బలవంతగా రుద్దేస్తున్నారా? అందుకు ఒప్పుకుంటారా?

తెలుగుదేశం పార్టీ ఇపుడు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అందుబాటులో ఉన్న వారు తమ్ముళ్ళకు నచ్చడంలేదు. కావాల్సిన వారు అందుబాటులో లేరు. దాంతో నాయకత్వ సంక్షోభమే ఆ పార్టీని [more]

Update: 2020-06-13 05:00 GMT

తెలుగుదేశం పార్టీ ఇపుడు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అందుబాటులో ఉన్న వారు తమ్ముళ్ళకు నచ్చడంలేదు. కావాల్సిన వారు అందుబాటులో లేరు. దాంతో నాయకత్వ సంక్షోభమే ఆ పార్టీని క్రుంగదీస్తూ దిగలాగేస్తోంది. టీడీపీలో ఉన్న సీనియర్లు, మాజీ మంత్రులు ఆలోచిస్తున్నది ఇప్పటి గురించి కాదు, 2024 గురించే వారి ఆలోచనలు. గట్టిగా నాలుగేళ్ళ కాలం ఉంది. ఇంతటి సుదీర్ఘ కాలం పార్టీని నెట్టుకుని రావాలి. ఆనాటికి విజయ తీరాల వైపుగా నడిపించాలి. అంటే ఎన్టీయార్ లాంటి చరిష్మాటిక్ పర్సనాలిటీ కావాలి. కనీసం అందులో సగమైనా ఉంటే చాలు అనుకున్న వారూ ఉన్నారు.

సరిపోడా…?

లోకేష్ ని మాత్రమే చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కనీసం బావమరిది బాలక్రిష్ణను కూడా కలుపుకునిపోవడంలేదు. బాలయ్యని కేవలం ఎమ్మెల్యేగానే ఉంచేసారు. పోలిట్ బ్యూరో మెంబర్ గా చేసి పార్టీ కాడె మోయమని చెప్పడంలేదు. బావ బాబు చెప్పని పని బాలయ్య ఎందుకు చేస్తారు. అందుకే మిన్నకున్నారు. నిజానికి టీడీపీకి ఇలాంటి సమస్యలు అన్నీ చంద్రబాబు కోరి తెచ్చిపెట్టుకున్నవేనని పార్టీలోని వారే అంటున్నారు. బంగారం లాంటి నందమూరి కుటుంబం అండగా ఉండగా వారిని వేలూ కాలూ పెట్టనీయకుండా అంతా నారామయం చేయాలన్న స్వార్ధమే టీడీపీని ఈ స్థితికి తెచ్చిందని అంటున్నారు. బాలయ్య నిజానికి సరిపోడా అని చాలా మంది అడుగుతున్న ప్రశ్న.

కష్టమేనా …?

లోకేష్ రాజకీయ అరంగేట్రమే ఓ రాంగ్ ట్రాక్ తో పడింది. ఆయన నేరుగా ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి దర్జాగా సింహ ద్వారం గుండా రాజకీయ ప్రవేశం చేయాల్సిన గోల్డెన్ చాన్స్ ని బాబు దగ్గరుండి పాడుచేశారు. ఓడిపోయి మూలన కూర్చున్న బ్యాచ్ తో లోకేష్ ని కలిపేసి ఎమ్మెల్సీని చేశారు. ఆ తరువాత మంత్రిని కూడా చేసి ఆయన పనితనం కూడా తెలుగుదేశం జనానికి చూపించేశారు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి లో పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. ఇపుడు ఆయన మీద ఏ రకమైన ఆశలు అంచనాలు లేకుండా చేసిన చంద్రబాబు బలవంతంగా పార్టీ మీద రుద్దుతున్నారన్న భావన ఉంది. మరి తమ్ముళ్లకు మాత్రం లోకేష్ ని పూర్తిగా చూసేశాక ఇక ఆయన లో పొలిటికల్ మెటీరియల్ పెద్దగా లేదని మధనపడుతున్నారు. తెలుగుదేశం బండి ఈయనతో నడవదు అని గట్టిగా నిర్ధారణకు వచ్చేశారు అంటున్నారు.

ఒప్పుకోరా…?

ఇవన్నీ ఇలా ఉంటే నిన్నటిదాకా టీడీపీలో పెద్ద నాయకునిగా ఉంటూ వచ్చిన వైసీపీ ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా ఒప్పుకోరని అంటున్నారు. అంతెందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేత లోకేష్ కి జై అనిపించండి అంటూ బాబును సవాల్ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు గంటాని ప్రస్తావనకు తెచ్చినా మాజీ మంత్రులు, సీనియర్లకు లోకేష్ అంటే ఇష్టం లేదని మాజీ తమ్ముడిగా అవంతి టీడీపీలో ఉన్న మాటే చెప్పారనుకోవాలేమో. ఈ నేపధ్యంలో బాబు ఎంతగా లోకేష్ ని ప్రమోట్ చేసినా కూడా టీడీపీలో ఆక్సెప్టెన్స్ తక్కువగా ఉంటోంది. ఓ విధంగా లోకేష్ తన నాయకత్వాన్ని నిరూపించుకునేందుకు ఏదో అద్భుతమే చేయాలేమో.

Tags:    

Similar News