మాగుంట రాజకీయం మ‌స‌క‌బారుతోందా?

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ‌కీయం మ‌స‌క‌బారుతోందా ? ఆయ‌న‌ను ఎవ‌రూ లెక్కచేయ‌డం లేదా ? ఆయ‌న‌తో ఉంటే.. ఇత‌ర నేత‌ల‌కు కూడా [more]

Update: 2021-03-28 08:00 GMT

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ‌కీయం మ‌స‌క‌బారుతోందా ? ఆయ‌న‌ను ఎవ‌రూ లెక్కచేయ‌డం లేదా ? ఆయ‌న‌తో ఉంటే.. ఇత‌ర నేత‌ల‌కు కూడా దూర‌మ‌వుతామ‌నే అభిప్రాయం మాగుంట వ‌ర్గంలోనే వినిపిస్తోందా ? అంటే.. ఔన‌నే అన్న టాక్ ప్రకాశం జిల్లాలో వినిపిస్తోంది. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. అయితే.. వైసీపీలో ఒక సిద్ధాంతం ఉంది. ఏ నాయ‌కుడికైనా ప్రజా బ‌లం ఉండాల‌నేది జ‌గ‌న్ చెప్పేమాట‌. పార్టీల‌తో సంబంధం ఉంటూనే.. ప్రజ‌ల మ‌ధ్య బ‌లం పెంచుకోవాల‌ని ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా.. మంత్రి అయినా.. నిత్యం ప్రజ‌లకు అందుబాటులో ఉండాల‌నేది జ‌గ‌న్ మాట‌.

ఎవరూ పట్టించుకోక…..

ఈ క్రమంలోనే ఎంతో బిజీగా ఉన్న నాయ‌కులు.. ఎంపీలైనా.. మంత్రులైనా.. ప్రజ‌ల‌కు ముఖం చూపిస్తున్నారు. వారి స‌మ‌స్యలు వింటున్నారు. వారిలో ఒక‌రిగా క‌లిసిపోతున్నారు. కానీ, కొంద‌రు మాత్రం అంటీముట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గానికి కూడా క‌డుదూరంలో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల్లో ఇది ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇలాంటి వారికి చెక్ పెట్టాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఆయ‌న వ్యవ‌హార శైలి కూడా ప్రజ‌ల‌కు దూరంగా ఉండ‌డం.. పార్టీని ప‌ట్టించుకోక పోవ‌డం .. కేవ‌లం త‌న వ్యాపారాల‌కు మాత్రమే ప‌రిమితం కావ‌డం వంటివి కూడా ఆయ‌నకు సెగ పెడుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో…..

తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఒంగోలు కార్పొరేష‌న్‌, గిద్దలూరు, క‌నిగిరి త‌దిత‌ర మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి సుమారు 25 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి పంపించారు. అయితే.. ఆయ‌న సూచించిన వారిలో ఒక్కరికి కూడా పార్టీ బీఫారం ఇవ్వక‌పోగా.. క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి కూడా తీసుకోలేదు. ఇది మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లంగా మారింది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న‌కు అంటూ స‌ప‌రేట్‌గా ఓ వ‌ర్గం ఉంటూ వ‌స్తోంది. ఇప్పుడు వారంతా ఆయ‌న‌కు దూరం అవుతున్నారు. పైగా.. ఆయ‌న‌తో ఉంటే.. ‌ప‌నులు కూడా కావ‌డం లేద‌ని అంటున్నారు. త‌న వ‌ర్గంవారికి కూడా మాగుంట ప‌నులు చేయించ‌లేక పోతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది.

పార్టీలో కొనసాగుతారా?

ఆయ‌న‌తో ఉంటే ఒక్క కౌన్సెల‌ర్ సీటు కూడా ఎవ్వరూ ఇవ్వట్లేదు. ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డి త‌న వ‌ర్గం అనుకున్న వారికి క‌నీసం చిన్న పాటి కాంట్రాక్టును కూడా ఆయ‌న ఇప్పించుకోలేక పోతున్నార‌ని అంటున్నారు. ఇదంతా కూడా ఆయ‌న ప్రజ‌ల్లో లేక‌పోవ‌డం వ‌ల్లే వ‌స్తోంద‌నేది ప్రధాన టాక్‌. కేవ‌లం వ్యాపార కార్యక‌లాపాల‌కే మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప‌రిమితం కావ‌డంతో స్థానికంగా ఆయ‌న‌కు ప‌ట్టు చిక్కడం లేదు. మ‌రి ఇలానే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్టీలో ఇమ‌డ గ‌లుగుతారా ? అన్నది కూడా సందేహ‌మే ?

Tags:    

Similar News