నిష్టూరమైనా …నిజమే…!!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఎన్నికల మధ్యలో ఆయన చేసిన విమర్శలు పైకి చూస్తే రాజకీయంగా కనిపిస్తాయి. కానీ [more]

Update: 2019-05-07 16:30 GMT

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఎన్నికల మధ్యలో ఆయన చేసిన విమర్శలు పైకి చూస్తే రాజకీయంగా కనిపిస్తాయి. కానీ లోతైన విషయాలను ప్రస్తావించారు. ఆర్థిక,రాజకీయ,విదేశాంగ విధానంలో రాజకీయాలకు, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన వ్యత్యాసాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. అంతేకాదు, ఆర్థిక సంస్కరణలకు పితామహుడనిపించే పీవీ నరసింహారావు, తొలి బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిల వ్యవహారశైలిని గుర్తు చేసేవిధంగా చురకలు అంటించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను ధ్వంసం చేయడం, స్వతంత్రత లేకుండా చేయడం దీర్ఘకాలిక దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఒకరకంగా చెప్పాలంటే రాజనీతిజ్ణతను చాటి చెప్పారు. జనసమ్మోహక శక్తిగా అత్యంత ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ అనతికాలంలోనే అత్యంత వివాదాస్పదంగా ఎలా మారారన్న విషయం కూడా మన్మోహన్ మాటల్లో అంతర్గతంగా దాగి ఉందనే చెప్పాలి.

విదేశాంగ ఖ్యాతి…

వ్యక్తి కంటే పార్టీ, పార్టీ కంటే దేశం గొప్పది అని నిరంతరం చెబుతూ ఉంటుంది భారతీయ జనతాపార్టీ. ఆ పార్టీ మూలసిద్దాంతాల్లో ఒకటిగా దీనిని సగర్వంగా చాటుకుంటుంటారు. కానీ నేడు దేశంలో , పార్టీలో జరుగుతున్న దేమిటి? ఎక్కడ చూసినా నమో మంత్రం. వ్యవస్థాపకులు, పార్టీకి పునాదిరాళ్లు అయిన వాజపేయి, అద్వానీ వంటివారి ముఖచిత్రాలు పోస్టర్లపై నుంచి క్రమేపీ కనుమరుగైపోతున్నాయి. వారు ప్రవచించిన పార్టీ సిద్దాంతాలు పక్కదారి పడుతున్నాయి. నరేంద్రమోడీ కరిష్మాతో అధికారంలోకి రావాలనే యావ పెరిగిపోయింది. వ్యక్తిపూజ, భజన ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మూలమూలలా విస్తరించింది. రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ వంటివారు సైతం నమో మంత్రాన్ని జపిస్తూ ఉండటాన్ని ఇందుకు పరాకాష్ఠగా చెప్పుకోవాలి. బీజేపీ గెలుపు అంటే నరేంద్రమోడీ విజయంగా స్థిరపడిపోయిన ప్రస్తుత తరుణంలో విదేశాంగ విధానమంటే మోడీ ఆలోచనలే అన్నట్లుగా తయారైపోయింది . పేరుకు విదేశాంగ మంత్రి ఉంటారు. విధానపరమైన వ్యవహారాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయమే చూస్తుంటుంది. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానుల రిసీవింగు మొదలు రిసెప్షన్ వరకూ అంతటా నమో..మయమే. ఇంతగా వ్యక్తిగత ప్రతిష్ఠకు ఆరాటపడటం విదేశాంగ విధానం కాదంటూ సుతిమెత్తగా, సూటిగానే చురకలు వేశారు మన్మోహన్.

ఆర్థిక రీతి….

