని ఓటర్లపై విరుచుకుపడ్డ వాళ్లు ఈ ఫలితాలను చూసి ఏమంటారో..? డబ్బులు ఎవరినీ ఊరికే గెలిపించవు.

Tags:    

Similar News