కేశినేని వ్యూహం వెనుక చాలా ఉందే

రాజ‌కీయాల్లో ఎన్ని ప‌ద‌వులు ఉన్నా.. ఎంత సంపాయించుకున్నా.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విష‌యంపై నాయ‌కుల్లో అసంతృప్తి ర‌గులుతూనే ఉంటుంది. ఇక‌, అంతో ఇంతో ప్రాధాన్యం [more]

Update: 2019-07-13 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎన్ని ప‌ద‌వులు ఉన్నా.. ఎంత సంపాయించుకున్నా.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విష‌యంపై నాయ‌కుల్లో అసంతృప్తి ర‌గులుతూనే ఉంటుంది. ఇక‌, అంతో ఇంతో ప్రాధాన్యం ద‌క్కిన నాయ‌కుల ప‌రిస్థితే ఇలా ఉంటే.. ఏమీ ద‌క్కని నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి? మ‌రి వారెంత‌గా ర‌గిలిపోతారు? దీనికి స‌మాధానం చెప్పడం చాలా క‌ష్టం. ఇలాంటి ప‌రిస్థితే విజ‌య‌వాడ టీడీపీ ఎదుర్కొంటోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ సునామీలో టీడీపీ కొట్టుకు పోయింది. అధికారంలోకి వ‌ద్దామ‌ని భావించినా.. చ‌చ్చీచెడీ ప్రతిప‌క్షం హోదాతో స‌రిపెట్టుకుంది. అయితే, పార్టీలో మాత్రం అంత‌ర్గత క‌ల‌హాలు, కుమ్ములాట‌లు మాత్రం ఇప్పట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.

పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ…..

దీనికి ప్రత్యక్ష ఉదాహ‌ర‌ణే.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ నాని వ్యవ‌హారం. జ‌గ‌న్ సునామీలోనూ త‌ట్టుకుని నిల‌బ‌డిన కొద్ది మంది నాయ‌కుల్లో కేశినేని నాని ఒక‌రు. విజ‌య‌వాడ ఎంపీగా ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న ఎంపీగా రెండో సారి ఎన్నికైన త‌ర్వాత నుంచి చేస్తున్న వ్యాఖ్య‌లు, సోష‌ల్ మీడియా వేదిక‌గా పెడుతున్న పోస్టులు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. నిజానికి రెండోసారి ఎంపీ అయిన కేశినేని నానిపై ఇప్పుడు చాలానే బాధ్యత ఉంది. విజ‌య‌వాడ అభివృద్ధితోపాటు.. ఓట‌మిపాలైన పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పైనే ఉంది. అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టారు. సొంత పార్టీ నేత‌లపైనే ఎక్కువ‌గా కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

ఓడిన వారికే ప్రాధాన్యత….

ఒక‌ప‌క్క, పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎందుకు ఓడిపోయింద‌నే విష‌యంపై స‌మీక్షలు చేస్తుంటే.. వాటిని సైతం ప‌క్క న పెట్టిన కేశినేని నాని.. పార్టీ నాయ‌కుల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? కేశినేని నాని వ్యూహం ప్రకార‌మే ఇదంతా చేస్తున్నారా? అనే సందేహాలు, చ‌ర్చ కూడా సాగుతోంది. అయితే, కేశినేని నాని అనుచ‌ర వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. పార్టీలో గెలిచిన నాయ‌కుల‌ను ప‌క్కన పెట్టి.. ఘోరంగా ఓడిపోయిన మాజీ మంత్రుల‌కే ప్రాధాన్యం ద‌క్కుతోంద‌ని కేశినేని నాని భావిస్తు న్నార‌ని, జ‌గ‌న్ సునామీని సైతం త‌ట్టుకుని విజ‌య‌వాడ‌లో గెలిచిన‌ప్పటికీ..త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చిట్టచివ‌రి బంతిలో కూర్చోబెట్టార‌ని ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు.

మాజీ మంత్రిపైన అక్కసుతోనే…..

కానీ, విశ్లేష‌కులు మాత్రం.. పార్టీ ప‌రువు తీసేలా, కొంద‌రిని టార్గెట్ చేసేలా కేశినేని నాని వ్యవ‌హ‌రించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌నం ఆయ‌న పొంద‌లేర‌ని అంటున్నారు. ఏదైనా ఉంటే అంత‌ర్గత చ‌ర్చల ద్వారా ప‌రిష్కరించుకునే స్వతంత్రం, స్వేచ్ఛ టీడీపీలో ఎప్పుడూ ఉంటుంద‌ని, అధినేత కూడా అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగే నాయ‌కుడేన‌ని చెబుతున్నారు. నాని బాధ అంతా జిల్లాలో టీడీపీకే చెందిన ఓ మాజీ మంత్రి విష‌యంలోనే అన్నది ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓడినా ఆ మాజీ మంత్రికే బాబు ప్రయార్టీ ఇవ్వడాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌రి ఇప్పటికైనా నాని మార‌తారో లేదో చూడాలి.

Tags:    

Similar News