కొన్ని వ్యవస్థలకు చట్టపరమైన, రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు మన రాజ్యాంగ నిర్మాతలు. పరిపాలన వ్యవస్థ రాజకీయ కార్య నిర్వాహక వర్గమైన ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎన్నికలలో గెలుపు కోసం, శాశ్వతంగా అధికారాన్ని స్థిరం చేసుకోవడం కోసం వ్యవస్థలను స్వార్థానికి వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు, కాగ్, ఎన్నికల సంఘం వంటివాటికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చారు. రిజర్వ్ బ్యాంకు వంటివాటికీ చట్టబద్ధమైన నిర్ణయాత్మక స్వేచ్ఛ కల్పించారు. వాటిని కనుసన్నల్లో పెట్టుకునేందుకు , నియంత్రించేందుకు తద్వారా ప్రభుత్వ ఆధిపత్యం చెలామణి చేయించుకునేందుకు ఈ అయిదేళ్ల కాలంలో సాగిన యత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ నిర్ణయాలు అన్నివేళలా కలిసిరావు. నోట్లరద్దు వంటి విధానాలను బలవంతంగా అమలు చేయించిన తీరునే ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. వ్యవస్థలు దెబ్బతింటే వ్యక్తులు దుర్వినియోగం చేసే ఆస్కారం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో దుష్పరిణామాలకు దారి తీస్తుంది. వ్యవస్థలు స్వేచ్ఛ కోల్పోవడం వల్ల దేశం గతి తప్పుతుందని మన్మోహన్ ఘాటుగా చెప్పడం కనువిప్పుగానే చెప్పాలి. ఆర్థికంగా సక్రమమైన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటే 2014 నాటికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు మాత్రమే ఉన్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు పదిన్నర లక్షల కోట్ల రూపాయలకు ఎలా చేరాయన్నదే మాజీ ప్రధాని ప్రశ్న. పైపెచ్చు మొండి బకాయిల పేరిట అయిదున్నరలక్షల కోట్ల రూపాయల రుణాలనూ రద్దు చేశారు. ఆర్థిక విధానాల్లో డొల్లతనాన్ని సైతం ఒక నిపుణుడిగా మన్మోహన్ దుయ్యబట్టారు. ఈ విషయమూ మోడీ అండ్ టీమ్ పునరాలోచించుకోవాల్సిన అంశమే. ఎందుకంటే ప్రశ్న లేవనెత్తినవాడు తలపండిన ఆర్థికవేత్త మాత్రమే కాదు, దేశంలో ఆర్థికసంస్కరణలకు ఆద్యుడు.

రాజకీయ నీతి…

రాజకీయాల్లో ప్రతిపక్షమన్నదే మనుగడ సాగించకూడదన్న భావన ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రశ్నించేవాడు లేకపోతే నియంతృత్వం వచ్చేస్తుంది. కాంగ్రెసు ముక్తభారత్ వంటి నినాదాలతో మొదలుపెట్టిన ప్రస్థానం ఇప్పుడు ప్రాంతీయపార్టీలపైనా పడుతోంది. అటు పశ్చిమబంగ, ఒడిసా వంటి కీలక రాష్ట్రాల్లో అధికారపార్టీల స్థానాన్ని ఆక్రమించాలనే తహతహ బీజేపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా మోడీ నేత్రుత్వంలో ఈ తాపత్రయం రెట్టింపుగా మారుతోంది. భిన్న రాజకీయ నేపథ్యాలు, సంస్క్రుతుల కలబోత అయిన దేశంలో ఏకపక్షంగా దున్నేద్దామన్న ధోరణి ఏమంత మంచిదికాదు. కలుపుకుపోవడమన్నది కనీస అవసరం. రాజకీయ వైరుద్ధ్యాలు, విద్వేషాలుగా, విభజనవాదాలుగా రూపుదాల్చకూడదు. విద్వేషాలు పెంచడం, విభజించడం ద్వారా దేశాధిపత్యం చెలాయించాలనుకుంటున్నారంటూ మన్మోహన్ విసిరిన చెణుకు చురుకు పుట్టించేదే. పైపెచ్చు సూటిగా తాకేది. మన్మోహన్ లోనూ రాటుదేలుతున్న రాజకీయ వేత్తను బయటపెట్టాయి ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాలు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News