మధ్యతరగతి మహా నేత...!

Update: 2018-06-28 13:30 GMT

ప్రపంచదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఆరోపెద్ద ఆర్థిక వ్యవస్థగా రొమ్ము విరుచుకుంటోంది. పేదరికం ఛాయల నుంచి బయటపడి పెద్దన్న పాత్రలోకి వచ్చేసింది. ఒకనాడు కష్టాలు, కడగండ్లతో కడు దీనంగా కనిపించే మధ్యతరగతి నేడు మందహాసం చేస్తోంది. సొంత ఇళ్లు, కార్లు, పిల్లలకు ఉన్నత,విదేశీ విద్యలు అంతా సాధారణ తంతుగా సాగుతున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం ఇది కలలోని మాట. ప్రజలే కాదు, దేశమూ పేదరికంతో మగ్గుతోంది. అప్పుల ఊబిలో హలో లక్ష్మణా అంటూ అల్లాడుతోంది. ఆ స్థితిలో కష్టాల కావడిని భుజాలకెత్తుకున్నాడు. వజ్ర సంకల్పంతో భారత్ ను ఒడ్డెక్కించాడు. అతడే రాజనీతిజ్ణుడు, దార్శనికుడు, మౌన ముని మన పీవీ. పీవీ జయంతి సందర్భంగా తెలుగు పోస్ట్ ప్రత్యేక కథనం...

భవిత వైపు.. ముందు చూపు...

పీవీ నరసింహారావు పేరు చెబితే ఆర్థిక సంస్కరణలనే చెబుతారు. కానీ 1971లో ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన భూసంస్కరణలు, పట్టణభూగరిష్ఠ పరిమితి చట్టం వంటివాటికి శ్రీకారం చుట్టారు. వెనకబడిన తరగతులకు 70 శాతం సీట్లు ఇచ్చేందుకు పూనుకున్నారు. పరిపాలన సంస్కరణలకూ నాంది పలికారు. కానీ జై ఆంధ్ర ఉద్యమం, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవేమీ ఆయనకు కలిసి రాలేదు. సంస్కరణ వాదిగా సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి రాజకీయ వైరుద్ధ్యాల్లో మరుగున పడిపోయింది. దూర దృష్టితో కూడిన రాజనీతిజ్ణత ఆయనకు వెన్నుదన్నుగా నిలిచింది. నెహ్రూ హయాం నుంచి దేశ రాజకీయాలను చూసిన పీవీ తన పాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు భారత జాతి అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలు. జనాభాలో అట్టడుగున్న ఉన్న వర్గాలు పైకి రావడానికి, మధ్యతరగతి జీవన రూపురేఖలు మార్పు చెందడానికి ఆయన తీసుకు వచ్చిన సంస్కరణలు దోహదం చేశాయి.

సమర్థత.. సాధికారత...

అధికారం ఎవరో ఇస్తే వచ్చేది కాదు, మనం తీసుకున్న నిర్ణయాలు, చేసే చర్యలపైనే ఆధారపడి ఉంటుందని నూటికి నూరుపాళ్లు విశ్వసించిన నాయకుడు పీవీ. నెహ్రూ కాలంలో 1956లో పారిశ్రామిక విధానంపై తీసుకున్న తీర్మానం భారత్ కు ఒక మార్గదర్శిగా నిలిచింది. కానీ కాలమాన పరిస్థితులను తట్టుకోలేకపోయింది. బ్యూరోక్రటిక్ సోషలిజం ఏర్పడింది. లైసెన్సు రాజ్ , పర్మిట్ రాజ్ తో పారిశ్రామిక విధానం భ్రష్టుపట్టిపోయింది. అందుకే 1956 లో నెహ్రూ ప్రవేశపెట్టిన విధానానికి భిన్నంగా 1990లలో పీవీ కొత్త విధానానికి తెర తీశారు. పర్మిట్ రాజ్ కు మంగళం పాడేశారు. ప్రధానమంత్రిగా ఉంటూ పరిశ్రమల శాఖను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో నే ఈమార్పులను చేపట్టారు. నేటికీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తూ యూపీఏ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాథమికంగా ప్రారంభించింది పీవీ నరసింహారావు హయాంలోనే. దేశం విదేశాలకు చెల్లింపులు జరపలేని స్థితి నుంచి స్వావలంబన, స్వయం సమ్రుద్ధి సాధించడంలో ఆయన చేసిన క్రుషి అచంచలం. ఆర్థిక మంత్రిగా మన్ మోహన్ ఎంపిక మొదలు విధాన నిర్ణయాల వరకూ పీవీ తరహా మార్పు భవిష్యత్తుకు లాండ్ మార్కుగా స్థిరపడింది.

చాణక్యం...

నెహ్రూ కుటుంబ వారసత్వం లేదు. ప్రజల్లో పలుకుబడి శూన్యం. ప్రజాకర్షణ నిల్. మైనారిటీ సర్కారు. అయినా అయిదేళ్లు పాలించేశారు. అదీ చాణక్యం అంటే. అన్నీ కలిసొస్తే రాజ్యం చేయడం రాచరికం అనుభవించడం కష్టమేమీకాదు. పరిస్థితులు ప్రతికూలించినప్పుడే నాయకుడు బయటపడతాడు. భారత దేశం విషయానికొస్తే కాలం స్రుష్టించిన లీడర్ పీవీ. కాలమానపరిస్థితులన్నీ ఎదురుతిరుగుతున్నా నిభాయించి నిలదొక్కుకుని దేశాన్ని నిలబెట్టిన నాయకుడు. 1991లో గల్ఫ్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ చమురు సంక్షోభంతో ద్రవ్యోల్బణం ఉరుమురిమి చూస్తోంది. సోవియట్ పతనంతో భారత్ పెద్దన్న అండ కోల్పోయింది. పంజాబ్ తీవ్రవాదం పెచ్చరిల్లుతోంది. వీటన్నిటికీ పీవీ తన కాలంలో పరిష్కారాలు వెదికారు. దేశంలో తీవ్రవాదాన్ని కట్టడి చేశారు. ఇరాన్, చైనా లతో సంబంధాలు మెరుగుపరిచారు. ఇజ్రాయల్ తో సత్సంబంధాలు నెలకొల్పారు. దేశ ఆర్థిక రాజకీయ అవసరాలకోసం, పటిష్ఠత కోసం తూర్పుదేశాలవైపు చూడాలన్న నూతన పంథాను తీసుకున్నారు. రాజకీయ సన్యాసం తీసుకుందామనుకున్న దశలో రాజ్యబాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. అయినా కర్మయోగిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. దటీజ్ పాములపర్తి వెంకటనరసింహారావు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News