ఎవరూ ఏమీ చేయలేకపోతుంది…అందుకేగా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఆయనను కదల్చడం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇంతకీ ఆయన విజయరహస్యమేంటన్నది [more]

Update: 2021-01-22 18:29 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఆయనను కదల్చడం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇంతకీ ఆయన విజయరహస్యమేంటన్నది ఇతర రాష్ట్రాల సీఎంలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అధికారంలోకి వస్తే ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వచ్చే ఈరోజుల్లో ఐదు దఫాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్నారంటే ఆయన రాజకీయాలు సపరేట్ అని చెప్పుకోవాలి.

ప్రజా సమస్యలకే….

నవీన్ పట్నాయక్ రాజకీయాల కంటే ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల మాదిరిగా ఎన్నికల తర్వాత రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాగే రాష్ట్ర పరిధిని దాటి ముందుకు వెళ్లరు. తన ఆస్తులను కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ నిజాయితీని చాటుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అందుకే దేశ రాజకీయాలలో నవీన్ పట్నాయక్ ది విలక్షణ శైలి అని చెప్పక తప్పదు.

అందరితో సఖ్యతగా…..

నవీన్ పట్నాయక్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటారు. కాంగ్రెస్ కేంద్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నా కయ్యానికి కాలు దువ్వలేదు. ఇప్పుడు బీజేపీ ఏడేళ్ల పాటు అధికారంలో ఉన్నా దానితో కలహానికి దిగలేదు. అందుకే రెండు జాతీయ పార్టీలు ఒడిశాలో వేలు పెడదామని ప్రయత్నించినా చేతులు కాల్చుకోవడం మినహా సాధించిందేమీ లేదు.

అవినీతి అంటేనే….?

ఇక నవీన్ పట్నాయక్ అవినీతిని సహించరు. తన హయాంలో ఎంతో మంది అధికారులను అవినీతి ఆరోపణలపై విధుల నుంచి తొలగించారు. కొందరిని డిస్మిస్ కూడా చేసి పారేశారు. మంత్రుల విషయంలోనూ ఆయన సహించరు. పార్టీకి, ప్రజలకు మాత్రమే ఆయన జవాబుదారీగా ఉంటారు. దీనివల్లనే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా ఉప ఎన్నికల్లో సయితం ఆయనకు ఇరవై ఏళ్లకు పైగా తిరుగులేకుండా ఉంది. అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ ను ఆదర్శంగా తీసుకోవడం అవసరం.

Tags:    

Similar News