మోడీ ఆపరేషన్ సక్సెస్ అయింది...!

Update: 2018-05-15 15:30 GMT

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అతిపెద్దదిగా అవతరించడం ఆషామాషీగా జరగలేదు. పకడ్బందీ వ్యూహం, ప్రచారం, శ్రేణుల సమన్వయం, పోల్ మేనేజ్ మెంట్ వంటి అనేక అంశాలు అతి పెద్ద పార్టీగా అవతరించడంలో ముఖ్య పాత్రను పోషించాయని చెప్పకతప్పదు. యడ్యూరప్ప, అమిత్ షా, నరేంద్రమోదీ....గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. అంతర్గతంగా పార్టీ శ్రేణులను సమన్వయపర్చడంతో పాటు, అయిదేళ్ల సిద్ధరామయ్య అవినీతి పాలనను ఎండగట్టడంలో కృతకృత్యులు కావడం ఇంత పెద్ద మెజారిటీ రావడానికి దోహదం చేసింది. సామాజిక సమీకరణాలు, కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు కమలనాధులకు కలసి వచ్చాయనడంలో సందేహం లేదు. జీఎస్టీ, నోట్లరద్దు, పెట్రో ధరల పెంపు వంటి అంశాలు కన్నడ రాష్ట్రంలో పనిచేయలేదు.

గత పొరపాట్లను.....

ముందుగా 2013 ఎన్నికల పొరపాట్లను బీజేపీ చక్కదిద్దుకుంది. అప్పట్లో యడ్యూరప్ప, బళ్లారి శ్రీరాములు పార్టీకి దూరమై కమలనాధుల విజయావకాశాలను దెబ్బతీశారు. అవినీతి ఆరోపణలు, కేసులు వీరిపై ఉన్నప్పటికీ అదే సమయంలో ప్రజల్లోకూడా వారికి పట్టుంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను పార్టీ పక్కన పెట్టడాన్ని ఆ సామాజిక వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. బళ్లారి శ్రీరాములు వంటి బీసీ నాయకుడు పార్టీకి దూరమవ్వడంతో వారి ఓట్లు దక్కలేదు. అంతిమంగా పార్టీ పరాజయం పాలైంది. ఉప ప్రాంతీయ పార్టీగా పేరొందిన దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ ఎస్ మాదిరిగానే బీజేపీ 40 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ చేదు నిజాన్ని గ్రహించి బీజేపీ అధినాయకత్వం యడ్యూరప్ప, శ్రీరాములును చేరదీసింది. అలాగే గనుల కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన గాలి జనార్థన్ రెడ్డి కుటుంబాన్ని పక్కనపెట్టే సాహసం చేయలేకపోయింది. గాలికి బళ్లారి,రాయచూర్ లోమంచి పట్టుంది. అయినా పెద్దగా గాలి ప్రభావం చూపలేకపోయారు. అయినా కొద్దోగోప్పో సీట్లను సాధించగలిగారు.

ఇప్పటికే 18 రాష్ట్రాల్లో.....

కేంద్రంలో 2014లో అధికారం చేపట్టాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించిన బీజేపీ దక్షిణాది ముఖద్వారమైన కర్ణాటకపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇక్కడ విజయం సాధిస్తే దాని ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై ప్రభావం చూపుతుంది. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేక హోదా పేరుతో ఏపీలో తెలుగుదేశం కేంద్రంపై పోరాడుతుండగా, తృతీయ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కత్తులు నూరుతున్నారు. వారిద్దరికీ చెక్ పెట్టాలంటే కర్ణాటకలో గెలుపు అత్యంత ఆవశ్యకమని గుర్తించిన బీజేపీ ఆదిశగా పావులు కదిపింది. ప్రధాని మోదీ రెండు విడతల ప్రచారంలో ఏకంగా 21 సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రధాని స్థాయి నాయకుడు ఒక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇంత విస్తృతంగా ప్రచారం చేయడం గతంలో ఎక్కడా జరగలేదు. 19 మంది కేంద్రమంత్రులతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. అమిత్ షా దాదాపు రెండు నెలలుగా ఇక్కడే మకాం వేశారు. ప్రచారం చివరిరోజున ఏకంగా ఐదు రోడ్ షో లు నిర్వహించడం విశేషం. కర్ణాటక ఫలితాలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావని, జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంపై ప్రభావం చూపుతుందన్న భయంతో జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. అదేవిధంగా ఈ ఏడాది ఆఖరులో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలను ఎదుర్కొనడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో విజయానికి గల ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోకుండా పనిచేసింది. ముఖ్యంగా పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం, గతఎన్నికల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై దృష్టి సారించడం, ఇతర విషయాలను పూర్తిగా పక్కన పెట్టి విజయావకాశాలు ఉన్న వారిని మాత్రమే బరిలోకి దించడం వంటి అంశాలు అధిక సీట్లను సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడను ప్రశంసిస్తూ, గౌరవిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం వ్యూహాత్మకం. ఇది ఆయన సామాజిక వర్గానికి చెందిన ఒక్కలిగలను ఆకట్టుకుంది. రాష్ట్రంలోని లింగాయత్ , హిందూ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతోనే ప్రధాని మోదీ సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ నెల 11, 12 తేదీల్లో నేపాల్ పర్యటనకు వెళ్లారు. అక్కడి హిందూ దేవాలయాలను సందర్శించడం కూడా హిందూ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని చేసేందేనని చెప్పక తప్పదు.

బీజేపీ సక్సెస్ అవుతుందా?

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతుందంటూ చేసిన ప్రచారం ఫలితం ఇచ్చినట్లుగానే కనపడుతుంది. ప్రధాని మోదీ ప్రతి సభలో సిద్ధరామయ్య అవినీతి గురించి ప్రస్తావించడానికే ప్రాధాన్యమిచ్చారు. పర్సంటేజీల సర్కార్ అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, నిధులను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మొత్తం మీద కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రభావంతో పొరగున ఉన్న ఏపీ, తెలంగాణల్లో నూ విస్తరిస్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువలో ఉన్న బీజేపీ ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News