సరిలేరు నీకెవ్వరూ మూవీ రివ్యూ
బ్యానర్: AK ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, కృష్ణ(గెస్ట్ రోల్), సంగీత, ప్రకాష్ రాజ్, [more]
బ్యానర్: AK ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, కృష్ణ(గెస్ట్ రోల్), సంగీత, ప్రకాష్ రాజ్, [more]
బ్యానర్: AK ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్
నటీనటులు: మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన్న, కృష్ణ(గెస్ట్ రోల్), సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, హరితేజ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, అజయ్, సుబ్బరాజు, బండ్ల గణేష్, తమన్నా(ఐటెం సాంగ్) తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఆ అంచనాలే వేరు, ఆ క్రేజే వేరు.. అలాంటి మహేష్ బాబుతో ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కలిస్తే.. ఆ సినిమాపై అంచనాలు కొలమానంలో కొలవడానికి కష్టమే. మరి అనిల్ రావిపూడి – మహేష్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదలైనప్పటినుండి… విడుదలయ్యే క్షణం వరకు ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. అందులోను 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడం, ఓమాదిరి సినిమాల్తో లేడి సూపర్ స్టార్ విజయశాంతి అయితే రీ ఎంట్రీ ఇవ్వదు కాబట్టి.. సరిలేరు సినిమాలో ఎలాంటి స్పెషల్ ఉందో.. ఆమె ఒప్పుకుంది అంటూ ఆ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా వరసగా మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాల్తో దిగుతున్న మహేష్ ఇప్పుడు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటెర్టైనెర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి మహేష్ఆర్మీ మేజర్ గా, విజయశాంతి ప్రొఫెసర్ భారతిగా, ఎఫ్ 2 లో అదిరిపోయే కామెడీతో అదరగొట్టిన అనిల్ రావిపూడి కామెడీ ఈ సినిమాలో ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో? మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా ఎలా ఆదరగొట్టాడో? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్. చాలా ధైర్య సాహసాలతో కూడిన అజయ్ కృష్ణ… ఉగ్రవాదుల చెర నుండి స్కూల్ పిల్లలని విడిపించడానికి ప్రత్యేక ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఊహించని పరిణామం రీత్యా అజయ్ కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ కు రావాల్సి వస్తుంది. ఆర్మీని నుండి కర్నూలుకి వచ్చే క్రమంలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం అవుతుంది. కర్నూలు మెడికల్ కాలేజ్ లో భారతి(విజయశాంతి) ప్రొఫెసర్. భారతి కోసమే అజయ్ కృష్ణ కర్నూలుకి వస్తాడు అసలు ప్రొఫెసర్ భారతికి, అజయ్ కృష్ణకి ఉన్న సంబంధం ఏమిటి? ట్రైన్ లో పరిచయం అయిన సంస్కృతి కుటుంబానికి కర్నూల్ లో ఉన్న భారతికి ఏమన్నా సంబంధం ఉందా?భారతి మంత్రి నాగేంద్ర ప్రసాద్ కి ఉన్న గొడవలేమిటి? భారతి – నాగేంద్ర ప్రసాద్ గొడవలకు అజయ్ ఎలాంటి పరిష్కారం చూపాడు? ఇంతకీ సంస్కృతి – అజయ్ లవ్ స్టోరీ ఏమిటి? తెలియాలంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
నటీనటులు:
మహేష్ బాబు దూకుడు సినిమాలోనే కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసాడు. ఇక ఇప్పుడు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలోనూ, విజయశాంతి ని సేవ్ చేసేయువకుడిగా, ట్రైన్ ఎపిసోడ్ లో కామెడీ పండించడంలోనూ మహేష్ మూడు వేరియేషన్స్ చూపాడు. మేజర్ పాత్రలో హుందాతనం, ట్రైన్ జర్నీ లో కామెడీ పండించడం లో సరికొత్త బాడీ మాడ్యులేషన్, కర్నూలు లో యాక్షన్ లో డైలాగ్ డెలివరీ తోనూ, డాన్స్ లు పరంగా మహేష్ కొత్తగా ఇరగదీసాడు. ఇక హీరోయిన్ రష్మిక పాత్ర కన్నా ముందు విజయశాంతి పాత్ర గురించి మట్లాడుకోవాలి. 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ అంటే అంచనాలు అందుకోవాలి. ఆమె చేసిన భారతి పాత్ర అలానే పవర్ ఫుల్ గా ఉంది. మహేష్ తో కాంబో సీన్స్ లోను, ప్రకాష్ రాజ్ తో తలపడే సీన్స్ లోను విజయశాంతి మరోసారి లేడి బాస్ గా అదరగొట్టేసింది.ఆమె డైలాగ్ డెలివరీ చూస్తే.. పాత విజయశాంతి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఇక హీరోయిన్ రష్మిక మహేష్ ని అల్ల్లరి చేయడంలోనూ, కామెడీగా ‘అర్ధమవుతుందా’ అనే పదంతోను హైలెట్ అయ్యింది కానీ.. ఆమె పాత్ర అంతగా అనిపించదు. ఇక ఫాదర్, విలన్ కేరెక్టర్స్ కి కొట్టినపిండి ప్రకాష్ రాజ్ మరోసారి బ్యాడ్ మంత్రి నాగేంద్ర ప్రసాద్ గా తన ప్రతాపాన్ని చూపెట్టాడు. మహేష్ – ప్రకాష్ రాజ్ పోటాపోటీ గా నటించిన కొన్ని సన్నివేశలు హైలెట్. ఇక రావు రమేష్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, వెన్నెల కిషోర్ తదితర నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ – స్టార్ హీరో కలిస్తే బొమ్మ దద్దరిల్లిపోవాలే.. మరి అనిల్ రావిపూడి కామెడీ ని నమ్ముకున్న డైరెక్టర్, మహేష్ సూపర్ క్లాస్ హీరో. