పక్కన పెట్టినట్లేనా…??

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సంగతి వేరే చెప్పనక్కరలేదు. అయితే దక్షిణాదిన మాత్రం కర్ణాటకలో మినహా ఎక్కడా మోదీ [more]

Update: 2019-06-06 17:30 GMT

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సంగతి వేరే చెప్పనక్కరలేదు. అయితే దక్షిణాదిన మాత్రం కర్ణాటకలో మినహా ఎక్కడా మోదీ మంత్ర పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తమిళనాడుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో ఎన్నికలకంటే ముందుగా పొత్తు పెట్టుకుంది. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ అతి తక్కువ సీట్లను తీసుకుని అన్నాడీఎంకేకు అండగా నిలవాలని భావించింది.

కలసి వస్తుందని భావించి…..

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వంతో పాటు, రెండాకుల గుర్తు, అన్నాడీఎంకే ఓటు బ్యాంకు తమకు కలసి వస్తాయని భావించింది. ఉత్తరాదిన గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గినా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పూడ్చుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే ఎన్నికలకు ముందే పియూష్ గోయల్ ను పంపి పొత్తును ఖరారు చేసుకున్నారు. తమిళనాడులో కూటమి ఏర్పడిన తర్వాత బలంగానే కన్పించింది.

ఒక్క సీటూ రాకపోవడంతో….

అయితే ఫలితాలు చూసిన తర్వాత కమలనాధులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయారు. అన్నాడీఎంకే ఒక్క స్థానానికే పరిమితమయింది. డీఎంకే కూటమి లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాలను స్వీప్ చేసింది. దీంతో మోదీకి అన్నాడీఎంకే ను వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే పూర్తిగా విఫలమవుతుందని కమలనాధులు అంచనా వేసుకున్నారు.

వదిలించుకున్నట్లేనా….?

అందుకే తమమిత్రపక్షమైన అన్నాడీఎంకేకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు. గెలిచిన ఒకే ఒక ఎంపీ పన్నీర్ సెల్వం తనయుడు రవీంద్రనాధ్. పన్నీర్ సెల్వానికి, మోదీకి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటారు. ఒకదశలో పళనిస్వామిని కాకుండా పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిని చేయాలని మోదీ భావించారని కూడా చెబుతారు. అలాంటి పన్నీర్ సెల్వం తనయుడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు మోదీ ఇష్టపడలేదు. దీన్ని బట్టి అన్నాడీఎంకేను పక్కనపెట్టి, త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ ను పక్కన పెట్టుకోవాలని కమలనాధులు భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే అయితే పళని, పన్నీర్ లకు ఇక్కట్లు తప్పేలా లేవు.

Tags:    

Similar News