రెచ్చగొట్టడానికే మళ్లీ వచ్చినట్లుందిగా… ?

రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలు డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన రాష్ట్రాల విభజనలో కర్ణాటకకు పోయాయి. దాంతో ఘనమైన రాయలసీమ కాస్తా ఏమీ కాకుండా [more]

Update: 2021-07-22 06:30 GMT

రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలు డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన రాష్ట్రాల విభజనలో కర్ణాటకకు పోయాయి. దాంతో ఘనమైన రాయలసీమ కాస్తా ఏమీ కాకుండా ఒక ముక్కలా మిగిలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువమంది ఈ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక విభజన ఏపీలో కూడా ఇద్దరు సీఎంలు కూడా సీమ నుంచే ఉన్నారు. అయినా సీమకు అన్యాయం జరిగింది అంటున్నారు. నిజమే సీమకు జరిగిన అన్యాయం ముందు భౌగోళికంగా జరిగింది. ఒక మూలకు విసిరేసినట్లుగా విభజన ఏపీలో ఉంది. ఉమ్మడి ఏపీలో అయితే వారికి ఎంతో కొంత మేలు జరిగేది. ఇపుడు మరింతగా అన్యాయం అవుతోంది సీమ ప్రాంతం అంటున్నారు.

నీటి కొట్లాటలు…?

కృష్ణా, తుంగభ‌ధ్ర జలాల మీదనే సీమ ప్రాంతం మొత్తం ఆధారపడుతోంది. ఇక కృష్ణా నది మీద ఎంత ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే అంత ఎక్కువ నష్టం జరుగుతోదని చరిత్ర చెబుతోంది. ఎగువ రాష్ట్రాలు బిర బిరా కృష్ణమ్మను కట్టిపడేస్తున్నారు. దాంతో అరకొర నీరే దిగువకు వస్తోంది. ఇక అందులో కూడా కొత్త రాష్ట్రం తెలంగాణా పేచీలతో సీమకే ఎసరు పెడుతున్నారు. ఇంకో వైపు చూస్తే కృష్ణా నీటి విషయంలో సమాన వాటాను తెలంగాణా డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో మధ్యలో కేంద్రం వచ్చి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేయడంతో సీమకు దారుణమైన నష్టం వాటిల్లింది అని చెప్పకతప్పదు.

ఒరిగేది ఉందా …?

రాజకీయం కోసమే రాష్ట్రాల ముక్కలు అన్నది ఉమ్మడి ఏపీని రెండుగా చేశాక అందరికీ అర్ధమవుతున్న విషయం. ఇపుడు ప్రతీ దానికీ రెండు తెలుగు రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో సీనియర్ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు. సీమకు కూడా ఒక ప్రభుత్వం ఉంటే అన్యాయం జరిగేనా అంటున్నారు ఆయన. దాని అర్ధం ఏంటి అంటే గ్రేటర్ రాయలసీమట. సీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం కలుపుకుని ఒక రాష్ట్రం కావాలని చాలా కాలంగా డిమాండ్ వుంది. ఇపుడు మైసూరారెడ్డి నీటి వివాదాలు తీసుకుని మళ్ళీ సెగ రగిలిస్తున్నారులా ఉంది అంటున్నారు. అయితే దీని వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అన్నదే మేధావుల ప్రశ్న.

ఇంకా నష్టమే …?

తెలంగాణా సంపన్న రాష్ట్రం, కోస్తా బెల్ట్ తో ఉన్న ఆంధ్రా కూడా ఎప్పటికైనా కోలుకునే ఛాన్స్ ఉంది. కానీ పూర్తిగా దుర్భిక్షంతో సతమతం అయ్యే సీమను ప్రత్యేక రాష్ట్రం చేస్తే ఇంకా నష్టమే తప్ప లాభం లేదు అన్న మాట అయితే ఉంది. ఇవాళ క్రిష్ణా నీటితో కొట్లాడుకున్నా రేపటి రోజున దానిమీద ఎవరికీ నమ్మకాలు లేవు. అదే గోదావరి నీటిని కనుక సీమకు మళ్ళించే భగీరధ ప్రయత్నం జరిగితే తప్పకుండా సీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. అదే సమయంలో సీమకు గోదారే సరైన దారి అన్నది నీటి పారుదల రంగం నిపుణుల భావన కూడా ఏపీతో విడిపోతే గోదావరి నీరు అయినా సీమకు ఎలా దక్కుతుంది. మరి మైసూరారెడ్డి లాంటి వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా సీమ హక్కులను కాపాడుకునేలా పాలకులకు సూచనలు ఇస్తే బాగుంటుంది అన్నదే అందరి మాటగా ఉంది.

Tags:    

Similar News