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే అది కామెడీ ఎంటెర్టైనెర్ అని ఫిక్స్ అవుతారు. కానీ అనిల్ రావిపూడి కామెడీతో పాటుగా మహేష్ ఫాన్స్ మెచ్చే యాక్షన్ ని సమపాళ్లలో కలిపి సరిలేరు నీకెవ్వరూ అంటూ సినిమా తీసాడు. అనిల్ రావిపూడి కామెడీకి తగ్గట్టుగా మాస్ గా మహేష్ కనబడాలి. మరి మహేష్ ఫ్యాన్స్ మహేష్ నుండి ఏమైతే ఆశిస్తారో.. అది పర్ఫెక్ట్ గా ఈ సినిమాలో కనబడుతుంది. ఇక కథలోకి వెళితే.. ఆర్మీ నేపథ్యంలోనే ఈ సినిమా మొదలవుతుంది.. తర్వాత కథలోకి నెమ్మదిగా దిగుతుంది. కర్నూలుకి ట్రైన్ లో మొదలయిన మహేష్ జర్నీ లో హీరోయిన్ రష్మిక బ్యాచ్ చేసే కామెడీతో సీరియస్ గా మొదలయిన సినిమా కాస్త కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఆర్మీ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. రష్మిక ఫ్యామిలీతో చేసే కామెడీ, బ్లెడ్ బాబ్జి గా బండ్ల బేచ్ చేసే కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతా ఆహ్లాదంగా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే డాంగ్ డాంగ్ సాంగ్ లో మహేష్ వేసే స్టెప్పులతో పోకిరి టైం మహేష్ లోని డాన్స్ ను మనం చూడొచ్చు. ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి కథ సీరియస్ మోడ్ లోకి వెళుతుంది. సెకండ్ హాఫ్ లో విజయశాంతి -ప్రకాష్ రాజ్ – మహేష్ కాంబో సీన్స్ అదరగొట్టేస్తాయి. ముగ్గురు పోటాపోటీ గా మెప్పిస్తారు. హత్య కేసు కోసం విజయశాంతి పోరాటం, ప్రకాష్ రాజ్ భారతి కుటుంబం పై పగ, ప్రతీకారాలు, మహేష్ భారతి వెన్నంటి ఉంటూ ప్రకాష్ రాజ్ కి ఎదురు నిలిచే సన్నివేశాలు అన్ని సెకండ్ హాఫ్ లో ఓ రేంజ్ లో ఉంటాయి. విజయశాంతి మరియు మహేష్ ల మధ్య కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా బాగా టచ్ చెస్తావి. సెకండ్ హాఫ్ లోను కామెడీని వదలకుండా అనిల్ రావిపూడి వెన్నెలకిషోర్ – సుబ్బరాజుల కాంబోలో నవ్వులు పూయించే ప్రయత్నం చేసాడు. కాకపోతే సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపించడం ఇబ్బంది పెట్టె అంశం. ఈ సినిమా మెయిన్ మైనస్ లలో నిడివి ముఖ్యంగా కనబడుతుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ లోని వచ్చే ట్రైన్ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ లోని కొండారెడ్డి బురుజు సీన్ తో మరోసారి మహేష్ హిస్టరీ తిరగరాసేలా సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఈ సినిమా కి క్లైమాక్స్ కాస్త వీక్ అనిపిస్తుంది. కథ పెద్దగా కొత్తగా అనిపించకపోయినా స్క్రీన్ ప్లే మంచి ఎంటర్టైనింగ్ గా మలచడం లో సినిమాకి మార్కులు పడతాయి. ఇక ఫైనల్ గా ఇప్పటివరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాల్లో కాస్త వేగం తగ్గిన సినిమాగా సరిలేరు నీకెవ్వరు మిగులుతుంది. మహేష్ బాబు ని మాస్ అవతారం లో చూపించి ఆయన అభిమానుల దగ్గర మార్కులు కొట్టేద్దామన్న ప్రయత్నం లో …సాధారణ సినిమా ప్రేక్షకుల మార్కుల గురించి డైరెక్టర్ పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కాస్త మిస్ అయిన ఫీలింగ్ అంతే.
సాంకేతికంగా..
దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలను మరోచిత్రం ఆలా వైకుంఠపురములో పాటలతో పోల్చకపోతే బావుంటాయి. పోలిస్తే మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ సినిమాకి మైనస్ అంటారు. ఇక దేవీ సినిమాలోని మాస్ మరియు ఎమోషనల్ సీన్స్ లో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బావుంది..ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన నేపధ్య సంగీతం అయితే మాములుగా ఉండదు. ఆర్మీ నేపథ్యంలోనూ, యాక్షన్ సన్నివేశాల్లో దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. ఇక కెమెరామెన్ రత్నవేలు పనితనం ప్రతీ ఫ్రేమ్ లో కనబడుతుంది. రిచ్ విజువల్స్ తో కెమెరా గొప్పదనం కనబడుతుంది. తమ్మిరాజు ఎడిటింగ్ విషయానికొస్తే.. సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చెయ్యాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవి గనక ఇంకాస్త షార్ప్ చేస్తే నిడివి సమస్య అయ్యేది కాదు. ఇక ముగ్గురు నిర్మాతలైన దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ సినిమాకి రిచ్ గా ఖర్చు పెట్టడంతో.. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్: 2.75/5