దూకుడుతోనే దాడులా?

నందిగం సురేష్ …. యువ ఎంపీ. ఎవరికీ రాని ఛాన్స్ జగన్ నందిగం సురేష్ కు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ నందిగం సురేష్ అంటే [more]

Update: 2020-02-25 11:00 GMT

నందిగం సురేష్ …. యువ ఎంపీ. ఎవరికీ రాని ఛాన్స్ జగన్ నందిగం సురేష్ కు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ నందిగం సురేష్ అంటే ఎవరో పెద్దగా తెలియదు. రాజధాని అమరావతి ప్రాంతంలో పంటపొలాలు దగ్దం అయిన కేసులో నందిగం సురేష్ వెలుగులోకి వచ్చారు. రాజధాని ప్రాంతానికి చెందిన నందిగం సురేష్ కు జగన్ బాపట్ల పార్లమెంటు స్థానం టిక్కెట్ ఇచ్చారు. అనూహ్యంగా గెలుపొందిన సురేష్ ఇప్పుడు రాజధాని రైతులకు టార్గెట్ గా మారారు.

వివాదాలకు కేరాఫ్…..

నందిగం సురేష్ వివాదాస్పద వ్యక్తి. అందులో ఏమాత్రం సందేహం లేదు. యువకుడు కావడంతో దూకుడు ఎక్కువే. నందిగం సురేష్ గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కూడా విభేదాలు తలెత్తాయి. ఇసుక, క్వారీలకు సంబంధించిన వివాదం ఇద్దరి మధ్యన నడిచింది. రెండు వర్గాలు ఒక దశలో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వచ్చాయి. అధిష్టానం పెద్దల జోక్యంతో వివాదం కొంత సద్దుమణిగిందనే చెప్పాలి.

వరస సంఘటనలతో….

ఇక మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి నందిగం సురేష్ పై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులు సురేష్ అనుచరులు రెచ్చగొట్టడం వల్లనే జరుగుతున్నాయా? లేక నందిగం సురేష్ పై రాజధాని ప్రాంత వాసులు కక్ష పెంచుకున్నారా? అన్నది తెలియదు కాని వరసగా సురేష్ విషయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నా మధ్య నందిగామలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు గులాబీ పూలు ఇచ్చి నందిగం సురేష్ కు నిరసన తెలియజేశాయి. అయితే ఈ సంఘటన కూడా వివాదాస్పదమయింది. తనపై దాడికి టీడీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. దీంతో నందిగం సురేష్ ను అడ్డగించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

పరస్పర ఆరోపణలతో…..

రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారన్నది నందిగం సురేష్ ఆరోపణ. కానీ నందిగం సురేష్ తన అనుచరులతో కావాలనే రెచ్చగొడుతున్నారని రైతులు, టీడీపీ ఆరోపిస్తుంది. ఇటీవల జరిగిన సంఘటన చూసుకున్నా రాజధాని రైతులు, మహిళల బస్సు యాత్రను నందిగం సురేష్ అనుచరులు అడ్డుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. బస్సు ప్రధాన ద్వారం వద్ద అడ్డుపెట్టి మహిళలను దిగనివ్వకుండా చేశారని వారు అంటున్నారు. సురేష్ మాత్రం తాను దళితుడైనందునే తనపైన టీడీపీ దాడులు చేయిస్తుందంటున్నారు. మొత్తం మీద రాజధాని ప్రాంతానికి ఆయన ప్రాతినిధ్యం వహించకపోయినా వరసగా వివాదాలు చోటు చేసుకుంటుడటం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News