మళ్లీ రిజల్ట్ రిపీట్…. నేనే కింగ్ మేకర్

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లయింది. సిద్ధరామయ్య, [more]

Update: 2021-01-04 18:29 GMT

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ ఉన్న మూడు పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లయింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2023లో జరగాల్సిన ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇక బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎటూ సిద్ధమేనని చెబుతోంది. మరో పార్టీ అయిన జేడీఎస్ తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది.

గతంలోనే ఒంటరిగా….

నిజానికి 2018 లో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఇప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని కుమారస్వామి చెప్పడం వెనక తన పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడం కోసమే. జేడీఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారంతోనే కుమారస్వామి తరచూ ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. అయితే ఈసారి కూడా కుమారస్వామి తాను కింగ్ మేకర్ ను అవుతానని చెబుతున్నారు.

బీజేపీతో కలిసి…..

ఈసారి బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న నమ్మకంతో కుమారస్వామి ఉన్నారు. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. అప్పుడే బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన వచ్చినా తాము కాదన్నామని చెబుతున్నారు కుమారస్వామి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని కుమారస్వామి ప్రకటించారు.

మొన్నటి ఫలితాలే……

వచ్చే ఎన్నికల్లోనూ మొన్నటి ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని కుమారస్వామి భావిస్తున్నారు. అయితే బీజేపీ ఈసారి తనకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉండటం, యడ్యూరప్ప వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీలకంగా ఉండని నేపథ్యంలో కాంగ్రెస్ కొంత పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకోలేదని, మరోసారి తానే బీజేపీకి ఆప్షన్ అవుతానని కుమారస్వామి గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ ను నమ్మేది లేదని, బీజేపీతోనే ఎన్నికల అనంతర పొత్తు ఉంటుందని కుమారస్వామి పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు.

Tags:    

Similar News