మేకపాటి ఫెయిలయినట్లేనా?

మేకపాటి గౌతం రెడ్డి. ఆయన మంత్రి అన్న సంగతి బహుశా ఆయన సైతం మరచిపోయారేమో. ఆయన‌ భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి. నిజానికి గత తెలుగుదేశం [more]

Update: 2020-01-26 13:30 GMT

మేకపాటి గౌతం రెడ్డి. ఆయన మంత్రి అన్న సంగతి బహుశా ఆయన సైతం మరచిపోయారేమో. ఆయన‌ భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి. నిజానికి గత తెలుగుదేశం పాలనలో ఐటీ మంత్రిగా లోకేష్ ఉండేవారు. ఆయన హడావుడి ఎక్కువగా చేసేవారు. దానికి తోడు ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి నాటి సీఎం చంద్రబాబు చేసే జోరు, హుషార్ చెప్పనవసరం లేదు. ఎవరో ఒక బిజినెస్ టైకూన్ కి సచివాలయానికి రప్పించి చర్చలు జరపడం ద్వారా ఏపీలో ఏదో చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చేవారు. మరిపుడు అలాంటివి అవసరం లేదు కానీ మరీ తీసికట్టుగా ఐటీ శాఖ పనితీరు ఉందని విమర్శలు వస్తున్నాయి.

దావోస్ లో ఎక్కడ?

ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫారం సదస్సు ఈ సారి కూడా దావోస్ లో జరిగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ మెరిసిపోయారు. వివిధ దేశాల మంత్రులతో చర్చలు జరపడమే కాదు, పెద్ద పారిశ్రామిక వేత్తలతో భేటీలు వేయడం ద్వారా మొత్తం తానే అనిపించుకున్నారు. తెలంగాణాకు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అలుపెరగకుండా కలియతిరిగారు. సంప్రదింపులు జరిపారు. అక్కడ చూసుకుంటే ఏపీ గొంతుక కానీ, ఉనికి కానీ ఎక్కడా కనిపించలేదుగా.

ఎందుకిలా…?

దావోస్ సదస్సు అన్నది ప్రపంచ దేశాల వాణిజ్య ప్రగతికి ఒక కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్నది కూడా ముఖ్యమైనప్పటికీ, మనం ఎక్కడ ఉన్నామా అన్నది తెలుసుకోవడం, మన గురించి బయట వారికి చెప్పుకోవడానికి ఒక వారధిగా పనికివస్తుంది. గత అయిదేళ్ళలో చంద్రబాబు ఆయన టీం దావోస్ ని చుట్టుముట్టి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, ఇపుడు ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత తొలిసారిగా దావోస్ లో జరిగిన ఈ సమ్మిట్ కి ఐటీ మంత్రి వెళ్ళకపోవడం విచిత్ర పరిణామమే. మన గొంతుక అంతర్జాతీయ వేదిక మీద వినిపించకపోవడం భారీ వైఫల్యమే.

పట్టించుకోరా…?

మేకపాటి గౌతం రెడ్డి ఐటీ మంత్రిగా కనీసం అసెంబ్లీలోనూ పెద్దగా గొంతు విప్పిన దాఖలాలు లేవు. ఆయన ఏపీలో సైతం పదమూడు జిల్లాలు తిరిగిన సందర్భాలు లేవు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కారణంగా మంత్రి పదవి ఇచ్చారు తప్ప సొంత ప్రతిభ కాదని అర్ధమైపోతోంది. జగన్ స్వతహాగా వ్యాపారవేత్త. ఆయన ముఖ్యమంత్రి అయితే పెట్టుబడులు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆయన సైతం పట్టనట్లుగా ఉండడం, మంత్రి మేకపాటి సైతం సైలెంట్ మోడ్ లో ఉండడంతో ఏపీ దారుణంగా వెనకబడిపోతోంది. పొరుగున ఉన్న తెలంగాణా దూసుకుపోతూంటే కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఏపీ కాళ్ళు ముడుచుకోవడం బాధాకరమేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మరి మేకపాటి పని తీరు ఎంతబాగా నచ్చిందో తెలియదు కానీ జగన్ ఆయనకు తాజాగా నైపుణ్యాభివృధ్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో శాఖను కూడా కట్టపెట్టడమే అసలైన ట్విస్ట్.

Tags:    

Similar News